32.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

ఢిల్లీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలెన్నో…

  • కొన్ని చోట్ల అభ్యర్ధుల తారుమారు..
  • మరికొన్ని చోట్ల క్యాండిడేట్లను మార్చిన పార్టీలు
  • సిసోడియా సీటు మారింది.. మరి గెలుపు?
  • అతిషి గెలుపుకి ఢోకా లేదా?

వచ్చే నెలలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హేమా హేమీలు తలపడుతున్నారు. నాలుగు చోట్ల ముక్కోణపు పోటీ నెలకొంది. కొన్ని నియోజక వర్గాల్లో అభ్యర్ధులు పార్టీలు మారారు. మరికొన్ని చోట్ల పార్టీలు అభ్యర్ధులను మార్చాయి. ఈ నేపధ్యంలో 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌ తలరాత ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. ఎలాగైనా గెలవాలని బీజేపి పట్టుదలతో ఉన్న నేపధ్యంలో ఆప్‌ కి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి.

ముఖ్యంగా ఆప్‌ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ను ఓడించేందుకు పట్టుదలతో ఉన్న బీజేపి, కాంగ్రెస్ అందుకు సమ ఉజ్జీలను బరిలోకి దింపాయి. దాంతో కీలకమైన న్యూఢిల్లీ నియోజక వర్గంపైనే అందరి దృష్టి మళ్లింది.2013 నుంచి ఇప్పటి వరకూ మూడుసార్లు అరవింద్‌ అదే నియోజక వర్గం నుంచి తలపడ్డారు. వరుస విజయాలు చవిచూశారు.తొలిసారి అప్పటి ఢిల్లీ సీఎం షీలాదీక్షిత్‌ను భారీ మెజారిటీతో మట్టి కరిపించారు. అప్పటికి మూడు సార్లు (1998-2013)అదే నియోజకవర్గం నుంచి గెలిచిన షీలా 2013లో మాత్రం అరవింద్‌ చేతిలో ఓడిపోయారు. మళ్లీ ఇప్పుడు ఈ నియోజక వర్గంలో ముక్కోణపు పోటీ అనివార్యమైంది. ఈసారి అరవింద్‌ కు పోటీగా షీలా దీక్షిత్‌ కుమారుడు సందీప్‌ దీక్షిత్‌ బరిలో నిలబడగా,బీజేపి నుంచి పర్వేష్‌ వర్మ బరిలో నిలిచారు. షీలా దీక్షిత్‌ రాజకీయ వారసత్వం సందీప్‌ కు కలిసొచ్చే అంశం కాగా, ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్‌ సింగ్‌ వర్మ కుమారుడు పర్వేజ్‌ కు తండ్రి వారసత్వం కలిసొచ్చే అంశం. ఇలా ఇద్దరు మాజీ సీఎంల కొడుకులు బరిలో నిలుస్తుండగా, వీరికి గట్టి పోటీనిస్తున్నది అరవింద్‌ కేజ్రీవాలే.

విద్య,హెల్త్ కేర్‌ రంగాలలో అరవింద్‌ అనుసరించిన విధానాలు బాగా పేరు తెచ్చాయి. దీనికి తోడు ఆయన ప్రస్తుతం అందిస్తున్న పథకాలు, నగదు పంపిణీ అరవింద్‌కు కలిసొచ్చే అంశాలు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజక వర్గంలో గెలుపెవరిదోమరి.

జంగ్‌ పురా సిసోడియాను గట్టెక్కిస్తుందా?

