23.9 C
Hyderabad
Wednesday, October 28, 2026

Live Video

spot_img

2024 లవ్ స్టోరీ

ఓ పులిరాణీ ప్రేమ్ కహానీ…

ప్రేమలు చాలా రకాలు. మనుషుల మధ్య బంధాన్ని బట్టి ప్రేమ నిర్వచనం మారుతుంటుంది. ప్రేమికుల మధ్య ప్రేమ అభివ్యక్తీకరణ చిత్ర విచిత్రంగా ఉంటుంది. ఒకరి కోసమే ఒకరు పుట్టినట్టుగా ఫీలవుతారు. ఆమాట కొస్తే సృష్టిలో ప్రాణమున్న ఏజీవి కైనా ఉండే కనీస లక్షణాల్లో అదొకటి.. మనిషిలో స్పందనలకు ఒక భావోద్వేగమైన వ్యక్తీకరణ అది.. ప్రేమలేఖలు, ఉద్యానవనాల్లో దాగుడు మూతలు, విరహ వేదనలూ ప్రేమలో పడిన వారికి చాలా చాలా కామన్. పశు, పక్ష్యాదులు, జంతువుల్లోనూ ఈప్రేమలు ఉంటాయి. అందుకు నిదర్శనమే ఇది…

 మై యహా…తూ  కహా…

అడవికి మృగరాజు సింహమే అయినా పులి కూడా సామంత రాజంత ఫేమస్. దాని ఏరియా దాని లెవెల్ దానికుంటుంది. వేటలో ఒకరి పరిధి దాటి ఒకటి వేటాడవు. ఎప్పుడో కానీ గట్టు పంచాయతీలు రావు.. అలాంటి పులి తన ప్రియుడి కోసం ఏకంగా ముల్లోకాలు తిరిగేసినట్లు మూడు రాష్ట్రాల అడవులూ తిరిగేసింది. మై యహా .. తూ కహా అని తన ప్రాణ సఖుడి జాడకోసం విరహ వేదనతో అడవులను జల్లెడ పట్టేసింది. తన ప్రేమికుడు ఎక్కడున్నాడో అని గాలించి గాలించి తపించిపోయింది. ఈక్రమంలో అటవీ గ్రామాల ప్రజలను, అటవీ అధికారులను వణికించేసింది. పూటకో చోట ప్రత్యక్ష మవుతూ చిక్కదూ.. దొరకదు అన్న రీతిలో అధికారులతో ట్రజర్ హంట్ గేమ్ ఆడేసింది. ఒంటికున్న రేడియో కాలర్ సిగ్నల్ కు అందనంత గుట్టుగా,  విశాలమైన పరిధిలో తెగ తిరిగేసింది. ఎన్నిసార్లు ఉచ్చు వేసినా.. అటవీ అధికారులే వెర్రి మొఖాలేయాల్సి వచ్చినంత ముప్పతిప్పలు పెట్టింది. మూడు రాష్ట్రాల అడవులు శోధించేలా చేసింది.

మూడు రాష్ట్రాలు… 21 రోజులు… 300 కిలోమీటర్ల పాదయాత్ర… అలుపెరుగని వేట… పాదముద్రలు, ఇతర గుర్తులు, మెడలో రేడియో కాలర్ అవేవీ ఆ పులి జాడలను పట్టించలేకపోయాయి. ప్రియుడు దొరకలేదు కానీ చివరకు అటవీ అధికారులకు దొరికి పోయింది.

