అమెరికాలో కార్చిచ్చులు ఆగడం లేదు. ఇప్పటికే ఉన్నవాటిని కంట్రోల్ చేసేందుకు అక్కడి అధికారులు తల ప్రాణం తోకకొస్తుంది. లక్షల కోట్లలో ఆస్తి నష్టం జరుగుతూనే ఉంది. మరోవైపు రోజురోజుకు కాలిబూడిదవుతున్న ప్రాంతం వేల ఎకరాల్లో పెరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో మరో కార్చిచ్చు ప్రారంభమైందన్న వార్త అక్కడి ప్రజల్లో టెన్షన్ పెంచుతోంది.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అమెరికాలో ఇప్పుడప్పుడే మంటలు ఆగే పరిస్థితి కనిపించడం లేదు. మరో మూడు రోజులు పాటు కార్చిచ్చు కొత్త ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉందని అధికారులు గుర్తించారు. ఇప్పటికే అనేక ప్రాంతాల ప్రజలను హెచ్చరించారు.
కార్చిచ్చు కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 24కు చేరింది. అంతేకాదు మొత్తం కాలి బూడిదైన ప్రాంతం 40 వేల ఎకరాలను దాటింది. ఒక్క లాస్ ఏంజిల్స్‌లోనే 12,300 ఇళ్లు కాలిబూడిదయ్యాయి. ఒక్క పాలిసెడ్స్ ఏరియాలోనే 23 వేల ఎకరాలు భూమి అగ్నికి ఆహుతైంది. ఇక్కడే మొదట మంటలు చెలరేగాయి. ఇక లాస్ ఏంజిల్స్‌లోని మరో 92,000 వేల మందికి వెంటనే ఇళ్లు ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేశారు. మరో 89,000 వేల మందికి ఇళ్లను ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉండాలంటూ నోటీసులు ఇచ్చారు. ఫైనల్ వార్నింగ్ ఇవ్వగానే వారంతా ఇళ్లు ఖాళీ చేయాలని సూచించారు.
లాస్ ఏంజిల్స్‌లో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. కార్చిచ్చు కారణంగా వచ్చే పొగ కారణంగా ఇబ్బందులు ఏర్పడవచ్చని.. దీర్ఘ కాల సమస్యలు కూడా ఉంటాయని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మరో మూడు రోజుల పాటు మంటలు విస్తరించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాతే వాటిని కంట్రోల్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అమెరికా చరిత్రలోనే అత్యంత నష్టాన్ని చేకూర్చిన ఘటనగా ఈ కార్చిచ్చు మిగిలిపోనుంది.