ఇక మరో కీలకమైన నియోజక వర్గం జంగ్‌ పురా.. 2015లోనూ 2020లోనూ కూడా ఈ సీటు ఆప్‌ పార్టీదే. అప్పట్లో ప్రవీణ్‌ కుమార్‌ ఇక్కడ నుంచి గెలుపొందగా, ఈసారి ఇక్కడ నుంచి ఆప్‌ నేత మనీష్‌ సిసోడియా రంగంలోకి దిగుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో పట్టుబడి కొన్నాళ్లు జైలు జీవితం గడిపి ఇప్పుడు ఎన్నికల్లో నిలబడిన మనీష్ సిసోడియా కి మైనస్ పాయింట్‌.మరోవైపు బీజేపి తర్వీందర్ సింగ్‌ మార్వాను బరిలోకి దింపింది. కాంగ్రెస్ నుంచి పర్హద్‌ సూరీ రంగంలోకి దిగుతున్నారు. గతంలో రెండుసార్లు ఇక్కడనుంచి ఆప్‌ గెలుపొందింది. మనీష్‌ ను ఇక్కడ నుంచి పోటీకి పెట్టడం ఒక రకంగా రిస్కీ గేమ్‌ కిందే లెక్క. ఈ ముక్కోణపు పోటీలో విజయం ఎవరిని వరిస్తుందో మరి.2020లో ఆప్‌ ఇక్కడనుంచి 15 వేల మెజారిటీతో గెలిచింది. కానీ ఈసారి బీజేపికి గెలుపు అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

అతిషీకి ఢోకా లేదా?

ఇక ఢిల్లీ ఎన్నికల్లో మరో నియోజక వర్గం కాల్కాజి. ఇక్కడ కూడా ముక్కోణపు పోటీయే. ఢిల్లీ ప్రస్తుత సీఎం అతిషీ ఆప్‌ తరపున ఇక్కడనుంచి బరిలో నిలవగా బీజేపి నుంచి రమేష్‌ బిధురి, కాంగ్రెస్ నుంచి అల్కా లాంబా బరిలో నిలుచుంటున్నారు.అతిషీ ఈమధ్యకాలంలో విద్యారంగంలో కీలక సంస్కరణలను అమలు చేసిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.గ్రామాల్లో ఈ విద్యాసంస్కరణల ఫలితాలు అమలవుతున్నాయి కూడా.2020 ఎన్నికల్లో ఇక్కడినుంచే బీజేపి నేత ధరమ్‌ బీర్‌ ను ఓడించి అతిషీ గెలుపొందారు. అయితే ఈసారి అతిషీ గెలుపు అంత సులభం కాదు. బరిలో నిలిచిన ప్రత్యర్ధులు రమేష్‌ బిధురి, అల్కాలాంబా ఇద్దరూ గట్టి అభ్యర్ధులే.అల్కా లాంబా ఒకప్పటి ఆప్‌ నేతే. ఇప్పుడు కాంగ్రెస్‌ లో చేరి అతిషీపై తలపడుతున్నారు. మహిళల సామాజిక, ఆర్థిక సాధికారత పై పూర్తి అవగాహన ఉన్న అల్కా లాంబాకి అనేక విద్యార్ధి సంఘాల కమిటీలకు నేతృత్వం వహించిన అనుభవం కూడా ఉంది.ఇక బీజేపి అభ్యర్ది రమేష్‌ బిధురి దక్షిణ ఢిల్లీపై పూర్తి పట్టున్న వ్యక్తి.రెండుసార్లు ఇక్కడనుంచి ఎంపీగా గెలిచిన అనుభవం ఉంది.బిధురి గతంలో తుగ్లక్ బాద్‌ సీటు నుంచి కూడా బీజేపి అభ్యర్దిగా మూడు సార్లు గెలుపొందారు. ఆయనకు ఎన్నికల సమీకరణాలపై మంచి పట్టుంది.కాబట్టి అతిషి, అల్కా లాంబా ఇద్దరికీ ఆయన గట్టి పోటీ ఇవ్వగలరు.

మాలవీయ నగర్‌ నుంచి సోమనాథ్‌ భారతి..

