28.2 C
Hyderabad
Friday, September 18, 2026

Live Video

spot_img

వాట్సాప్ తో హ్యాండ్సప్..

  • మూడు నెలల్లో 44 వేలకు పైగా ఫిర్యాదులు
  • సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ తో పెరుగుతున్ననేరాలు

ఆధునిక సాంకేతిక కమ్యూనికేషన్ సాధనం వాట్సప్ ద్వారా నేరాలు పెరిగాయని సైబర్ ఫ్రాడ్స్ పై దర్యాప్తు చేస్తున్న కేంద్రం హోం శాఖ గణాంకాలు తెలియచేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా సైబర్ నేరాలు అడ్డు, అదుపు లేకుండా సాగుతున్నాయి. మనదేశంలో గతేడాది ఆరంభంలో మూడు నెలల్లోనే 43,797 ఫిర్యాదులు అందాయని హోం శాఖ తెలియ చేస్తోంది. టెలిగ్రాం యాప్ ద్వారా 22,680, ఇన్ స్టా గ్రామ్ ద్వారా 19,800ల నేరాలు  జరిగినట్లు  నివేదికలు చెబుతున్నాయి.

ఇన్ స్టాగ్రామ్ యాప్ యూజర్లు కోట్లల్లోనే ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఈ యాప్ ను చాలా సునాయాసంగా వాడేస్తున్నారు. మనిషిలో ఉన్న సకల ప్రకోపాల తాలూకు రియాక్షన్లన్నీ అందులో బయట పడుతుంటాయి. వంటల దగ్గరనుంచి ఫ్యాషన్ వరకూ, పెట్స్ నుంచి డాన్సుల వరకూ ఎన్నో స్పందనలు అక్కడ అలవోకగా వెల్లడి చేస్తుంటారు. ఇక ఈ తరం వారయితే రీల్స్ పిచ్చిలో పడిపోయి ఏది పడితే అది రికార్డు చేసి అందులో వదులుతుంటారు. ఈ వెర్రిని అభిమానించి, ఆరాధించి, వారి ఫాలోయర్లుగా మారే వారికీ కొదవ లేదు.  ఇలాంటి వారే సైబర్ మోసాల ఉచ్చులో పడిపోతున్నారు. సైబర్ నేరగాళ్లు ఈ అమాయకులను ఆకర్షించే ఇన్ స్టాగ్రామ్ స్కాము వీరులకు, నేరగాళ్లకు అడ్డాగా మారిందని హోం శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గూగుల్ ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ వేదికగా ఈ నేరాలు జరుగుతున్నాయని 2023 2024 కేంద్ర హోం శాఖ లెక్కలు చెబుతున్నాయి. గూగుల్ అడ్వర్టైజింగ్ ప్లాట్ ఫామ్ లో ఉండే సాంకేతిక వెసులు బాట్లను ఆధారంచేసుకుని ఈ నేరగాళ్లు చెలరేగి  ప్రత్యేకించి కొన్ని వర్గాలను టార్గెట్ చేసుకుని నేరాలకు పాల్పడుతున్నాయి. వీటిలో ఎక్కువగా లోన్ లెండింగ్ యాప్స్ నేరాలే ఎక్కువ. చైనా టెక్నాలజీతో రూపొందే ఈ యాప్ ల ఆపరేషన్ అదీ కూడా ఆ దేశం నుంచే ఎక్కువగా జరుగుతోందని హోం శాఖ దర్యాప్తులో తేలింది. 2023లో ఈ యాప్స్ ద్వారా 300 కోట్లరూపాయల మోసం జరిగిందని లెక్కలు తేలడంతో చైనాకు చెందిన దాదాపు 15 నకిలీ లోన్ లెండింగ్ యాప్స్ ని మనదేశం బ్యాన్ చేసింది. ఇలా చౌకగా రుణాలిచ్చే యాప్స్ కొన్నయితే అమాయకులకు గాలం వేసి వేలల్లో పెట్టుబడి పెడితే కోట్ల్లలో సంపాదించవచ్చంటూ ఆశ పెట్టే స్కామ్స్ కొన్ని.

