ప్రభుత్వ అజమాయిషీ నుంచి తప్పించి, దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పించాలని విశ్వ హిందు పరిషత్ డిమాండ్ చేసింది. స్వయంప్రతిపత్తి డిమాండ్ తో ఈనెల 5వ తేదీన విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్డు దగ్గర కేసరపల్లి లైలా గ్రీన్ మెడోస్ లో నిర్వహించే హైందవ శంఖారావం సభను జయప్రదం చేయాలని విశ్వహిందూ పరిషత్ (విహెచ్ పి)ఆంధ్రప్రాంత ఉపాధ్యక్షుడు, లీగల్ సెల్ సభ్యుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ కోరారు. స్థానిక జాంపేటలోని విహెచ్ పి కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామం నుంచి కనీసం ఐదారు మంది చొప్పున ఈ సభకు రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
1956లో వచ్చిన దేవదాయ చట్టానికి 1961, 1987లలో మార్పులు చేసినప్పటికీ ఎటువంటి న్యాయం జరగడం లేదన్నారు. ప్రభుత్వ అజమాయిషి లేకుండా హిందువులే నిర్వహించుకునేలా చట్టబద్ధతమైన నిర్ణయం చేయాలని ఆయన కోరారు. ఏదైనా ఆలయంలోకి వెళ్తే చాలు, దర్శనం టికెట్ మొదలుకుని ప్రసాదం వరకు అన్నింటికీ రేట్లు కొనసాగించడం వలన సామాన్య మధ్య తరగతి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని శ్యామ ప్రసాద్ ముఖర్జీ అన్నారు.
ముఖ్యంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే నానాయాతన పడాల్సి వస్తోందన్నారు. ధనవంతులు ఎలాగైనా వెళ్తారని, సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఆలయాల్లో టికెట్ల రూపంలో వసూళ్లు చేస్తూ, మరోపక్క ప్రతి ఆలయానికి 15శాతం సర్వ శ్రేయోనిధి (కామన్ గుడ్ ఫండ్) పేరిట టాక్స్ విధిస్తున్నారని, ఈ నిధిని కూడా ఎలా వినియోగిస్తున్నారో చూస్తూనే ఉన్నామని ఆయన అన్నారు.
అందుకే స్వయంప్రతిపత్తి గల ఉత్తమ ధార్మిక వ్యవస్థకు దేవాలయాలను అప్పగించి, హిందువులే నిర్వహించుకునేలా చేయాలని కోరుతూ జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టామని, ఇందులో భాగంగా హైందవ శంఖారావం బహిరంగ సభను విజయవాడలో నిర్వహిస్తున్నామని శ్యామప్రసాద్ ముఖర్జీ చెప్పారు. భూపాలపట్నం ఆత్మానంద స్వామి, విహెచ్ పి విభాగ్ సత్యనారాయణ, నగర అధ్యక్షుడు వై సూర్య సత్యనారాయణ, నగర కార్యదర్శి జయశంకర్, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.