ఒడిశా ఫారెస్టు నుంచి  అదృశ్యం…

ఒడిశాలోని సిమ్లిపాల్ టైగర్ రిజర్వు ఫారెస్టు అధికారులకు ఎదురైందీ అనుభవం. పులుల సంతతిని పెంచేందుకు ఉద్దేశించిన టైగర్ రిజర్వ్ ప్రాజెక్టులో భాగంగా గత ఏడాది నవంబర్ 14న మహారాష్ట్రలోని తడోబా అంధారీ టైగర్ రిజర్వు నుంచి రెండు ఆడ పులులను అధికారులు తీసుకొచ్చారు. కొత్త వాతావరణానికి తట్టుకోవడం కోసం వాటిని పది రోజుల పాటు ఎన్ క్లోజర్ లో ఉంచారు. కాస్త అలవాటు పడ్డాయని భావించి సిమ్లిపాల్ ఏరియాలోని అడవిలో వాటిని వదిలారు. మొదట్లో బానే ఉన్నా.. గత నెల8న జీనత్ సడెన్ గా ట్రాక్ ఏరియా దాటేసింది. ఎటువెళ్లిందో తెలుసుకోడానికి రేడియో ట్రాకర్ల ద్వారా ట్రై చేస్తున్నా సిగ్నల్స్ బలహీనంగా ఉన్నచోట దాని జాడ కనిపించేది కాదు. ఒడిశా అడవుల నుంచి జార్ఖండ్ అడవుల్లోకి చొరబడింది. అక్కడ గ్రామాల్లో కూడా ప్రత్యక్ష మయ్యింది. పులి జాడ, అలికిడి తెలిసిన గ్రామస్థులు వణికిపోయారు. అటవీ అధికారులు జల్లెడ పట్టారు. అయినా నో యూజ్..

బెంగాల్ అడవుల్లో సంచారం..

చివరికి జార్ఖండ్ కూడా దాటేసి మరో వంద కిలోమీటర్లు ప్రయాణించి పశ్చిమ బెంగాల్ అడవుల్లోకి వచ్చేసింది. బెంగాల్ లో పరిసర గ్రామాల్లో దీని జాడలు కనిపించి స్థానికులు వణికిపోయారు. అటవీ అధికారులు రంగ ప్రవేశంచేసి దాని రేడియో కాలర్ సిగ్నల్ ఆధారంగా అది ఝర్ గ్రామ్ లోనుంచి బంకూరా జిల్లాలోని గో సైందిహీ అనే అటవీ ఏరియాకు వెళ్లిందని గుర్తించారు. దాంతో కొన్ని రోజులు మాటు వేసి అక్కడే ఉండి జీనత్ జాడ కనిపెట్టి  బంధించారు. దీంతో అధికారుల వేట ఫలించింది. జీనత్ ఆరాటానికి బ్రేక్ పడింది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న అధికారులు అది ఆరోగ్యంగానే ఉన్నట్లు, చురుకుగా ఉన్నట్లు గుర్తించారు. అలవాటైన ప్రదేశం కాకపోవడంతో కాస్త ట్రాన్స్ లొకేషన్ షాక్ కి గురైనట్లు భావిస్తున్నారు. సిమ్లి పాల్ టైగర్ రిజర్వు ఫారెస్టు ఏరియాకు అలవాటు పడినా… ఎక్కువ సంఖ్యలో ఆడపులులు ఉండటంతో గందరగోళానికి లోనై మగ తోడు వెతుక్కుంటూ ఇలా పాదయాత్ర చేసింది.

వెనకటికి మొన్నటికి మొన్న మహారాష్ట్ర రిజర్వు ఫారెస్టుకు చెందిన జానీ అనే మగ పులి బోర్డర్ దాటి తెలంగాణ అడవుల్లో ప్రవేశించి వందల కిలోమీటర్లు తిరిగింది. జానీ వేట కూడా తనకు ఈడు జోడైన తోడు కోసమే.. ఇప్పుడు  ఆడపులి జీనత్ కూడా తనకి సూటయ్యే లవర్ వేటలోనే మూడు రాష్ట్రాలు తిరిగేసింది.

పులులు సాధారణంగా ఓ పరిధి దాటి బయటకు రావు. ఆకలి వేస్తే తప్ప వేట కూడా చేయవు. కానీ ఈ రెండు పులులూ తమ పరిధి దాటి ప్రయాణించాయంటే అది తోడు కోసమేనంటున్నారు అధికారులు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com