బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్‌ను ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఉదయంనుంచి దాదాపు ఏడు గంటల పాటు ఏసీబీ అధికారులు కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. కేసు దర్యాప్తు అధికారి, డీఎస్పీ మజీద్‌ఖాన్ కేటీఆర్‌ను పలు అంశాలపై ప్రశ్నించారు. జాయింట్ డైరెక్టర్ రితిరాజు విచారణ తీరును పర్యవేక్షించారు. కేటీఆర్‌ను విచారిస్తున్న సమయంలో వేరే గదినుంచి చూసేంుకు ఆయన తరపు న్యాయవాది రామచంద్రరావును అనుమతించారు. అయితే, తిరిగి ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పుడు హాజరు కావాలని ఏసీబీ అధికారులు ఇవాల్టి విచారణ ముగిసిన తర్వాత కేటీఆర్ తిరిగి వెళ్తున్న సమయంలో సూచించారు.దానికి కేటీఆర్ కూడా సరే అన్నారు.
ఎప్పుడు పిలిచినా, ఎన్నిసార్లైనా వస్తా -కేటీఆర్
ఏసీబీ కార్యాలయంలో విచారణ తర్వాత బయటకు వచ్చిన కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇవాల్టి విచారణలో తాను పూర్తిస్థాయిలో ఏసీబీ అధికారులకు సహకరించానని చెప్పారు. తిరిగి విచారణకు ఎప్పుడు పిలిచినా, ఎన్నిసార్లు పిలిచినా వచ్చి సహకరిస్తానని చెప్పానన్నారు. అయితే, మళ్లీ తనను విచారణకు ఎప్పుడు పిలుస్తారో తెలియదన్నారు. మరోవైపు..ఈ కేసుపై విమర్శలు కొనసాగించారు. ఇది ఓ చెత్తకేసు అని, రాజకీయ ఒత్తిడితో మీరేం చేస్తున్నారో మీకే తెలియడం లేదని, అధికారులతోనే నేరుగా చెప్పానన్నారు. కేవలం నాలుగైదు ప్రశ్నలనే 40 రకాలుగా అడిగారన్నారు. కొత్తగా తనను అడిగిందేమీ లేదన్నారు. ఒప్పందం మేరకు డబ్బులు పంపానని తానే చెబుతున్నానన్న కేటీఆర్.. డబ్బులు వచ్చాయని వాళ్లు కూడా క్లారిటీ ఇస్తున్నారని, ఇక, ఈ వ్యవహారంలో అవినీతి ఎక్కడ జరిగిందని తానే ఏసీబీ అధికారులను ఎదురుప్రశ్నించానన్నారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఏసీబీ డీసీపీ విజయ్‌కుమార్ అభ్యంతరం తెలిపారు. దీంతో, మీడియాతో మాట్లాడితే భయమెందుకని కేటీఆర్.. డీసీపీని ప్రశ్నించారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతుందని, ఇక్కడ మీడియా సమావేశం పెట్టవద్దని డీసీపీ సూచించారు. పార్టీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టుకోవాలన్నారు. మీడియా ప్రతినిధులను పోలీసులు తోసేయడంతో… కేటీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.