ఆప్‌ నేతల్లో మరో కీలక నేత సోమనాథ్ భారతీ మాలవీయ నగర్‌ నుంచి బరిలో నిలిచారు. ఇక్కడనుంచి గతంలో మూడుసార్లు గెలుపొందిన సోమనాథ్‌ ఇప్పుడు అదే జోష్‌ తో మళ్లీ పోటీ చేస్తున్నారు.2015,2020 ఎన్నికల్లో ఆయన 50 శాతానికన్నా ఎక్కువ ఓట్‌ షేర్‌ తో గెలుపొందారు. బీజేపి నుంచి సతీష్‌ ఉపాధ్యాయ, కాంగ్రెస్‌ నుంచి జితేంద్రకుమార్‌ కొచ్చార్‌ బరిలో నిలిచారు. విద్యా కమిటీ ఛైర్మన్‌ గా అపార అనుభవం ఉన్న సతీష్‌ ఉపాధ్యాయ, సామాన్యులకు అందుబాటులో ఉండే కష్టించి పని చేసే నేత.అయితే సోమనాథ్‌ భారతి ఢిల్లీ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ పబ్లిక్‌ అక్కౌంట్స్ కమిటీ ఛైర్మన్‌ గా కూడా పని చేసిన అనుభవం ఉంది. సహజంగా లాయర్‌ కావడంతో అవగాహన ఎక్కువ.

ఓఖ్లా నియోజకవర్గం ః ఓఖ్లా నియోజక వర్గం నుంచి రెండు సార్లు గెలిచిన అమానతుల్లా ఖాన్‌ ఈసారి కూడా బరిలోకి దిగుతున్నారు. బీజేపి, కాంగ్రెస్ అభ్యర్ధులను ఇంకా ప్రకటించనప్పటికీ అమానతుల్లా ఖాన్‌ కే ఈసారి విజయావకాశాలు ఎక్కువ. రాజకీయంగా వివాదాస్పదుడు. ఢిల్లీ అసెంబ్లీలో బలంగా గళం వినిపించే నేత. అంతే ఎక్కువగా వివాదాలను నెత్తికెత్తుకుని అనేక కేసుల్లో ఇరుక్కున్నారు.మూడోసారి కూడా అమానతుల్లా ఖాన్‌ కే విజయావకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రతాప్‌ గంజ్‌దక్కేదెవరికి?

ఒకప్పుడు మనీష్‌ సిసోడియా కంచుకోటగా పేరుపడిన ఈ నియోజక వర్గంలో ఈసారి ఆప్‌ అభ్యర్ధి మారారు. గతంలో టీచర్‌ గా పనిచేసి రాజకీయ నేతగా మారిన అవథ్ ఓఝా ఈసారి బరిలోకి దిగారు.బీజేపి నుంచి రవీందర్ సింగ్‌ నేగి, కాంగ్రెస్‌నుంచి అనిల్‌ చౌదరి బరిలో నిలుస్తున్నారు. ఆప్‌ కన్నా ముందు కాంగ్రెస్‌ రెండు సార్లు ఈ సీటును గెలుచుకుంది.అయితే 2020 నాటికల్లా సీన్‌ మారిపోయింది. బీజేపి, ఆప్‌ మధ్య ప్రధాన పోటీగా మారిపోయింది.గతంలో సిసోడియాపై గెలిచిన నేగీ ఈసారి కూడా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఆప్‌ కి కూడా ఇది పట్టున్న సీటే కావడంతో ఈసారి ఆప్‌ గెలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు. కాంగ్రెస్ అభ్యర్ది కూడా గెలుపు కోసం గట్టిగానే కృషి చేస్తున్నారు.

షాకూర్‌ బస్తీలో జైన్‌ గెలుస్తారా?

ఆప్‌ నేతల్లో మరో కీలక నేత సత్యేంద్రకుమార్ జైన్.. షాకూర్‌ బస్తీ నుంచి ఆయన పోటీ పడుతున్నారు. మూడుసార్లు వరుసగా ఇక్కడనుంచి గెలిచి హాట్రిక్‌ విజయం సాధించిన జైన్‌ నాలుగోసారి గెలుపుకోసం ఉవ్విళ్లూరుతున్నారు.ఇక్కడ జైన్‌ కు పోటీగా కాంగ్రెస్‌ అభ్యర్ధి సతీష్‌ లూథ్రా బరిలోకి దిగుతున్నారు. ఓ మనీ లాండరింగ్‌ కేసులో జైలుకు వెళ్లి రావడం సత్యేంద్ర కుమార్‌ జైన్‌ కు మైనస్‌ పాయింట్‌.

