చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను డిమాండ్ చేసిన వైఎస్.షర్మిల
విశాఖపట్నం వేదిక నుంచి రాష్ట్రానికి ప్రత్యకహోదా ఇస్తామని, విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణ చెయ్యమని ప్రధాని నరేంద్రమోడీతో చెప్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం షర్మిల ఒక ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబునాయుడు ప్రధాని మోడీ కోసం ఎదురు చూస్తుంటే ఆయన ఇచ్చిన హామీల కోసం రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. విభజన హామీలు నెరవేరచకుండా మీరు చేసిన మోసాలపై నిలదీయడానికి రాష్ట్రప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. తిరుపతి వేదికగా చంద్రబాబు సమక్షంలోనే రాష్ట్రానికి పదేళ్ళు ప్రత్యేకహోదా ఇస్తామని మోడీ ప్రకటిస్తే మీరు పదిహేను సంవత్సరాలు కావాలని అడిగారని షర్మిల గుర్తు చేశారు. ఇద్దరి మాటలు కోటాలు దాటాయి తప్ప చేతలకు ఇంతవరకూ దిక్కులేదని పీసీసీ అధ్యక్షురాలు విమర్శించారు. అందరూ కలసి రాష్ట్రానికి సంజీవని వంటి హోదాను అటకెక్కించారని ఆమె మండిపడ్డారు. హోదా ప్రస్తావన లేదు… వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చిన పాపాన పోలేదు… ఢిలీని తలదన్నే రాజధాని కట్టలేదు… పారిశ్రమిక కారిడార్లు నిర్మించలేదు… పదేళ్ళలో పోలవరం నుంచి చుక్క నీరు పారించలేదు… కడపలో ఉక్కు కర్మాగారాం కట్టలేదు… విశాఖ ఉక్కును రక్షించలేకపోతున్నారు అని షర్మిల చంద్రబాబుపై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు. బుదవారం విశాఖపట్నానికి వస్తున్న ప్రదానమంత్రి మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇప్పిస్తూ ప్రకటన చేయించాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నానని షర్మిల అన్నారు. అలాగే విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రధానితో ప్రకటన చేయించాలని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను డిమాండ్ చేశారు.