- కేంద్ర పార్లమెంటరీ కమిటీ పరిశీలన
- ఇంజనీరింగు నిపుణులతో భేటీ
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. అదేమిటంటే పోలవరం ప్రాజెక్టు పరిశీలించేందుకు కేంద్ర పార్లమెంటరీ కమిటీ 10 మంది సభ్యులతో వచ్చింది. కమిటీ ఛైర్మన్ రాజీవ్ ప్రతాప్ సింగ్ రూడీ తన బృందం … ఇంతవరకు జరిగిన నిర్మాణ పనులు, అవెలా జరిగాయి? ఎంతవరకు జరిగాయి? వాటన్నింటి తీరుపై అధ్యయనం చేయనుంది.
కాఫర్ డ్యాం, స్పిల్ వే, డయా ఫ్రం వాల్, ఛానల్స్ ఇలా ముఖ్యమైనవన్నింటిని ఒకదాని తర్వాత ఒకటిగా పరిశీలించనున్నారు. అనంతరం ప్రాజెక్టు అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. వాళ్లందరూ చెప్పిన వివరాల ఆధారంగా, తాము ప్రాక్టికల్ గా చూసి పరిశీలించిన అంశాలను కలిపి కేంద్రానికి నివేదిక సమర్పించనున్నారు. అంతేకాదు రైతులకు నష్టపరిహారం, పునరావాస బాధితులకు చెల్లించాల్సిన బకాయిలు, కట్టాల్సిన ఇళ్లు…తదితర ఎన్నో అంశాలపై చర్చించనున్నారు.
ఆ నివేదిక అందిన తర్వాత అప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. ప్రాజెక్టుకి మళ్లీ కొత్త ఎస్టిమేషన్ సిద్ధం చేయడమా? లేక కేంద్రం ఇస్తామన్న పాత బకాయిలు విడుదల చేయడమా? అన్నది తేలుతుందని అంటున్నారు. ఏదేమైనా ముందు ఎంతో కొంత నిధులు విడుదల చేసి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలనే కృత నిశ్చయం అటు కేంద్రం, ఇటు కూటమి ప్రభుత్వం ఉంది అని అందరూ అంటున్నారు.
ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభమవడంతో ఏపీలో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం అయిపోవడం, రానున్నది వేసవి కాలం కావడంతో…ఈ ఆరునెలల్లో ప్రాజెక్టుని ఒక కొలిక్కి తీసుకురావాలని ప్రాజెక్టు అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఎండాకాలం గోదావరి నీటి ప్రవాహం తక్కువగా ఉంటుంది. అందువల్ల పనులు వేగవంతం చేస్తే, వరదలు వచ్చే సమయానికి ఫలితం ఉంటుందని భావిస్తున్నారు.
అలా చేయకపోతే, వీళ్లు గోదావరిలో దిగి కూసంత చేసేసరికి, వరదలు వచ్చి అప్పటివరకు చేసిందంతా కొట్టుకుపోతోందని నెట్టింట విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో 2014లో చంద్రబాబు కట్టింది బాగాలేదని, 2019లో మాజీ సీఎం జగన్మోహనరెడ్డి మళ్లీ కొత్తగా కట్టారు. ఇప్పుడు 2024లో అది బాగాలేదని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు.
ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా పోలవరం ప్రాజెక్టు షేపులు మారిపోతున్నాయని మేధావులు అంటున్నారు. ఏం చేసినా జనం డబ్బులు మాత్రం..ఉత్తినే గోదారి పాలు జేస్తున్నారని, బడ్జెట్ పెంచేస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి లాంటివాళ్లు గగ్గోలు పెడుతున్నారు. ఈసారైనా ప్రాజెక్టుని కేంద్రం టేకప్ చేసి, పూర్తి చేస్తే అంతే చాలని రైతులు, గోదారి జిల్లాల ప్రజలు కోరుతున్నారు.