- మంత్రుల విచ్చలవిడి ప్రవర్తనతో బాబకు తలనొప్పి
- చంద్రబాబుకు మంత్రులపై పట్టు తప్పుతోందా?
- కూటమ పాలనలో ఏం జరుగుతోంది?
ప్రభుత్వంలోకి వచ్చి ఆరు నెలలే అయ్యింది… ఇప్పటి వరకూ గొప్పగా చెప్పుకోవడానికి చేసింది ఏమీ లేదు… ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు అతీగతీ లేదు… పై పెచ్చు చాపకింద నీరులా ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత మొదలైందనే ఇంటెలిజెన్స్ నివేదికలు… పులి మీద పుట్రలా మంత్రివర్గ సహచరులు మీద రోజుకొకరిపై అనుకూల మీడియాలోనే అవినీతి కధనాలు… రాష్ట్ర ఎల్లలు దాటి పొరుగు రాష్ట్రాల్లో అడ్డాలు పెట్టి మరీ అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్న మంత్రులంటూ మన అనుకున్న పత్రికలే ఎలుగెత్తి చాటుతున్నాయి… మరో పక్క చంద్రబాబు వయసైపోతోంది లోకేష్ ఇంకా నాయకుడిగా ఎదగలేదు… టీడీపీ భవిష్యత్తు ఏంటో అంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వ్యక్త పరుస్తున్న ఆవేదన… ఇవన్నీ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై పట్టుకోల్పాయారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ కాల పరిమితి ఇంకా నాలుగున్నరేళ్ళు ఉండగానే టీడీపీ అనుకూల మీడియా ఇప్పటి నుంచే చంద్రబాబునాయుడి వారసుడి గురించి ఇంతగా ఆందోళన చెందుతుందంటే ఇది ఆలోచించాల్సిన విషయమే.
గత ప్రభుత్వంపై పుంఖాను పుంఖాలుగా అవినీతి ఆరోపణలను చేసి గద్దెనెక్కిన టీడీపీ కూటమి పట్టుమని ఆరు నెలలైనా గడవకుండానే అదే అవినీతి వ్యవహారంలో సొంత పార్టీ శ్రేణుల నుంచే విమర్శలను ఎదుర్కొంటోంది. ఏపీ మంత్రి ఒకరు తెలంగాణ వ్యవహారాల్లో వేలుపెడుతున్నారంటూ సాక్షాత్తూ టీడీపీ అనుకూల మీడియా కొన్ని రోజుల క్రితం ఓ కథనాన్ని ప్రచురించింది. బ్రహ్మచారి అయిన ఆ మంత్రి మొదట్నుంచి జల్సా రాయుడనీ, శని, ఆదివారాలైతే చాలు హైదరాబాద్ చేరుకుని స్టార్ హోటల్ లో దుకాణం పెట్టేస్తాడనీ కాంట్రాక్టులు, సెటిల్మెంట్లు ఒకటేమిటి అన్నీ అలా జరిగిపోతూ ఉంటాయని, దీనికితోడు వీకెండ్ గానా బజానాతో ఓ రేంజ్‌లో కార్యక్రమాలు అదిరిపోతున్నాయ్ అని ఆ మీడియా కోడై కూసింది. అక్కడితో ఆగలేదు సదరు మంత్రి వ్యవహారం జర చూడంటంటూ తెలంగాణ సీఎం రేవంత్ ఏపీ సీఎంకి ఏదో నోట్ కూడా పంపారని కథనం. నిప్పు లేకుండా పొగ రాదంటారు. మరి ఇందులో నిజానిజాలెంటో బయటకు వస్తే గానీ తేలదు. ఆ మంత్రికి ఏపీలో కూడా కీలక శాఖ కట్టబెట్టారని టాక్. ఆ మీడియా కథనం ప్రకారం పరాయి రాష్ట్రంలోనే ఇంత దర్జాగా తన దందాలు సాగిస్తున్న మంత్రి అసలు స్టేట్ లో వ్యవహారాలు ఊరికే వదులుతారా అని డౌట్స్ వస్తున్నాయి. అందులోనూ కీలక శాఖలో. మరి ఈ విషయం సీఎం సీరియస్ గా తీసుకోవడం లేదా? అలాగే హోం మంత్రి వంగలపూడి అనితపైనా ఆరోపణలు పెరుగుతున్నాయి. ఆమె వ్యక్తిగత సిబ్బందిపైనా ఆరోపణలు ఏకంగా సీఎం దృష్టికే వెళ్లాయని కూడా అవే పత్రికల్లో కథనాలు వచ్చాయి. కానీ ప్రభుత్వం స్పందంచినట్లు మాత్రం కనిపించడం లేదు.
