32.6 C
Hyderabad
Tuesday, June 16, 2026

Live Video

spot_img

మహాకుంభమేళ మూడు రోజుల్లో 6 కోట్ల మంది పవిత్ర స్నానాలు

  • రెండో పర్వదినం మౌనీ అమావాస్య రోజు 8 కోట్ల మంది వస్తారని అంచనా
  • ఉన్నతాధికారులతో యోగీ హైలెవెల్ మీటింగ్… రద్దీ పై ఆరా
  • బుధవారం విపరీతమైన ట్రాఫిక్ జామ్… స్కూళ్లు మూసేసిన ప్రభుత్వం
  • హైందవ ధర్మంపై పెరుగుతున్న నమ్మకం, విశ్వాసం, గౌరవం…

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా మహాద్భుత మేళాగా సాగిపోతోంది. వేలు, లక్షలు కాదు ఏకంగా కోట్లలో జనం తరలి వస్తున్నారు. హైందవ ధర్మంపై వారికున్నవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. మతాచారాలను భక్తి ప్రపత్తులతో పాటిస్తున్నారు.  జైశ్రీరామ్‌, హర హర మహదేవ్ లాంటి నినాదాలతో కుంభమేళా ఘాట్‌లు హోరెత్తిపోతున్నాయ్. ఘాట్‌ల దగ్గర ఊహించనంత రద్దీ కనిపిస్తోంది. యూపీలో రోడ్లన్నీ భక్త జన ప్రవాహంతో కిక్కిరిసిపోతున్నాయ్. ఎంతలా అంటే చివరకు బుధవారం స్కూళ్లకు శెలవు దినంగా ప్రకటించాల్సివచ్చింది. ఊహించనంత రష్ కు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. అందుకే స్కూళ్లకు శెలవు ప్రకటించారు. ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళా ఒక చారిత్రక మైలురాయి. మకర సంక్రాంతి రోజు విశేష సంఖ్యలో జనం తరలి వస్తారని భావించిన భక్తులుచాలా మంది బుధవారం నాడు పవిత్ర స్నానాలు ఆచరించేందుకు తరలి వచ్చారు. ఆరోజయితే ఎక్కువ రష్ ఉండదు అని భావించారు. కానీ అసలు బుధవారమే విపరీతమైన రష్ కనిపించింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో స్కూళ్లకు శెలవులు ప్రకటించాల్పి వచ్చింది.

ఆధునిక టెక్నాలజీ పెరిగిపోయినా, మనిషి దైనందిన జీవితాన్ని, మేధస్సును ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్ సవాల్‌ చేస్తున్నా హిందూ ధర్మంపైనా సనాతన ధర్మంపైనా ప్రజల విశ్వాసాలు చెక్కు చెదరలేదనడానికి ఇదే ఒక ఉదాహరణ. ఇదొక ఆధ్యాత్మిక ప్రవాహం… ఒక చారిత్రక ఘట్టం…  ఒక అపురూప సన్నివేశం. మహాకుంభమేళా జరిగినన్ని రోజులూ యూపీలో పరిపాలనా విధానాన్ని మార్చుకోవలసి వచ్చినంత ఉత్కృష్టమైన ఘట్టం. అసలే పరమత సహనం కలిగిన దేశం. లౌకిక రాజ్య పునాదులపై నిర్మితమైన మన దేశంలో ఇంత పెద్ద ఈవెంట్‌ ఎలాంటి ఆటంకాలు లేకుండా, ప్రమాదాలు లేకుండా ప్రశాంతంగా సాగిపోతోందంటే అది హైందవ ధర్మం, సనాతన ధర్మం మన పూర్వతరాల నుండే పుణికి పుచ్చుకున్న ఒక ఆధ్యాత్మిక ఒరవడి.

పవిత్ర గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమం అయిన ప్రయాగ్‌ రాజ్‌కు 144 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ మహా కుంభమేళా ఒక ఆధ్యాత్మిక రికార్డ్. మన సంస్కృతి, సంప్రదాయాల వేళ్లు పురాతన, సనాతన ధర్మానికి ఆలవాలమైన పురాణాల్లోనే ఉంది. దేవతలు, రాక్షసులకు మధ్య అమృత మథనం సమయంలో వెలువడిన అమృతం నాలుగు చుక్కలు భూమిపైపడిన ప్రదేశాల్లోనే ఈ పవిత్ర నదులు వెలిశాయి. గంగా, యమునా, సరస్వతి ఈ మూడు నదులలో అనంతమైన శక్తులున్నాయి. పుష్కర ఘడియల్లో ఆ నీరు తేజోవంతమవుతుందని ప్రతీతి. ఈ నదుల్లో స్నానం చేసినా, ఆ నదీ జలాన్ని నెత్తిన చల్లుకున్నా పాపాలన్నీ తొలగిపోయి, మోక్షం దక్కుతుందని మన పురాణేతి హాసాలు ఘోషిస్తున్నాయి.

