చంద్రబాబుకు రిలీఫ్ దొరికితే, కేసీఆర్‌కు షాక్ తగిలింది. ఒకేరోజు ఇద్దరికీ రెండు రకాల అనుభవం ఎదురయ్యింది. అదీ దేశ అత్యున్నత న్యాయస్థానంలో. రెండు కేసుల్లో ఇద్దరికి విభిన్న రిజల్ట్ వచ్చింది. చంద్రబాబుకేమో స్కిల్ కేసులో ఊరట లభిస్తే.. కేటీఆర్‌కు మాత్రం ఫార్ములా ఈ -రేస్ కేసులో ఎదురుదెబ్బ తగిలింది.
ఫార్మాలా ఈ కార్ రేసు కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తాము ఈ దశలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ కేటీఆర్ ఈనెల 8వ తేదీన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వాస్తవానికి అంతకుముందే ఏసీబీ కేసును క్వాష్ చేయాలని కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆయన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో, కేటీఆర్ సుప్రీంకోర్టు తలుపుతట్టారు. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం దానిని డిస్మిస్ చేసింది.
మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్కిల్ కేసులో భారీ ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలంటూ గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టేసింది. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్ ఫైల్ చేసినట్లు రాష్ట్రప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి న్యాయస్థానానికి వెల్లడించారు. చార్జిషీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్‌లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని న్యాయస్థానం పేర్కొంది. అవసరమైన సందర్భంలో విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు సూచించింది. ఏపీలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు 2023 నవంబర్‌లో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.