అతనికప్పుడు 70 ఏళ్లు…భారతదేశంలో క్రికెట్ అప్పుడప్పుడే వేళ్లూనుకుంటున్న కాలం. ఇంకా ప్రజలకు పెద్దగా తెలీదు. మ్యాచ్ లు జరుగుతున్నప్పుడు రేడియోల్లోనే కామెంటరీ వచ్చేది. చదువుకున్నోళ్లు, డబ్బులున్నోళ్లే వినేవారు. ఆ టైమ్ లో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సయ్యద్ కిర్మాణీ, క్రష్ణమాచారి శ్రీకాంత్ వీరందరితో కలిసి అతను క్రికెట్ ఆడాడు.
సరిగ్గా టీమ్ ఇండియాకి ఎంపికయ్యే సమయంలో అతని లైఫ్ ఊహించని మలుపు తిరిగింది. అదేమిటంటే తను ప్రవాస భారతీయురాలైన అమ్మాయి ప్రేమలో పడ్డాడు. అక్కడే మనసు పారేసుకున్నాడు. అంతే తనకెంతో ఇష్టమైన క్రికెట్ ని వదిలేశాడు.
సూర్యా సన్నాఫ్ క్రష్ణన్ లో హీరోలా… ఆ అమ్మాయిని వెతుకుతూ, అబద్ధాలు చెప్పి వీసా సంపాదించి, సౌతాఫ్రికా వెళ్లిపోయాడు. అక్కడ పేరు మార్చుకున్నాడు. దొరికిపోయాడు. ఇండియాకి వచ్చేశాడు. మనవాడి పిచ్చిప్రేమని అర్థం చేసుకున్న అమ్మాయి.. చివరికి తనని పెళ్లి చేసుకుంది.
ఇంతకీ ఆ హీరో పేరు ఏమిటంటే…మహాలింగం వెంకటేశన్, తమిళనాడు జోన్ క్రికెటర్. వందకు పైగా దేశవాళీ మ్యాచ్ ల్లో ఆడాడు. అసలు విషయానికి వస్తే, ఒకసారి బ్యాంక్ లో ఉండగా తన స్నేహితురాలితో ఒకమ్మాయి వచ్చింది. తన పేరు ప్రిసిల్లా. ఆరోజు ఆ అమ్మాయిని చూసిన మహాలింగం అక్కడే కళ్లు తిరిగి పడిపోయినంత పనిచేశాడు.
పెళ్లంటూ చేసుకుంటే, ఈ అమ్మాయినే చేసుకోవాలని పంతం పట్టాడు. విశ్వ ప్రయత్నం చేశాడు. చివరికి ఆ అమ్మాయితో మాటామాటా కలిపాడు. ఇక పర్వాలేదనుకున్న సమయంలో… ఒకరోజు ఆ అమ్మాయి సౌతాఫ్రికా వెళ్లిపోయింది. మనవాడు దేవదాసు అయిపోయాడు. చివరికి లాభం లేదనుకుని, స్నేహితుల సహాయంతో సౌతాఫ్రికా బయలుదేరాడు.
అయితే అప్పట్లో వీసా రావడమంటే చాలా కష్టంగా ఉండేది. తనకి అక్కడ బంధువులున్నారని అబద్దాలు చెప్పి ఫ్లయిట్ ఎక్కేశాడు. తర్వాత ప్రిసిల్లా ఉన్న ఊరు వెళ్లాడు. మహాలింగాన్ని చూసి తను స్టన్ అయిపోయింది. తనకోసం అన్ని కష్టాలు పడి వచ్చిన ప్రేమికుడి మనసు తెలుసుకుంది. సంతోషంగా పెళ్లి చేసుకుంది.
అయితే, మనవాడు కుదురుగా ఉండకుండా… మహాలింగం మాడ్లీగా పేరు మార్చుకున్నాడు. మళ్లీ సౌతాఫ్రికాలో క్రికెట్ ఆడాడు. దొరికిపోయాడు. నువ్వు ఇండియన్ వి, సౌతాఫ్రికాకి ఆడటం కుదరదన్నారు. దీంతో జాంబియాలో అంబాసిడార్ ని కలిసి, తన గోడు విన్నవించుకున్నాడు. అంతా తాపీగా విని, మనవాడిని ఫ్లయిట్ ఎక్కించి తిన్నగా ఇండియా పంపించేశారు.
పాపం ప్రిసిల్లాను వదిలి ఇండియా వచ్చి, మళ్లీ క్రికెట్ మొదలుపెట్టాడు. కానీ బైక్ ఏక్సిడెంట్ కావడంతో క్రికెట్ కి దూరమైపోయాడు. విషయం తెలిసి ప్రిసిల్లా ఇండియా వచ్చేసింది. ఇక్కడే పదిహేనుళ్లు ఉన్నారు. పిల్లలు పుట్టారు. 24 ఏళ్ల క్రితం కుటుంబంతో సహా తిరిగి సౌతాఫ్రికా వెళ్లిపోయాడు. అక్కడే రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేసి బాగా సంపాదించాడు. మూడు బ్రాంచీలు పెట్టాడు.
ఇదిలా ఉండగా మన ఐపీఎల్ తరహాలోనే సౌతాఫ్రికాలో కూడా లీగ్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. అందులో మన చెన్నయ్ సూపర్ కింగ్స్ కూడా ఆడుతోంది. అక్కడ దాని పేరు జోబర్గ్ సూపర్ కింగ్స్. దీనికి మహాలింగం పబ్లిక్ ఆఫీసర్ గా నియమితులయ్యాడు.
సౌతాఫ్రికాలో మన జట్టుకి కావల్సిన ఏర్పాట్లు చూడటం, మన సంప్రదాయ వంటలు పెట్టడం, వారికి సహాయ సహకారాలు అందించడం చేశాడు. దీంతో మహాలింగంను పూర్తి స్థాయిలో పబ్లిక్ ఆఫీసర్ గా చైన్నయ్ సూపర్ కింగ్స్ నియమించింది.
ఐపీఎల్ జరిగినంత కాలం మహాలింగం, అతని భార్య, ప్రియురాలు ప్రిసిల్లా ఇద్దరూ ఇండియా వస్తారు. ఆ టీమ్ తో పాటు ఇండియాలో జరిగే ప్రతి ప్రాంతానికి వెళతారు. ఈ స్పాన్సర్ షిప్ అంతా చెన్నయ్ సూపర్ కింగ్స్ చేస్తోంది.
అయితే మహాలింగం ప్రేమనైతే పొందాడు కానీ, క్రికెట్ మాత్రం ఆడలేకపోయాడు. కానీ క్రికెట్ పై ఉన్న మమకారంతో మరో రూపంలో సేవలందిస్తున్నాడు. అటు ప్రేమని, ఇటు నచ్చిన క్రికెట్ ని కూడా సాధించిన మహాలింగం…ఇప్పుడు నెట్టింట గ్రేట్ లవర్ గా కితాబు అందుకుంటున్నాడు.