ఐఐటీలను కేవలం విద్యాసంస్థలుగానే చూడొద్దని, అవి దేశ నిర్మాణానికి వేదికలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆవిష్కరణలు, అద్భుతమైన పనితీరుకు చిరునామా ఐఐటి హైదరాబాద్ అని, ఇది కలల కర్మాగారం అని ప్రశంసలతో ముంచెత్తారు. ఐఐటీ హైదరాబాద్లో ఇప్పటివరకు 11,500 పరిశోధనలు ప్రచురితమయ్యాయని, 320కి పైగా పేటెంట్లు సాధించడం, స్టార్టప్ ల ద్వారా దాదాపు 1500 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించడం గొప్ప పరిణామం అని భట్టి విక్రమార్క కొనియాడారు. దీనిని తాము గొప్ప మార్పుగా చూస్తున్నామన్నారు. ఐఐటీ కందిలో నిర్వహించిన హైదరాబాద్- ఆస్ట్రేలియా ఇండియా క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ హబ్ వర్క్ షాప్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడారు.
ఆస్ట్రేలియా-ఇండియా క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ హబ్ కింద మోనాష్ యూనివర్సిటీ సహకారంతో చేపట్టిన కార్యక్రమాలు కేవలం తెలంగాణకే, భారతదేశానికే కాకుండా ప్రపంచానికే కీలకమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని రూపొందించడంలో ఈ వర్క్ షాప్ సహకార స్ఫూర్తి కి అద్దం పడుతుందన్నారు. ఐఐటీలకు ఆద్యుడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అని, వీటిని ఆయన ఆధునిక భారతదేశ దేవాలయాలుగా అభివర్ణించారని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ పేదరికం, అసమానతలపై పోరాడడానికి అవసరమైన సాధనాలుగా ఐఐటీలను నెహ్రూ అభివర్ణించారన్నారు.
ఇక, ఐఐటి హైదరాబాద్ స్థాపించేందుకు నాటి సీఎం, దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కీలకపాత్ర పోషించారన్నారు. వైఎస్ నాయకత్వంలో నే పునాదులు పడ్డాయని, నాడు ఎమ్మెల్సీగా ఘనమైన పరిణామంలో తాను భాగస్వామిని కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తెలంగాణలో క్లిష్టమైన ఖనిజాలను వెలికి తీసేందుకు సమర్థవంతమైన మార్గాలు కనుగొనడం, స్థిరమైన మైనింగ్ పద్ధతులు అవసరమని గుర్తించామన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ పరిశోధన, వాటి సంబంధిత సైన్స్ ఆధార కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. క్లిష్టమైన ఖనిజాలు పారిశ్రామిక ముడి పదార్థాలు మాత్రమే కాదని, అవి హరిత ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి ఉపయోగపడతాయని చెప్పారు. సోలార్ పవర్ ప్యానెల్స్, విండ్ టర్బైన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, విద్యుత్తు నిల్వ బ్యాటరీలు వంటివి క్లిష్టమైన ఖనిజాల ద్వారానే నిర్మాణం అవుతాయన్నారు. 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయబోతున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. అలాగే, గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీని భవిష్యత్తు ఇంధనంగా భావిస్తున్నామన్నారు. ఆవిష్కరణల ప్రోత్సాహానికి, సుస్థిరతకు తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందన్నారు. ఐఐటీల ఆలోచనలు పరిశ్రమలను పునర్ నిర్వచిస్తాయని, ఆర్థిక వ్యవస్థలను పునర్మిస్తాయని కొనియాడారు. గ్రీన్ ఎనర్జీ, స్థిరమైన టెక్నాలజీ, శాస్త్రీయ ఆవిష్కరణలలో దేశంలో మొదటి స్థానంలో నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందన్నారు.