పెట్టుబడులు ఆకర్షించే స్కామ్స్ : ఓరకంగా చెప్పాలంటే భారీ స్థాయిలో జరిగే మనీ లాండరింగ్  మోసం ఇది.. నిరుద్యోగ యువత, గ్రుహిణులు, విద్యార్ధులు, అంగవికలురే వీరి టార్గెట్. వీరిని ఆకర్షిస్తూ ఇంటి దగ్గరే ఉంటూ కోట్లు కూడ బెట్టుకోవచ్చంటూ కొన్ని అడ్రస్ లతో కూడిన ప్రకటనలు చాలా మందిని ఆకర్షిస్తాయి. రోజు వారీ పని కల్పిస్తామంటూ చెప్పే కొన్ని సంస్థలు ముందు కొంత సొమ్ము కట్టమని కోరుతుంటాయి. చాలా మంది డబ్బులేని వారు కూడా అప్పుచేసైనా సరే మళ్లీ సంపాదించి ఇచ్చేయవచ్చు అని ఆ కంపెనీల ఉచ్చులో పడుతుంటారు. మరో సాంకేతిక మాధ్యమమైన ఫేస్ బుక్, గూగుల్  మధ్య సాంకేతిక ఒప్పందాల కారణంగా ఈ టార్గెటెడ్ జనం అంతా సులభంగా ఈ నేరగాళ్ల ఉచ్చులో పడతారు. గూగుల్ లో ఉండే  ఫ్రీ డొమైన్స్ సౌకర్యంతో మోసపూరితమైన కంపెనీలను సృష్టించి, డిజిటల్ మనీ లెండింగ్ యాప్స్ ద్వారా అమాయకులను టార్గెట్ చేస్తుంటారు. అలాగే ఆండ్రాయిడ్ యూజర్లను కూడా సాఫ్ట్ వేర్ టెక్నాలజీని ఉపయోగించినెట్ వర్క్ లను, సర్వర్లను హ్యాక్ చేయడం  కంప్యూటర్ లలోకి  హానికారక వైరస్ లను చొప్పించడం, స్పైవేర్, ట్రోజన్ హార్సెస్ లాంటి వాటి సహకారంతో సమాచారాన్ని సేకరించి నేరాలకు పాల్పడుతున్నారు. చివరికి కంప్యూటర్లకు ఉద్దేశించిన యాంటీ వైరస్ టెక్నాలజీలోనూ మోసాలొచ్చేశాయి.

ఆకర్షణీయ హ్యాష్ ట్యాగ్ ల ద్వారా మన మొబైల్ లోనూ, కంప్యూటర్లలోనూ చొరబడి బ్యాంకు అక్కౌంట్లు ఇతర వ్యక్తిగత సమాచారాన్ని కొల్లగొట్టి దాని ఆధారంగా నేరగాళ్లు వల వేస్తున్నారు. మన దేశంలో లోన్ యాప్స్ ఉదంతాలే అందుకు ఉదాహరణ. కేంద్ర సైబర్ నేరాల దర్యాప్తు విభాగం ప్రకారం ఫేస్ బుక్ ద్వారా రుణాలిస్తామంటూ  యాప్ ల అక్రమ అడ్డగోలు వ్యాపారం పెరిగిపోయింది. ఈ తప్పుడు లింకులు ఫేస్ బుక్ ద్వారానే ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్నాయని దర్యాప్తులో తేలింది. కొన్ని ఫేస్ బుక్ పేజీలలో కూడా ఈతరహా లింకులు కనిపిస్తుంటాయి. ఈ నేరాల జోరు ఎంతలా పెరిగి పోయిందంటే నేరం జరుగుతున్న తీరును అధ్యయనం చేయడమే కష్టంగామారుతోంది.

