ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సాధ్యమేనా? రాష్ట్ర ఖజానా పరిస్థితి ఏంటి? కూటమి సర్కారు పెద్దల ఆలోచన ఏంటి? ప్రత్యేక బృందం కర్నాటక టూర్ మర్మమేంటి? ఉగాది వరకూ సాగదీయడం వెనుక ఉన్న మతలబు ఏంటి? ఇవన్నీ ఇప్పుడు ఏపీలో ప్రజలను.. ముఖ్యంగా మహిళలను సందిగ్ధానికి గురిచేస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూటమి పార్టీల తరపున ఉమ్మడి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ హామీలు ప్రకటించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలపై తరచూ రివ్యూలు నిర్వహిస్తున్నారు. అమలు చేయాలంటే ఖజానాను చూపిస్తున్నారు. మరి.. ఈ పరిస్థితుల్లో సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై నీలినీడలు అలుముకుంటున్నాయి.
వాస్తవ పరిస్థితులు గమనిస్తే.. కాంగ్రెస్‌పార్టీ కర్నాటకలో ఎన్నికలకు ముందు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు ఆ పథకాన్ని ప్రారంభించింది. అయితే, అక్కడ మహిళలకు ఉచిత ప్రయాణ పథకం కారణంగా ఆర్టీసీలో నిధుల కటకట ఏర్పడింది. దీంతో, అనివార్యంగా ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచాల్సి వచ్చింది.
ఇక, తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణలో గమనిస్తే.. అక్కడ కూడా కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల హామీల్లో కర్నాటక ఫార్ములాను ఫాలో అయ్యింది. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే.. ఉచితంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కూడా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నారు. దీనికి ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు.
అయితే, కర్నాటకను ఆదర్శంగా చూపించి తెలంగాణ ప్రభుత్వం బస్సుల్లో మహిళలకు ఉచితం ప్రయాణం కల్పించింది. కానీ, కర్నాటకలో నిధుల కష్టాలు ఇటీవలే కోలుకోలేని స్థితికి తీసుకెళ్లాయి. దీంతో, అక్కడ ఆర్టీసీ చార్జీలు పెంచారు. ఇక, తెలంగాణలో కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అనివార్యంగా ప్రభుత్వ ఖజానాపై భారం పడుతోందంటున్నాయి.
అయితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అంశం హాట్ టాపిక్ అయ్యింది. ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడిచిపోయినా ఈ పథకం ఇంకా అమలులోకి రాకపోవడంపై క్షేత్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటు పక్క తోటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో, అటుపక్క మరో రాష్ట్రమైన కర్నాటకలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. మరి.. ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా మీనమేషాలు లెక్కించడమేంటన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. వాస్తవానికి కర్నాటక, తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్ఠితి మరింత దయనీయంగా ఉంది. ఈ పథకం ఇప్పటికిప్పుడు అమలు చేయడం అసంభవంగా కనిపిస్తోంది. అందుకే.. ఈ పథకంపై కదలిక వచ్చిందని ప్రజల్లోకి సిగ్నల్స్ వెళ్లే మాదిరిగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి ప్రత్యేకంగా కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. ఆ కమిటీ ఇటీవలే కర్నాటకలో పర్యటించింది. అక్కడ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలవుతున్న తీరును పరిశీలించింది. ఈ కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు. వీరంతా కర్ణాటకలో బస్సుల్లో ప్రయాణిస్తూ.. ప్రయాణికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.కర్నాటక ముఖ్యమంత్రి, రవాణాశాఖ మంత్రిని కూడా కలిసి అక్కడ పథకం అమలవుతున్నతీరుపై నివేదిక సిద్ధంచేస్తున్నారు.
మరోవైపు.. ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలంగాణలో అమలవుతున్న మహాలక్ష్మి పథకం తీరును, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం అమలవుతున్న విధానాన్ని ఈ సందర్భంగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
కర్నాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ప్రత్యేకంగా స్మార్ట్‌కార్డులు జారీచేశారు. ఇక, తెలంగాణలో జీరో టికెట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. మరి.. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలో పరిశీలిస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. వచ్చే ఉగాది నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేస్తామని కూడా ప్రకటించారు. కానీ, ప్రభుత్వంపై తీవ్రమైన ఆర్థిక ఒత్తిళ్లు వెంటాడుతున్నాయి. ఈ పథకం అమలు చేస్తే.. ప్రతి నెలా ఏపీ ప్రభుత్వంపై రూ.265 కోట్ల వరకూ భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం రోజుకు 10 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారని అంచనా. ఉచిత ప్రయాణాన్ని అమలు చేయాలంటే ఇప్పుడున్న బస్సులకు తోడు అదనంగా 3,500 బస్సులు అవసరం. అలాగే మరో 11,500 మంది అదనపు సిబ్బంది అవసరమని ఆర్టీసీ అధికారులు ప్రతిపాదిస్తున్నారు. అలాగే నెలకు రూ.265 కోట్ల చొప్పున ఏడాదికి రూ.3182 కోట్ల రూపాయలు ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.