దాసుడి తప్పులు దండంతో సరి అన్నట్లు తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతికి బాధ్యులతో క్షమాపణలు చెప్పించేసి సరిపెట్టెస్తున్నారు. తప్పు చేసిన వారు చిన్నవారరైనా పెద్ద వారైనా శిక్ష ఒకేలా ఉండాలని భారతీయ శిక్షా స్మృతి చెపుతోంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎంత పెద్ద తప్పుకు కారణమైనా చివరికి వారి బాధ్యాతా రాహిత్యం వల్ల ఆరుగురు ప్రాణాలు కోల్పోయినా జస్ట్ క్షమాపణలు చెప్పించేసి తమవారిని బయటపడేసే మంత్రాంగం చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. తెలిసి అన్నారో… తెలియక అన్నారో… లేక లేక్కలేని తనంతో వ్యాఖ్యానించారో కానీ శుక్రవారం మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో టీటీడీ చైర్మన్ ఒక మాట అన్నారు. అదేంటంటే క్షమాపణలు చెప్పినంత మాత్రాన పోయిన వాళ్ళు తిరిగి వస్తారా అని. అయితే క్షమాపణలు చెప్పినంత మాత్రాన చేసిన తప్పులు మాఫీ అయిపోతాయా అని బాధితులు, ప్రజలు అడుగుతున్నారు. చంద్రబాబు ప్రతికూల పరిస్ధితులను డీల్ చేసే విధానం నిజంగా పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అంశమే. తిరుపతిలో బుధవారం రాత్రి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఆ మర్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంఘటన జరిగిన ప్రదేశాలను సందర్శించారు. మృతుల కుటుంబాలను, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. క్షతగాత్రులకు క్షమాపణలు చెప్పారు.
ఆయన తరువాత కొంత సేపటికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి వచ్చారు. జరిగిన దుర్ఘటనలకు చలించిపోయారు. క్షతగాత్రులతో మాట్లాడుతుంటే తొక్కిసలాటలో వారు పడ్డ నరకయాతన విని ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుని బహిరంగ క్షమాపణలు చెప్పారు. అది కూడా ప్రభుత్వం తరపున వకాల్తా పుచ్చుకుని మరీ తప్పు జరిగింది క్షమించండి అని బహిరంగంగా బాధితులను వేడుకున్నారు. ఒక భాధ్యతగల పదవిలో ఉన్న వ్యక్తి ఎలా స్పందించాలో పవన్ కళ్యాణ్ అలానే స్పందించారు. తొక్కిసలాట జరగడం పట్ల బాధితులు, ప్రజలు ఎవరి మీద అయితే కోపంగా ఉన్నారో వారి పేర్లు ప్రస్తావించి బాధ్యత తీసుకోవాలని వ్యాఖ్యానించారు. టీటీడీ చైర్మన్ బీఆర్‌నాయుడు, ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరిల పేర్లు ప్రస్తావించి వీరి మధ్య సమన్వయ లోపం వల్లే ఈ సంఘటన జరిగిందని… దీనికి వీరు ముగ్గురు బాధ్యత తీసుకోవాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తొక్కిసలాట సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ చైర్మన్, ఈవో, జేఈల పేర్లు ప్రస్తావించకుండా వారి కింది స్ధాయి అధికారులైన తిరుపతి డిఎస్‌పీ రమణ, గోశాల డైరెక్టర హరనాథరెడ్డిలను సస్పెండ్ చేశారు. ఇక సివిల్ సర్వెంట్లైన జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, తిరుపతి జేఈవో గౌతమిలను బదిలీ చేసి సంఘటనపై న్యాయ విచారణకు ఆదేశించారు. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం టీటీడీ చైర్మన్, ఈవో, జేఈఓ వెంకయ్య చౌదరిలు బాధ్యత తీసుకోవాలని, టీటీడీ బోర్డు మొత్తం బాధితులకు క్షమాపణలు చెప్పాలని ప్రకటించారు. అంతేకాకుండా టిటీడీలో ప్రక్షాళన జరగాలని వ్యాఖ్యానించారు. అధికారుల బాధ్యతారాహిత్యం వల్ల ఇటువంటి దుర్ఘటనలు జరిగినప్పుడు సామాన్య ప్రజానీకం ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఆశిస్తారో అచ్చం అలానే పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇంత వరకూ బానే ఉంది. కానీ ఆ మరుసటి రోజు పిఠాపురంలో జరిగిన పల్లె పండుగ కార్యక్రమం సందర్భంగా కూడా ఆ ముగ్గురు క్షమాపణలు చెప్పాల్సిందే అని మళ్ళీ డిమాండ్ చెయ్యడంతో రాష్ట్ర ప్రజల్లో అనేక అనుమానులు రేకెత్తాయి.
