- వైకుంఠ ఏకాదశి దర్శనాలకు సర్వం సిద్ధం
- శోభాయమానంగా అన్ని వైష్ణవాలయాల అలంకరణ
- విద్యుద్దీపాలు, లైటింగ్ తో కళకళలాడుతున్న ఆలయాలు
- ఉదయం 5గంటలనుంచి..దర్శనాలకు అనుమతి
- ప్రత్యేక క్యూలైన్లు.. ప్రసాదాల ఏర్పాట్లు
వైకుంఠ ఏకాదశి దర్శనాల కోసం తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవాలయాలన్నీ ముస్తాబయ్యాయి.శుక్రవారం తెల్లవారు జామునుంచే భక్తులు పోటెత్తుతారన్న ఉద్దేశంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. భక్తుల తాకిడిని తట్టుకునేందుకువీలుగా ప్రత్యేక క్యూలను, బారికేడ్లను నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో భక్తులు దర్శనాలకు తరలి వస్తున్నందున ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఎటు చూసినా ఆలయాలు కళకళలాడుతూ వైకుంఠ లోకాన్ని తలపించేలా, భక్తి భావం ఉట్టి పడేలా కనిపిస్తున్నాయి. .
తిరుమల తిరుపతి వెంకన్న సన్నిధి మొదలుకొని తెలుగురాష్ట్రాల్లోని అన్ని ప్రధాన ఆలయాలు సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. తిరుమలలో వైకుంఠద్వారం నుంచి వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటేనే భక్తులకు తృప్తి.కాకపోతే లక్షల సంఖ్యలో వచ్చే భక్తుల కోసం తిరుమల లో ఈసారి వైకుంఠ ద్వార దర్శనాలు పది రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయించారు.తిరుమలలో స్వామి వారి ప్రధాన ఆలయం మామూలు రోజుల్లోనే రోజంతా భక్తులకు తెరిచే ఉంటుంది. కేవలం ఒక గంట మాత్రమే ఆలయాన్ని మూస్తారు. ఇకవైకుంఠ ఏకాదశి రోజున మరింత తాకిడి అధికంగా ఉంటుంది. అందుకే శుక్రవారం ఉదయం వేకువ జామున స్వామి వారి ఏకాంత పూజలు పూర్తి చేసి నాలుగున్నర గంటలనుంచి వైకుంఠ ద్వార దర్శనాలు అనుమతిస్తారు. భక్తులందరికీ ఆ పుణ్యఘడియలలో స్వామి దర్శనం కలిగించేందుకు ఈ పదిరోజులూ ఆర్జిత సేవలు రద్దు చేశారు.
ఇక వైకుంఠ ఏకాదశి పర్వదినం నేపధ్యంలో ఏడుకొండలను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. ప్రధానాలయంతో పాటు, చుట్టుపక్కల ఉన్న ఇతర ఉప ఆలయాలను కూడా 12 టన్నుల పూలతో అలంకరించారు.రకరకాల పళ్లతో వివిధ కళారూపాలను ఏర్పాటు చేస్తున్నారు.దీనికోసం ప్రత్యేకించి మైసూరు నుంచి అలంకరణ స్పెషలిస్టులను రప్పించారు.ఆలయం బయట ఏర్పాట్లు చేస్తున్న శ్రీవారి ఆలయం నమూనా ఆలయం ఈసారి ప్రత్యేక ఆకర్షణ.ఆలయ ప్రాంగణమంతా రంగవల్లులుతీర్చి దిద్ది రంగులతోనూ,పూలతోనూ ఆ ముగ్గులను అలంకరించారు. ఈసారి లైటింగ్, విద్యుద్దీపాల అలంకరణలో కూడా వైవిధ్యం కనపడేలా చేస్తున్నారు. ఘాట్ రోడ్లలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.శ్రీవారి భక్తుల కానుకల కోసం ఆలయం బయట ప్రత్యేక హుండీలను ఏర్పాటు చేశారు.వాహన మండపంలో శ్రీదేవి, భూదేవీ సహిత మలయప్ప స్వామి ఉత్సవ విగ్రహాలని భక్తుల దర్శనం కోసం ఏర్పాటు చేశారు.
తిరుపతిలోని 8ప్రధాన కేంద్రాల్లోని 90 కౌంటర్లలో టోకెన్లను అందిస్తున్నారు.కాగా తిరుమలలో 13 నుంచి 19వ తేదీ వరకూ ఏరోజు కారోజు టోకెన్లను అందిస్తారు.భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక దర్శనాలను ఈ పదిరోజులూ రద్దు చేసారు.
