అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో మకర సంక్రాంతి సందర్భంగా ప్రభల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాదిగా ప్రజలు ప్రభల ఉత్సవాన్ని చూసేందుకు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులతో సహా ఉత్సవ కమిటీలు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటప్పుడు ప్రభల ఉత్సవం నిర్వహించడం కొత్తపేటలో ఆనవాయితీగా వస్తోంది.
కొత్తపేటలో ప్రభల ఉత్సవాలు మూడు ప్రధాన వీధుల మధ్య పోటాపోటీగా జరుగుతాయి. ముందుగా పాత రామాలయం మనసేబు గారి ప్రభ వీరభద్రుని అలంకరించుకొని పురవీధుల్లోకి వస్తుంది. మిగిలిన ప్రభలు పురవీధుల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ఊరేగింపుగా బయలుదేరతాయి. బోడిపాలెం వద్ద భక్తాంజనేయ స్వామి వారి ప్రభగా అలంకరించుకుని రెండవ ఊరేగింపుగా బయలుదేరి కొత్త రామాలయం ప్రభ రాజరాజేశ్వరి దేవిగా అలంకరించుకుని ఆయా వీధుల ప్రభలను వెంటబెట్టుకుని మూడవ ఊరేగింపుగా మొదలైంది.
ప్రభలు కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోకి చేరుకుని భక్తుల సందర్శనార్థం కొలువై ఉంటాయి.వివిధ రకాల విద్యుత్ కాంతులు, బాణాసంచా కాల్పులు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. తిరిగి రాత్రి 11 గంటలకు పురవీధులలో ఊరేగుతూ బాణాసంచా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ఊరేగుతూ తెల్లవారుజామున నాలుగు గంటలకు పాత బస్టాండ్ సెంటర్ వరకు చేరుకుంటాయి.పాత కొత్త రామాలయాల ప్రభల ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో పోటాపోటీగా బాణాసంచా కాల్పులతో ప్రబల ఉత్సవాలు ముగుస్తాయి.
కన్నుల పండువగా జరుగుతోన్న ఈ ప్రభల ఉత్సవాలు, బాణసంచా పేలుళ్లను చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా.. పక్క రాష్ట్రాల నుంచి కూడా జనం భారీగా తరలివచ్చారు. దీంతో కొత్తపేట కిక్కిరిసిపోయింది.