ఇప్పటికే సీయం చంద్రబాబు టీటీడీ ముఖ్యులు ముగ్గురినీ విస్మరించి వారిని బాధ్యతల బారిన పడకుండా రక్షించారు. కానీ పవన్ కళ్యాణ్ మొదటి రోజు బాధ్యత తీసుకోవాలంటే ఆ ముగ్గురిపై కూడా కేసులు పెడతారనో, లేక బదిలీ వేటు ఉంటుందనో రాష్ట్ర ప్రజలు ఆశించారు. కానీ పరిస్ధితి చూస్తుంటే టీటీడీ చైర్మన్, ఈవో, జేఈవో వెంకయ్య చౌదరిల చేత క్షమాపణల చెప్పించేసి అంత సరిపెట్టేసేలా ఉన్నారనే అనుమానాలు కలుగుతున్నాయని బాధితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే కేసులో పెట్టిన సెక్షన్ల విషయంలో అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే తరహా సంఘటన పుష్ప-2 ప్రీమియర్‌షో సందర్భంగా జరిగితే తెలంగాణ ప్రభుత్వం బీఎన్‌ఎస్ 105 సెక్షన్ పెట్టింది. పైగా ఆ సంఘటనకు ప్రత్యేకంగా ఫలానా వ్యక్తిదో, బృందానిదో బాధ్యత అని చెప్పే పరిస్ధితి లేదు. అయినా తెలంగాణ ప్రభుత్వం పరిస్ధితి తవ్రతను గుర్తించి ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతకు అనుగుణంగా క్రిమినల్ సెక్షన్ పెట్టి కేసు నమోదు చేసింది. కానీ తిరుపతి ఘటన అలా కాదు. ఈ ఘటన జరగడానికి ఖచ్చింతగా టీడీడీ చైర్మన్, ఈవో, జేఈవో వెంకయ్య చౌదరిల బాధ్యారాహిత్యం, సమన్వయ లోపమే కారణమని స్పష్టంగా కనిపిస్తోంది. అయినా ఈ ముగ్గురిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా క్షమాపణలు చెప్పించేసి సరిపెట్టాశారనే బాధ ప్రజల్లో కూడా నెలకొంది. పైపెచ్చు సెక్షన్ కూడా బీఎన్‌ఎస్ 105 కాకుండా 109 పెట్టి కేసు నమోదు చేయడంపై ప్రతిపక్షాలు సైతం అభ్యంతరం వ్యక్తం చేశాయి. అసలు తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పిన తరువాత ఇంక మిగిలిన వారు క్షమాపణలు చెపితే ఎంత చెప్పకపోతే ఎంత అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. తమ మధ్య సమన్వయ లేమని టీటీడీ చైర్మన్, ఈవోలు సాక్షాత్తూ ముఖ్యమంత్రి ముందే బయటపెట్టుకుని వాదులాడుకున్న తరువాత చర్యలు తీసుకోకుండా క్షమాపణలు చెప్పించి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా వ్యవహరించారా అనే అనుమాను ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.