ఏపీలో కొత్తగా మరో ఏడు ఎయిర్‌పోర్టులు నిర్మిచేందుకు ప్రతిపాదనలు రూపొందించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జున సాగర్, తుని-అన్నవరం, ఒంగోలులో కొత్తగా విమానాశ్రయాలు నిర్మించబోతున్నామన్నారు.కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనంతరం వివరాలు వెల్లడించారు.
శ్రీకాకుళంలో ప్రతిపాదిత విమానాశ్రయ నిర్మాణానికి ఇప్పటికే ఫీజిబిలిటీ సర్వే పూర్తయిందని చంద్రబాబు చెప్పారు. అక్కడ రెండు దశల్లో 1,383 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మాణం జరుగుతుందన్నారు. ఎయిర్‌పోర్టుకోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియ జరుగుతోందన్నారు. అలాగే, దగదర్తిలో 1,379 ఎకరాల్లో నిర్మించనున్న ఎయిర్‌ఫోర్టు కోసం ఇప్పటికే 635 ఎకరాల భూములు సేకరించామన్నారు. ఇక, నాగార్జునసాగర్‌లో 1,670 ఎకరాలు, తాడేపల్లిగూడెంలో 1,123 ఎకరాల్లో విమనాశ్రయాలు నిర్మించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. అదేవిధంగా ఒంగోలులో 657 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు, తుని-అన్నవరం మధ్య 757 ఎకరాలను విమానాశ్రయం నిర్మాణంకోసం సేకరించాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
ఇక, ఇప్పటికే ఏపీలోని ప్రధాన విమానాశ్రయం అయిన గన్నవరం ఎయిర్‌పోర్టులో కొత్తగా నిర్మించే టెర్మినల్ భవనానికి ప్రతిపాదనలు పూర్తయ్యాయన్నారు. కూచిపూడి నృత్యం, అమరావతి స్తూపం థీమ్‌తో రూపొందించిన ఆకృతులతో ఈ టెర్మినల్ నిర్మించేందుకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. విమానాశ్రయం విస్తరణ, కొత్త టెర్మినల్ భవన నిర్మాణ పనులను ఆరు నెలల్లోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీసిటీలో ఎయిర్‌స్ట్రిప్ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఏవియేషన్ యూనివర్సిటీ, ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉన్నట్టు చంద్రబాబు చెప్పారు. భవిష్యత్తులో ప్రైవేటు విమానాల పార్కింగ్ అవసరాలు పెరుగుతాయి కాబట్టి ఆ అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.