 సైబర్ నేరాల దర్యాప్తు అంతంత మాత్రమే..

ఈ నేరాల తీరును విశ్లేషించి నేరగాళ్లను బోనెక్కించడానికి సరైన ప్రొసీజర్ కూడా మన దేశంలో ఇంకాపూర్తి స్థాయిలో  రూపొంద లేదు.  అసలు సైబర్ నేరాల నివారణకు ఉద్దేశించిన ప్రత్యేక చట్టమే 2018లో రూపొందింది. సైబర్ నేరాల విచారణకు ఉద్దేశించిన 14c ప్రకారం, నేర న్యాయ వ్యవస్థ  వివిధ దర్యాప్తు సంస్థలు, విచారణా విభాగాలు, ఫోరెన్సిక్ నిపుణులు, ప్రాసిక్యూటర్లు, జడ్జిలకు  ముందు సైబర్ సెక్యూరిటీపైనా, సైబర్ నేరాల దర్యాప్తుపైనా, డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణుల ఏర్పాటుపైనా అవగాహన కల్పించి సైబర్ నేరాల విచారణను  పటిష్టం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే వాటికి శిక్షల ఖరారుపై అడుగులు పడుతున్నాయి.

ఆన్ లైన్ నేరాలకు అడ్డుకట్ట పడాలంటే ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు టెక్నాలజీ ప్లాట్ ఫామ్ అయిన ఫేస్ బుక్ లాంటి సాధనాల యాజమాన్యాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి. అమాయకులు ఈ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా కొన్ని   సురక్షిత విధానాలను డెవలప్ చేయాలి.

సైబర్ నేరాలపై ఫిర్యాదు ఆన్ లైన్ లోనే…

ఇలా సైబర్ నేరాలకు బలై పోయిన బాధితులు పోలీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగడం ఆనవాయితీ. కానీ ఈ ఇబ్బందిని అధిగమించడానికి ప్రభుత్వం ఆన్ లైన్ లోనే ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేసింది. చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉండే ఈ ప్లాట్ ఫామ్ ఆన్ లైన్ లో  వేధింపులకు బలయ్యే మహిళలు, చిన్న పిల్లలు కూడా ఫిర్యాదు చేసుకునేలా ఉంది. హ్యాకింగ్, వ్యక్తిగత వివరాల చోరీ, ఆన్ లైన్ మోసాలు, అవమానాలు, వేధింపులకు, దూషణలకు పాల్పడే సైబర్ బుల్లీయింగ్ నేరాలపై ఇక్కడ కంప్లయింట్ చేయవచ్చు. బాధితులు  ఇంట్లో కూర్చునే నేరుగా ఆన్ లైన్ లో కంప్లయింట్ చేయవచ్చు. తమ దగ్గరున్న సాక్ష్యాలను నేరుగా అప్ లోడ్ చేయవచ్చు, కేసు దర్యాప్తు ఎంత వరకూ వచ్చిందో కూడా తెలుసుకోవచ్చు. సైబర్ నేరాల దర్యాప్తు , విచారణ టైమ్ ఎక్కువ పడుతుంది కాబట్టి  సైబర్ టెక్నాలజీ వినియోగ దారులకు సులభమైన సురక్షణ టిప్స్ ను అందించడం, మార్గదర్శకాలను సూచించడం ద్వారా మరింత మంది  సైబర్ నేరాల బారిన పడకుండా ఈ విభాగం కాపాడుతోంది.

టెక్నాలజీని పరిమితికి మించి వాడితే అది చేటు చేస్తుంది. వినియోగ దారులు కూడా అనవసరమైన ఆశలకు పోయి,  సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి సర్వం కోల్పోకముందే సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పై అవగాహన పెంచుకుని వినియోగించుకుంటే మంచిది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com