- కేటీఆర్ హరీష్ లకు కీలకం కానున్న విచారణలు
- ఈ వారమే ఇద్దర్నీ వేరువేరు కేసుల్లో విచారించే అవకాశం
- ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్‌కు… కాలేశ్వరం ప్రాజెక్టు కేసులో హరీష్ కు త్వరలో నోటీసులు
- ఊహించిందే అంటున్న ఇద్దరు నేతలు
- ఈ వారంలో అత్యంత కీలక పరిణామాలు ఉంటాయంటూ ప్రచారం
కేసులు… విచారణలు… అరెస్టులు… ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఏ ఇద్దరు నాయకులు కలిసినా ఈ అంశాలపైనే చర్చ. బీఆర్ఎస్ నాయకులపై చిన్నాచితకా కేసులు పెట్టి అరెస్టులు చేయడం… వారు బెయిల్ తీసుకుని బయటకు రావడం గత కొన్ని నెలలుగా సర్వసాధారణం అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. అయితే ఈ అరెస్టులు బెయిళ్లు రెగ్యులర్‌గా ఉంటున్నప్పటికీ… ప్రస్తుతం మాత్రం హాట్ టాపిక్ ఇద్దరు అగ్రనేతల పైనే నడుస్తోంది. ఆ ఇద్దరూ మరోవరో కాదు బావా బావమరుదులైన కేటీఆర్, హరీష్ రావులు. తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేర్లు వారివి. అవునన్నా కాదన్న టిఆర్ఎస్ లో వాళ్ళిద్దరూ అత్యంత కీలకం. అధికారాన్ని కోల్పోయిన తర్వాత కెసిఆర్ పెద్దగా పబ్లిక్ లోకి రావడం లేదు. ప్రజా సమస్యలపై పోరాటాలు, ధర్నాలు అంటూ కేటీఆర్, హరీష్లే హడావిడి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ వారం బావాబావమరుదులు ఇద్దరికీ అత్యంత కీలకం కానుంది. ఫార్ములా ఈ రేస్‌కి సంబంధించి ఇప్పటికే ఏసీబీ ఈడీ కేసులను కేటీఆర్ ఎదుర్కొంటున్నారు. రెండు విచారణ సంస్థల ముందుకు విచారణకు కూడా వెళ్లొచ్చారు.. అయితే ఈ వారం మరోసారి ఏసీబీ కేటీఆర్‌ను విచారణకు పిలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మళ్ళీ విచారణకు పిలిస్తే ఈసారి కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు అంటున్నాయి. ఆ కీలక పరిణామాలు అరెస్టేనా అంటూ ఊహగానాలు వినిపిస్తున్నాయి. కేటీఆర్‌తో పాటు అధికారులను ఇతరులను విచారించిన ఏసీబీ మరింత లోతుగా ఈసారి కేటీఆర్‌ను విచారించే అవకాశం ఉంది.
ఇక మరో ముఖ్య నేత హరీష్ రావును కూడా ఇదే వారంలో కాలేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి కేసులో కమిషన్ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వారమే కమిషన్ హరీష్ కు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. సాగునీటి శాఖ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలను కమిషన్ విచారించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు నిధుల సేకరణ ఇతర విషయాలకు సంబంధించి అవినీతి జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది దానికి అనుగుణంగానే విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. మొదటిసారిగా ఈవారంలోనే కమిషన్ హరీష్ రావును విచారించనుంది. ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదని ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని హరీష్ రావు అంటున్నారు. అయితే సాగునీటి శాఖకు సంబంధించిన అధికారులను ఇప్పటికే విచారించిన కమిషన్ కీలక అంశాలను హరీష్ రావు ద్వారా రాబట్టేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. కేటీఆర్ ను విచారించిన సందర్భంలో గతంలో తెలంగాణ భవన్లో హరీష్ రావు అందుబాటులో ఉంటూ నాయకులను కోఆర్డినేట్ చేశారు. ఈసారి ఇద్దరు అగ్రనేతలు విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నందున ముఖ్య నేతలు అందరు కూడా తెలంగాణ భవన్లో అందుబాటులో ఉండాలన్న సమాచారాన్ని ఇచ్చినట్లుగా తెలిసింది. మొత్తానికి బీఆర్ఎస్ కు సంబంధించి ఇద్దరు కీలక నేతలకు ఈ వారం అత్యంత కీలకం కానుంది.