తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సంక్రాంతి గొప్ప పండుగలా చరిత్రలో నిలిచిపోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ నాలుగు పథకాలపై ఖమ్మం, భద్రాది జిల్లాల అధికారులు, ప్రజా ప్రతినిధుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం పాల్గొన్నారు. నాలుగు కొత్త సంక్షేమ పథకాల అమలు సమీక్ష సమావేశములో డిప్యూటీ సీఎం కీలకమైన సూచనలు చేశారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఆయన అన్నారు. ఇప్పటికే ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు రవాణా, 500 కే గ్యాస్ సిలిండర్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచడం, యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మాణం, హాస్టల్ విద్యార్థులకు 40 శాతం డైట్, 200% కాస్మోటిక్స్ చార్జీలు పెంచడం, వరి ధాన్యానికి 500 బోనస్ వంటి చారిత్రాత్మక పథకాలు ఈ రాష్ట్రంలో అమలు అవుతున్నాయన్నారు.
వీటితోపాటు ఈ సంక్రాంతి నుంచి అతి ముఖ్యమైన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల మంజూరు వంటి నాలుగు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తుంది అన్నారు. ఈ నాలుగు పథకాల అమలుకు సుమారు 40 నుంచి 45 వేల కోట్ల అధిక భారం రాష్ట్ర ఖజానాపై పడుతుంది అన్నారు. ఎన్ని ఆర్టిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ముందుకు వెళుతుంది అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 22,500 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 2000 కోట్లు, రైతు భరోసాకు 19 వేల కోట్లు చొప్పున ఖర్చు చేసుకుంటూ ముందుకు పోతామని తెలిపారు.
ఈ నాలుగు కొత్త పథకాల అమలులో ఎక్కడ ఎవరికి సందేహాలు అవసరం లేదని అన్నారు. లబ్ధిదారుల ఎంపిక, అమలుకు సంబంధించి విధి విధానాలు లోతుగా చర్చించిన తర్వాతే రాష్ట్ర క్యాబినెట్ ప్రకటన చేసిందని తెలిపారు.
వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ పరిమితి లేకుండా ఎకరాకు సంవత్సరానికి 12 వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తాం అన్నారు. ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు పొందిన రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది అన్నారు. రెవెన్యూ రికార్డుల ఆధారంగా, వ్యవసాయ శాఖ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు తీసుకున్న కుటుంబం కనీసం 20 రోజులు పని చేసి ఉండి సెంటు భూమి కూడా లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అందుతుందని తెలిపారు.
రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సైతం పూర్తిగా అర్హులనే ఎంపిక చేస్తాం అన్నారు.
ఇచ్చిన మాట మేరకు దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా రెండు నెలల వ్యవధిలో రైతు రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లోకి 22 వేల కోట్లు జమ చేసినప్పటికీ పెద్దగా ప్రచారం జరగలేదు. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల నుంచి అమలు చేయబోయే నాలుగు కొత్త పథకాలకు గ్రామ సభలు ఏర్పాటు చేసి అందరికీ తెలిసే విధంగా పథకాలు అందజేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
గ్రామసభల్లోనే లబ్ధిదారుల ఎంపిక, ఖరారు జరుగుతుంది. గ్రామసభల్లోని అర్హులైన వారికి ఈ నాలుగు పథకాల అనుమతి పత్రాలు అధికారులు, ప్రజా ప్రతినిధులు అందజేస్తారు అని తెలిపారు.
ప్రభుత్వ జీవో ప్రకారం సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయా లేదా అనేది ఇందిరమ్మ కమిటీలు పర్యవేక్షిస్తాయి, ఇందిరమ్మ కమిటీలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించాలి, సంక్షేమ పథకాల అమలులో వీరు కీలకం అని డిప్యూటీ సీఎం తెలిపారు.
ఒక మండలాన్ని మూడు భాగాలుగా విభజించుకుని గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు. గ్రామ సభ నిర్వహణ సమయంలో మంచి వేదిక, మైక్ సెట్, అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉండాలన్నారు. లబ్ధిదారుల గుర్తింపు, అర్హుల జాబితా అన్నీ కూడా జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదం ఉండాల్సిందే అని తెలిపారు.
రైతు రుణమాఫీ పథకం కింద గ్రామంలో లబ్ధి పొందిన రైతుల పేర్లు, వారు పొందిన లబ్ధి నగదు మొత్తం వివరాలను ఒక ఫ్లెక్సీ పై వేసి గ్రామ సెంటర్లో ప్రదర్శించాలన్నారు.
ఇదే తరహాలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల పేర్లు, వారు పొందిన నగదు మొత్తాన్ని అందరికీ కనిపించేలా పెద్ద అక్షరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని. మొత్తం మూడు పథకాలకు సంబంధించి మూడు ఫ్లెక్సీలు, విడివిడిగా పెద్దగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ పథకాల అమలులో కలెక్టర్లకు ఎలాంటి సందేహాలు ఎదురైనా జిల్లా ఇన్చార్జి మంత్రితో మాట్లాడి నివృత్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రోడ్లు,భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగేలేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.