సాధారణంగా తమ ప్రత్యర్ధి పార్టీ అధికారంలో ఉంటే ఈమీడియా చెలరేగిపోయి అలాంటి కథనాలు రాసేది. కానీ ఫర్ ఎ ఛేంజ్ ఈ సారి టీడీపీ అనుకూల మీడియానే కాదు ఆ పార్లీ కార్యకర్తలకు కూడా కూటమి ప్రభుత్వ పోకడలను భరించలేకపోతున్నారు. అందుకే అటు సోషల్ మీడియాలోనూ ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడాయలో కూడా కూటమి మంత్రులపై సొంత కార్యకర్తలు, మన అనుకున్న పత్రికలు, ఛానళ్లే దుమ్మెత్తిపోస్తున్నాయి. ఒక్కో మంత్రినీ ఏకిపారేస్తున్నాయి టీడీపీ అనుకూల పత్రికలు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరో మంత్రి తన బావను ముందు పెట్టి వసూళ్ళు ప్రారంభించేశరని కూడా పత్రికల్లో కధనాలు వచ్చాయి. ఆయన్ని ఎవరు అప్రోచ్ అయినా తన బావను పరిచయం చేసి ఆయనతో టచ్ లో ఉండండి, మన శాఖలకు సంబంధించిన పనులే కాదు… ఏఫైల్స్ అయినా తీసుకురండని మంచి మంచి ఆఫర్లు ఇస్తున్నారని ప్రచారంలో ఉంది. ఇలా అనేక మంది మంత్రులపై అవినీతి ఆరోపణలు అనుకూల పత్రికలే ప్రచురిస్తున్నాయి. ఇక టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలైతే చంద్రబాబు, లోకేష్‌లకు కూడా మినహాయింపు ఇవ్వడం లేదు. వారు చేసే ప్రతి పనిని, ప్రతి చర్యను పోస్టుమార్టం చేయడం ప్రారంభించారు. కూటమి చేస్తున్న అన్ని కార్యక్రమాల్లో తప్పొప్పులు వెతుకుతూ ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజకి మాధ్యమాల్లో విపరీతంగా పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ పోకడ టీడీపీలో గతంలో ఎప్పుడూ లేదు. బాస్ ఈజ్ ఆల్‌వేస్ రైట్ అన్న పంథాలో ఉండే తమ్ముళ్ళు ఇలా చంద్రబాబు, లోకేష్‌లను సైతం వదలకుండా విరుచుకుపడటం ఆ పార్టీ సీనియర్ నేతల్లో విస్మయం కలిగిస్తోంది.
వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులకు ఇంతటి బరితెగింపు ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. కానీ ఈసారి ప్రభుత్వంలో మూడు పవర్ సెంటర్లు ఉన్నాయని అందుకే మంత్రులు ఎవరిష్టమొచ్చినట్లు వారు చెలరేగిపోతున్నారని టీడీపీ సీనియర్లు సూత్రీకరిస్తున్నారు. చంద్రబాబుకు పాలనలో అపార అనుభవం ఉందని టీడీపీ శ్రేణులు చెబుతుంటాయి. ఎన్నికలప్పుడు జనసేనాని కూడా చంద్రబాబు ఈ టైమ్ లో రాష్ట్రానికి అవసరం అని ఓ రేంజ్ లో పొగిడేశారు. తీరా అధికారం చేపట్టి ఆరునెలలు కావస్తున్నా.. చెప్పిన పథకాల అమలు సంగతి దేవుడెరుగు..అవినీతి ఆరోపణలు కమ్ముకుంటున్నాయి. మంత్రివర్గ సహచరులపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి.
స్ట్రిక్ట్ అడ్మనిస్ట్రేటర్ గా పేరు పడిన చంద్రబాబు ఈ ఆరోపణలను పట్టించుకోవడం లేదా? లేక వార్ధ్యక్యం మీదపడి సమర్ధత తగ్గిందా? ఆయనకు పాలనపై పట్టు తగ్గుతోందా? మంత్రులను కట్టడి చేయలేకపోతున్నారా? అదే అదనుగా మంత్రులు కూడా ఇష్టా రీతిన నడుచుకుంటున్నారా? అనే ప్రశ్నలు పార్టీ క్యాడర్‌నే కాదు రాష్ట్ర ప్రజలను కూడా ముప్పిరిగొంటున్నాయి.