ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ) కార్యాలయం ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు రాష్ట్రమంత్రులు ఈరోజు(మంగళవారం) ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. కుటుంబ సమేతంగా వెళుతున్న సీఎం.. రేపు(బుధవారం) ఉదయం పదిన్నర గంటలకు జరిగే ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. బుధ, గురువారాల్లో ఢిల్లీలోనే ఉంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పనులకు నిధులను కోరనున్నారు. కేంద్రమంత్రులను కలిసేటప్పుడు ఆయా శాఖల మంత్రులు సీఎం వెంట ఉంటారు.
రాష్ట్రానికి చెందిన ముఖ్య నాయకులంతా బుధ, గురు వారాల్లో ఢిల్లీలోనే ఉంటున్న నేపథ్యంలో అధిష్ఠానం పెద్దలనూ కలిసి మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ కార్యవర్గం కూర్పు, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలపైనా చర్చించే అవకాశముంది. గురువారం (ఈ నెల 16వ తేదీ) రాత్రి.. కుటుంబ సమేతంగా సీఎం సింగపూర్‌కు బయలుదేరి వెళ్తారు. సీఎంతోపాటు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. సీఎం,మంత్రి సింగపూర్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించనున్నారు. 19వ తేదీ వరకు సింగపూర్ పర్యటన ముగించుకొని 20 దావోస్ వెళతారు.
కాగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీలోనే ఉండి పార్టీ పెద్దలతో సమావేశమవుతారని సమాచారం. రాష్ట్రంలో చేపడుతున్న పంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం నుంచి రావల్సిన నిధుల విడుదల కోసం కేంత్రమంత్రులతో భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.