భద్రాచలంలో…
దక్షిణాది అయోధ్యగా పేరుపడిన భద్రాచలంలో సీతారామ చంద్ర మూర్తి దర్శనం కోసం ముందుగానే వారం రోజుల పాటు అధ్యయన ఉత్సవాలు జరిపి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.కరకట్ట,రామాలయ పరిసర ప్రాంతాలను పూలతోను, స్వాగత మండపాలతోనూ అలంకరించారు.శుక్రవారం తెల్లవారు జామున ఉదయం 5గంటలనుంచి సీతారాముల వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు.ఆలయ ప్రాంగణం మొత్తం చలువ పందిళ్లు, మామిడి తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు.లడ్డు ప్రసాద కౌంటర్లను కూడా సిద్ధం చేశారు.అటు పర్ణశాల రామాలయంలోనూ వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సింహాచలంలో..
సింహాచలంలో సింహాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఈసారి స్వర్ణ కవచ అలంకరణతో భక్తులకు దర్శనమిస్తాడు. స్వామి దర్శనం కోసం ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.అంగరంగ వైభవంగా ఆలయాన్నిఅలంకరించారు. గురువారం అర్దరాత్రి ఒంటి గంటలకు స్వామిని మేల్కొలిపి,ప్రత్యేక పూజలు చేసి, సర్వాభరణాలతో వైకుంఠనాధుడి అలంకారం పూర్తిచేసి భక్తుల దర్శనం కోసం అనుమతిస్తారు.ఉత్తర ద్వారంలో స్వామిని ఆశీనులను చేసి ఐదు గంటల నుంచి భక్తుల దర్శనాలకు అనుమతిస్తారు. భక్తులందరికీ ఉచితంగా పొంగలి, పులిహార ప్రసాదాలు అందచేస్తారు.
వైకుంఠ ఏకాదశి ప్రత్యేక దర్శనాల కోసం ఇటు తెలంగాణలోనూ అన్ని వైష్ణవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక భాగ్యనగరంలోని ప్రధాన ఆలయాలు సర్వాంగ సుందరంగా తయారవుతున్నాయి. హైదరాబాద్ జియా గూడలో మూసీ నది ఒడ్డున నిర్మించిన రంగనాథ ఆలయంలో ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లను పూర్తి చేశారు. తిరుమల వెళ్లలేని భక్తులు సాధారణంగా ఈ ఆలయాలకు వచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు.
హిమాయత్ నగర్ లోని టీటీడీ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా వైకుంఠ ఏకాదశి రోజున భక్తుల రాకతో నిండిపోనుంది. ప్రతీరోజు స్వామిని దర్శించుకుంటూనే ఉన్నా ఉత్తర ద్వార దర్శనం కోసం వైకుంఠ ఏకాదశిరోజున భక్తులు ఉదయం నుంచే సుదీర్ఘమైన క్యూలలో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ తాకిడిని తట్టుకునేందుకు ప్రత్యేక బారికేడ్లు, స్పెషల్ క్యూలైన్లను ఏర్పాటు చేశారు.
తిరుమల శ్రీవారిని తలపించే మరో ఆలయం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని వెంకటేశ్వర ఆలయం.ఇక్కడ వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం కోసం స్పెషల్ క్యూ లైన్లు నిర్మించారు. ఆరోజు ఆలయంలో అందించే ప్రసాదంతో పాటు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కూడా ఇక్కడ దొరుకుతుంది.
చిలుకూరు బాలాజీ ఆలయం…
ఈ ఆలయంలో కూడా వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు పూర్తయ్యాయి.చిలుకూరు వెంకటేశ్వరుని దర్శించే భక్తుల్లో విదేశాలకు వెళ్లగోరే వారి సంఖ్య అధికం. అందుకే ఆయన్ను వీసా బాలాజీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ దర్శనం చేసుకుంటే వీసా త్వరగా వస్తుందని ఒక నమ్మకం. అందుకే వైకుంఠ ఏకాదశి రోజున ప్రత్యేక క్యూ లైన్ల ఏర్పాటు, ప్రసాద వితరణ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవే కాదు ఆలియాబాద్ లో ఉన్న రత్నాలయం లోనూ శ్రీమహా విష్ణువు ఆదిశేషుడిపై కొలువై ఉంటాడు.దూరంలో ఉన్న ఆలయాలకు వెళ్లలేని భక్తులు బిర్లా మందిర్, సంఘీనగర్ వెంకటేశ్వరాలయాలను,జుబ్లీ హిల్స్ లోని జగన్నాథస్వామి ఆలయాలకూ వస్తారు కాబట్టి.. ఆయా ఆలయాలను కూడా ప్రత్యేకంగా అలంకరించి ఏర్పాట్లను పూర్తి చేశారు. భక్తుల తాకిడిని బట్టి మరిన్ని ఏర్పాట్లను కల్పించేందుకు సిద్ధంగా కూడా ఉన్నారు.