కుంభమేళాలో పవిత్ర స్నానాలకు వచ్చే వారి సంఖ్యను అంచనా వేసిన యూపీ ప్రభుత్వం ఏకంగా ఒక ఆధ్యాత్మిక నగరాన్నే రూపుదిద్దింది నాలుగు వేల హెక్టార్లలో ఎక్కడి కక్కడ టెంట్‌లు వేసి యాత్రీకుల బస కోసం సకల ఏర్పాట్లను చేసింది. ఆ నగరాన్నే టెంట్‌ సిటీ అని పిలుస్తున్నారు. ఇందులో వేసిన లక్షా 50 వేల టెంట్లు యాత్రీకులకు వసతి సౌకర్యాలే కాదు. అక్కడ రెండు,మూడు రోజులు బస చేసేందుకు పడక సౌకర్యం, భోజన సౌకర్యాన్ని కూడా కల్పించాయి. హిందూ ధర్మంపై అచంచల విశ్వాసం కలిగిన స్వచ్చంద సంస్థలు భక్తులకు ఉచిత భోజన వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నాయి.40 వేల మంది పోలీసులు శాంతి, భద్రతలను, రవాణాను పర్యవేక్షిస్తున్నారు.దీనికి తోడు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్ సహకారంతో నిఘా కేంద్రాలు, పహారా కేంద్రాలు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

మహాకుంభమేళా ఒక ఆధ్యాత్మిక సందర్భమే కాదు. ఇది కోట్లలో యాత్రీకులు ఒక చోట చేరినప్పుడు తలెత్తే అన్ని సవాళ్లను జయించడం నిజంగా ఒక అగ్ని పరీక్ష. మహాకుంభమేళా ప్రారంభమైన మొదటి రెండు రోజుల్లోనే 5.15 కోట్ల మంది స్నానాలు ఆచరించారు. తొలిరోజు 1.65కోట్ల మంది స్నానాలుచేయగా, మకర సంక్రాంతి రోజున 3.50 కోట్ల మంది స్నానాలు చేశారు.

లౌకిక వాద, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎలాంటి హింస,ఆందోళనలు, ఘర్షణలు, తొక్కిసలాటలు, ప్రమాదాలు జరగకుండా ఇలాంటి అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా ఎంత రిస్క్? కానీ మన దేశం వాటన్నింటిని అధిగమించింది.ఈ మహాద్భుత ఘట్టంలో కులం, మతం ప్రస్తావన లేదు, రాష్ట్రాలు, ప్రాంతాల తేడాలు అసలే లేవు. చివరకు విదేశీ అతిధులకు సైతం రాచమర్యాదలతో ఆహ్వానించిపెద్ద మనసు చాటుకుంది భారత్. పౌరసత్వం గురించిఎవరినీ ప్రశ్నించలేదు. హైందవ ధర్మ పునాదులపై నిర్మితమైన దేశమే అయినా ఎక్కడా ఏ మతాన్ని చిన్న చూపు చూసిన సందర్భం లేదు.

ప్రపంచం నలుమూలలనుంచి పేద, గొప్ప తారతమ్యం లేదు. అందరినీ ఈ ఆధ్యాత్మిక మేళాలో పాల్గొనేందుకు అనుమతించడంలోనే మన విశాల ధృక్పథం ఏంటో ప్రపంచానికి అర్ధమయ్యింది.

మహాకుంభమేళాకు భిన్న జాతులు, మతాల వారు తరలివస్తున్నారు. హిందువులు,సాధువులు, యోగి పుంగవులు, అఘోరాలు, నాగ సాధువులు ఇలా రకరకాల వర్గాలకు చెందినవారందరినీ ఒక చోటకు చేర్చిన ఆధ్యాత్మిక క్రతువు.మహాకుంభమేళా సజావుగా సాగడానికి యూపీ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లనుకూడా చర్చించుకోవాల్సినవే.త్రివేణి సంగమం లో పవిత్ర స్నానాల ప్రాధాన్యత తెలిసినది కాబట్టే లక్ష మంది ఒకేసారి స్నానం చేసేందుకు వీలుగా ఘాట్‌ ల నిర్మాణం జరిపింది.2019లో జరిపిన మినీ కుంభమేళాకు 20 కోట్ల మంది వచ్చారు. మరిప్పుడు పెరిగిన రద్దీ దృష్గ్యా ఈ ప్రయాణీకుల రద్దీ 40 కోట్ల పైమాటే ఉంటుందని వారంటున్నారు.ప్రపంచంలోనే అత్యంత అరుదైన ప్రయాగ్‌ రాజ్‌ మహాకుంభమేళా అద్వితీయమైనది. చరిత్రలో మరపు రాని ఘట్టం.

ఇక కుంభమేళాలో మరో పవిత్రమైన రోజు మౌని అమావాస్య. అది ఈనెల29న వచ్చింది. కుంభమేళా పరిభాషలో రెండో షాహీ స్నాన్ పాటించాల్సిన రోజు.  ఆరోజు భక్తులు మరింత ఎక్కువ సంఖ్యలో తరలి వస్తారని భావిస్తున్నారు. ఆ ఒక్క రోజే 8 కోట్ల మంది తరలి వచ్చే అవకాశం ఉందని సీఎం యోగీ ఆదిత్య నాథ్ అంచనా వేస్తున్నారు. మహాకుంభమేళాకు తీసుకుంటున్న చర్యలపై హైలెవెల్ మీటింగ్ ను కూడా నిర్వహించి, పరిస్థితిని సమీక్షించారు.పుష్య పౌర్ణమి, మకర సంక్రాంతి… ఈ రెండు పర్వదినాలలో మొత్తం ఆరున్నర కోట్ల మంది త్రివేణి సంగమంలో స్నానం, పూజలు ఆచరించారు.

మరోవైపు మహాకుంభమేళా కోసం 126 కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేశారు.టెలీ కమ్యూనికేషన్ల శాఖ328 మొబైల్ టవర్లను కూడా నిర్మించింది.మకర సంక్రాంతి పర్వదినం రోజున సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ సింగ్ యాదవ్ కూడా త్రివేణీ సంగమంలో స్నానం చేసి పూజలు చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com