అభ్యర్దులు తారుమారు..
పటేల్‌ నగర్‌ ః ఈనియోజక వర్గానికి ఓ స్పెషాలిటీ ఉంది. ఇక్కడ అభ్యర్ధులు పార్టీలు మారడంతో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఇది ఆప్‌ కు పట్టున్న సీటే అయినా గతంలో ఆప్‌ అభ్యర్ధిగా గెలిచిన రాజ్‌ కుమార్‌ ఆనంద్‌ ఈసారి బీజేపి అభ్యర్ధిగా మారారు.2020లో బీజేపి అభ్యర్ధిగా పోటీ చేసిన ప్రవేశ్‌ రతన్‌ ఇప్పుడు ఆప్‌ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నారు.గతంలో మూడు పర్యాయాలు ఆప్‌ ఇక్కడనుంచి గెలిచినా ప్రతీసారి కొత్త అభ్యర్ధితో మాత్రమే గెలిచింది. మరిప్పుడు అభ్యర్దుల పార్టీలు మాత్రమే ఆరాయి. ఏం జరుగుతుందో చూడాలి.

చద్దా సీటులో గెలిచేదెవరు?

రాజ్యసభ ఎంపీ రాఘవ్‌ చద్దా 2020 లో రాజీందర్‌ నగర్ సీటునుంచి గెలుపొందారు. ఆయన రాజ్యసభ ఎంపీగా వెళ్లిపోవడంతో ఇప్పుడీ స్థానం నుంచి ఆప్‌ సీనియర్‌నేత దుర్గేష్‌ పాఠక్ నిలబడ్డారు. ఈయనకు ప్రత్యర్ధిగా కాంగ్రెస్‌ నుంచి వినీత్‌ యాదవ్‌ పోటీలోకి దిగారు. ఆప్‌ నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇన్చార్జ్ గా, పార్టీ పొలిటికల్‌ అఫైర్స్ కమిటీ సీనియర్‌ మెంబర్‌ గా ఉన్న దుర్గేష్ పాఠక్‌ ఆప్‌ నేత కేజ్రీవాల్‌కు అత్యంత నమ్మకస్తుడు. విశ్వాసపాత్రుడు.. కాబట్టి గెలుపు అవకాశాలు ఎక్కువే.

ఢిల్లీలో మరో కీలక నియోజక వర్గం గ్రేటర్‌ కైలాష్‌ నుంచి సౌరభ్ భరద్వాజ్‌ మూడు సార్లు గెలిచిన వ్యక్తి. ఆప్‌ పార్టీ ఢిల్లీ అధికార ప్రతినిధి కూడా అయిన భరద్వాజ్ కు పర్యావరణంపై మంచి పట్టుంది. ఆయనపై కాంగ్రెస్‌ గర్విత్‌ సింఘ్విని పోటీకి పెట్టింది. ఈసారి సౌరభ్ భరద్వాజ్‌ గెలిస్తే నాల్గవ సారి గెలిచిన వ్యక్తి అవుతారు.

అంబులన్స్ మేన్‌ గెలుస్తాడా?

షాహదర నియోజక వర్గం ఈ మధ్య కాలంల ఆప్‌ కు పట్టున్న సీటుగా మారింది. గతంలో బీజేపి అభ్యర్ధిగా గెలిచిన జితేందర్ సింగ్‌ షంటీ ఈసారి ఆప్‌ అభ్యర్ధిగా ఇక్కడనుంచి బరిలో దిగుతున్నారు.షంటీని ఇక్కడ స్థానికంగా అంబులన్స్ మేన్‌ గా పిలుస్తారు. కారణం ఆయన సోషల్‌ వర్కర్‌. కోవిడ పాండమిక్‌ సమయంలో మృతదేహాలను డిస్పోజ్‌ చేయడంలో చురుగ్గా వ్యవహరించి ప్రజలనోళ్లలో నానారు.ఎమర్జెన్సీ అవసరాలకు అంబులెన్సులను కూడా అందచేయడంలో ఈయన దిట్ట.. అలాగే రక్త దాత కూడా. ఇప్పటికి వంద సార్లు రక్తదానం చేశారు షంటీ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com