- ఏపీలో ఎక్కడ ఏం జరిగినా కుట్ర కోణం వెతుకుతున్న హోంమంత్రి అనిత
- విజయవాడ వరదలనుంచి, తిరుపతి తొక్కిసలాట వరకూ..
- ఎక్కడ ఏం జరిగినా అన్నీ కుట్రలేనా?
- అసమర్ధతకి అందమైన ముసుగే కుట్ర కోణమా?
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఏం మాట్లాడినా సెన్సేషనే..ఇప్పుడే కాదు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ అదే తీరు. ఇప్పుడిక అధికారం దక్కి అందులోనూ కీలకమైన హోం శాఖ పగ్గాలు అందుకున్నాక ఈ దూకుడు మరింత పెరిగింది. ప్రతీ దానికీ కుట్ర కోణాన్ని జత చేయడం ఇటీవల కాలంలో ఆమెకు అలవాటుగా మారింది. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా.. అందులో కుట్ర కోణం ఉంటుందని ఆమె అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. తమ ప్రభుత్వ హయాంలో ఏ చిన్న దుర్ఘటన జరిగినా, వైఫల్యం బయట పడినా దాని వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానం హోం మంత్రికి వచ్చేస్తుంటుంది. అది చివరకు ఎంతలా అంటే.. ఎక్కడ ఏం జరిగినా అన్నింటిని ముందూ వెనకా ఆలోచించకుందా వైసీపీకి ఆపాదించేస్తుంటారు.
ఇది ఏ స్థాయికి వెళ్లిందంటే తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో అస్సలు పొరపాట్లు, తప్పిదాలు జరగవన్నంతగా.. తమ ప్రభుత్వ హయాంలో కేవలం విపక్షాల కుట్రల కారణంగానే దుస్సంఘటనలు జరుగుతాయనేంతగా. మొన్న విజయవాడ వరదల సమయంలో ప్రకాశం బ్యారేజిలోకి రెండు బోట్లు కొట్టుకు రావడం అందరికీ గుర్తుండే ఉంటుంది. వరదప్రవాహానికి లంగర్లకు కట్టేసిన బోట్లు తెగిపోయి కొట్టుకు వచ్చాయి. అత్యంత వేగంతో వచ్చిన ఆ బోట్లు ప్రకాశం బ్యారేజ్ గేట్లకు ఢీకొని ఆగిపోయాయి. ఈ బోట్ల వల్ల కూడా వరద నీరు వేగంగా డిస్పోజ్ అవక వరదలు పొటెత్తాయనేది ఒక వాదన. అయితే తెలుగు దేశం నేతలు ముందూ వెనకా ఆలోచించకుండా దీనంతటి వెనకా కుట్ర ఉందని జగనే వెనకాల ఉండి చేయిస్తున్నాడని దుష్ర్పచారానికి తెగబడ్డారు. హోం మంత్రి అనిత సైతం ప్రకాశం బ్యారేజ్ లో బోట్లు కొట్టుకు రావడానికి కుట్ర కోణాన్ని ఆపాదించి దానిని వైసీపీ నేతల ఖాతాలో వేసేశారు. పైగా ఈ కుట్ర కారకులను పట్టి చట్టం ముందు దోషులుగా నిలబెడతామని, కఠిన శిక్షలుంటాయనీ హూంకరించారు. ఆ బోట్లు వైసీపీ నేతలవేనని ప్రకటించేశారు కూడా. పెను విపత్తు సృష్టించేందుకు ప్రయత్నించిన జగన్ పై దేశద్రోహం కేసు పెట్టాలని కూడా అనిత అభిప్రాయపడ్డారు. తీరా దర్యాప్తులో ఆబోట్లు టీడీపీ నేతలవేనని తేలిపోయింది. దాంతో టీడీపీ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయ్యింది.
ఇక లడ్డు వ్యవహారం కూడా అంతే.. ఏకంగా సీఎం చంద్రబాబే ఈ థియరీని ప్రచారం చేయడం మొదలెట్టారు. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని, కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బ తీశారని, ప్రసాదం పవిత్రతను మంట గలిపారనీ ఆరోపించారు. హిందూ ధర్మాన్ని, తిరుమల ప్రాశస్త్యాన్ని ఒక పథకం ప్రకారం దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నారని ఆ శక్తుల ఆటలు సాగనివ్వమనీ వార్నింగ్ ఇచ్చారు. అంతే హోం మంత్రి అనిత రంగంలోకి దిగిపోయారు. యధా ప్రకారం తన నోటికి పని చెప్పారు.మళ్లీ కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చారు. హిందూ ధర్మాన్ని మంట గలిపే భారీ కుట్ర జరుగుతోందని, అన్యమతస్తుల అండతో టీటీడీని భ్రష్టు పట్టించే జగన్ ప్రయత్నాలను తిప్పి కొడతామనీ ప్రకటించారు. తీరా లడ్డూపై సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానమే లేదు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొన్నామధ్య ఏజెన్సీ ఏరియాలో పర్యటించారు. అప్పుడు ఓనకిలీ ఐపీఎస్ భద్రతా వలయంలోకి చొరబడి పవన్ వెంట టూర్ అంతా తిరిగేశారు. పోలీసులు సైతం అతగాడిని గుర్తు పట్టలేదంటే హోం శాఖ, ఇంటెలిజెన్స్ వైఫల్యం ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. హోం మంత్రి అనిత మాత్రం దీనిని కూడా కుట్ర కోణంలోనే చూశారు. సరికదా ఘటన ఎలా జరిగిందో తెలీడం లేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి వెనక ఎవరి హస్తముందో తేలుస్తామనీ అన్నారు.
ఇప్పుడు తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్లలో తొక్కిసలాట ఆరుగురి మరణానికి దారి తీసిన పరిస్థితులను కూడా హోం మంత్రి కుట్ర కోణం నుంచే పరిశీలిస్తున్నారు. తిరుపతి తొక్కిసలాట ప్రమాదమేనా లేక కుట్రా అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేసినట్లు హోం మంత్రి ప్రకటించారు. తొక్కిసలాటకు అధికారులదే వైఫల్యం అని స్పష్టంగా కనిపిస్తున్నా హోం మంత్రి మాత్రం కుట్రకోణం యాంగిల్ లోనే ఈ అంశాన్నికూడా పరిశీలిస్తున్నారు. ఇలా పదేపదే కుట్ర కోణాలను తెరపైకి తేవడం ఒక రకంగా తెలుగు దేశం ప్రభుత్వం అసమర్ధతని చాటి చెబుతుందనే అవగాహన హోం మంత్రికి ఉందో లేదో మరి.