30.2 C
Hyderabad
Saturday, June 20, 2026

Live Video

spot_img

సర్కారు ఖజానాకు రాజీవ్‌ స్వగృహ ఊతం

దశాబ్దాలుగా నిర్మాణాలు పూర్తయి ఎవరికీ కేటాయించకుండా మిగిలిపోయిన రాజీవ్‌ స్వగృహ ఇళ్లపై రేవంత్‌రెడ్డి సర్కారు దృష్టి సారించింది. రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ కింది నిర్మించిన అపార్ట్‌మెంట్లు, టవర్లు, ఖాళీ స్థలాల అమ్మకాలకు రంగం సిద్ధం చేసింది. దశల వారీగా ఆ ఆస్తులను అమ్మాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఎన్నోయేళ్లుగా ఎదురుచూస్తున్న వాళ్లకు, సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే వాళ్లకు ప్రయోజనం చేకూరడంతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కూడా భారీగా ఆదాయం వస్తుందని సర్కారు అంచనా వేస్తోంది.

దశల వారీగా రాజీవ్‌ స్వగృహ ఆస్తులు విక్రయించాలని తెలంగాణప్రభుత్వం డిసైడ్ అయ్యింది. తొలిదశలో హైదరాబాద్‌, నగరం చుట్టుపక్కల.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నివాసయోగ్యానికి అనుగుణంగా ఉన్న 760 ఫ్లాట్లను అమ్మేందుకు నిర్ణయం తీసుకుంది. ఈమేరకు అధికారులు నివేదిక తయారు చేయగా.. సర్కారు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. తొలుత నాగోల్ బండ్లగూడలో మిగిలి ఉన్న 159 ఫ్లాట్లు, పోచారం ఐటీ సెజ్‌లో అందుబాటులో ఉన్న 601 ఫ్లాట్లను వేలం వేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఆ తర్వాత రెండో దశలో నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోయిన టవర్స్, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లను విక్రయించనున్నారు. వీటితో పాటు.. గాజులరామారం, పోచారం, జవహర్‌నగర్‌లో 28 టవర్స్‌లో భారీగా ఫ్లాట్లు నిర్మాణ దశలోనే ఉన్నాయి. అసంపూర్తిగా ఉన్న వాటిని వేలం ద్వారా బిల్డర్లకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక, ఇప్పటికే నిర్మాణం పూర్తయి.. నివాస యోగ్యంగా ఉన్న ఫ్లాట్ల అమ్మకాలు పూర్తయిన తర్వాత టవర్స్‌ను వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ రెండు దశల్లో రాజీవ్‌ స్వగృహ ఆస్తుల అమ్మకాలతో రూ.800 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం చేకూరుతుందని సర్కారు అంచనా వేస్తోంది.

ఇక, అధికారులు రూపొందించిన సమగ్ర నివేదికలో వివరాలు క్లారిటీగాపేర్కొన్నారు. బండ్లగూడలో మిగిలపోయిన 159 ఫ్లాట్లు అమ్మితే రూ.30కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని, అలాగే, పోచారంలో ఉన్న 601 ఫ్లాట్లు అమ్మడం ద్వారా రూ.98 కోట్లు ఖజానాకు వస్తుందని ఈ ప్రతిపాదనల్లో అధికారులు వివరించారు. నిర్మాణం పూర్తికాకుండా, అసంపూర్తిగా ఉన్న టవర్స్‌ను కూడా అమ్మడం ద్వారా మరో రూ.637 కోట్లు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ కింద అపార్ట్‌మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్లు, ఖాళీ స్థలాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీగానే ఉన్నాయి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో ఏడాదిన్నర క్రితం కూడా ఇలాగే, రాజీవ్‌ స్వగృహ నిర్మాణాలను అమ్మేశారు. ఆ సమయంలో ప్రభుత్వానికి రూ.1,800 కోట్ల ఆదాయం చేకూరింది.

ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా రాజీవ్‌ స్వగృహ అమ్మకాలపై దృష్టిసారించింది. తద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం వస్తుందని, ఖజానాకు ఆదాయం సమకూరుతుందని అంటున్నారు. అయితే, నిర్మాణాలు పూర్తయి సిద్ధంగా ఉన్న ఫ్లాట్లు ఆసక్తి ఉన్నవాళ్లకు అమ్మేసేందుకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. అసంపూర్తిగా ఉన్న అపార్ట్‌మెంట్లను మాత్రం.. వాటి నిర్మాణాలు పూర్తి చేసి అమ్మడానికి అంగీకరించే బిల్ర్లకు మాత్రమే వేలంలో వాటిని అప్పగించాలని నిర్ణయించింది. ఈక్రమంలో.. రాష్ట్రవ్యాప్తంగా రాజీవ్‌ స్వగృహ పరిధిలో ఉన్న అన్ని ఫ్లాట్ల అమ్మకాల ద్వారా ప్రభుత్వం దాదాపు రూ.2,500 కోట్ల వరకు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తోంది. తొలివిడత వేలం ప్రక్రియ వచ్చేనెలలోనే మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com