కాంగ్రెస్ పార్టీ దేశ రాజధాని న్యూఢిల్లీలో నూతన నిర్మించిన పార్టీ ప్రధాన కార్యాలయ భవనాన్ని బుధవారం ఆ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ ప్రారంభించారు. ప్రారంభం అనంతరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పార్టీ జెండా ఎగురవేశారు. ఢిల్లీలోని కోట్లా మార్గ్‌లో అత్యాధుని సౌకర్యాలతో ఆరు అంతస్తుల భవనాన్ని పార్టీ కేంద్ర కార్యాలయం కోసం నిర్మించారు. వాస్తవానికి 2008లో అప్పటి ప్రభుత్వం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో కాంగ్రెస్ పార్టీకి స్ధలం కేటాయించింది. అయితే కాంగ్రెస్ పార్టీ అక్కడ భవనం నిర్మించి ప్రవేశాన్ని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ నుంచి కోట్లా మార్గ్ వైపు మార్చుకుంది. ఈ నూతన భవనానికి ఇందిరాగాంధీ భవన్ అని నామకరణం చేశారు. ప్రస్తుతం అక్బర్ రోడ్డులోని 24వ నెంబర్ భవనంలో కాంగ్రెస్ పార్టీ కార్యలాపాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 1978వ సంవత్సరం నుంచి ఏఐసీసీ వ్యవహారాన్నీ ఈ కార్యాలయం నుంచే కొనసాగేవి. అయితే ప్రభుత్వ భవనాల్లో పార్టీ కార్యాలయాలు కొనసాగకూడదని కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నూతనంగా పార్టీ సొంత భవనాలను నిర్మించుకున్నారు. అయితే కోట్లా మార్గ్‌లో నూతనంగా నిర్మించిన భవనం నుంచే కాకుండా అక్బర్ రెడ్డు నుంచి కూడా పార్టీ కార్యకలాపాలు కొనసాగుతాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో సోనియాగాంధీతో పాటు పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నంచి పలువురు మంత్రులు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.