- యూరప్ ను ప్లేగ్ వ్యాధి తుడిచి పెట్టేస్తుందా?
- రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు?
- విజేతగా రష్యా.. ట్రంప్ కు ఎదురు దెబ్బలు
- పుతిన్ పై హత్యాయత్నం..
- ప్రక్రుతి వైపరీత్యాల సుడిలో అగ్రరాజ్యం?
కొత్త ఏడాది వస్తోందంటే చాలు.. ఎలా ఉంటుందో అన్న టెన్షన్, ఒక ఉత్సుకత చాలా మందికి ఉంటుంది. అందులోనూ జ్యోతిష్కులు, భవిష్యవాణి నిపుణులు ఏం చెబుతారన్న ఆత్రుత మనలో ఎందరికో ఉంటుంది. భవిష్యత్తును ముందే ఊహించి చెప్పే వారిలో బల్గేరియాకు చెందిన వంగా బాబా, నోస్ట్రడామస్ లను ఎక్కువ మంది నమ్ముతుంటారు. పైగా వంగా బాబా చెప్పినవి చాలామటుకు నిజమవడంతో అందరూ ఆమె ఏం చెప్పిందా అని ఆత్రంగా ఎదురు చూస్తుంటారు. అయితే వంగా బాబా జోస్యం ప్రకారం 2025 అమెరికాకు గడ్డుకాలం. ఆ దేశాన్ని ప్రకృతి వైపరీత్యాలు దారుణంగా వెంటాడబోతున్నాయి. భయంకరమైన భూకంపాలు వచ్చే ఛాన్స్ ఉందట. అలాగే భారీ అగ్ని పర్వతాలు బద్దలై భళ్లు మని లావా ఉప్పొంగుతుందట. ఏలియన్స్ కు మనుషులకు మధ్య సంబంధాలు ఏర్పడతాయని, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై హత్యాయత్నం జరుగుతుందని చెప్పింది. యూరప్ పై ఉగ్రదాడి జరుగుతుందని, కింగ్ ఛార్లెస్ కు కష్ట కాలం దాపురిస్తుందని ఊహించింది. యూరప్ లో 2025లో అంతర్గత ఘర్షణలు రేగి సరికొత్త సవాళ్లు ఎదురవుతాయని వంగా బాబా, నోస్ట్రడామస్ ఇద్దరూ జోస్యం చెప్పారు. ఇద్దరి అంచనాలు ఒకేలా ఉండటం మరోవైపు బ్రిటన్ లో పరిణామాలు అందుకు ఊతమిస్తుండటంతో అందరూ వీరిని నమ్ముతున్నారు.
బల్గేరియాకు చెందిన వంగా బాబా పుట్టు అంధురాలు. ఆమెకు అతీత శక్తులు ఉన్నాయని భవిష్యత్తును ఊహించి చెబుతుందని కథనాలున్నాయి. వంగాబాబా చెప్పిన అనేక ఊహాంశాలు గతంలో నిజమయ్యాయి కూడా. ట్విన్ టవర్స్ పై దాడి జరుగుతుందని, ప్రిన్సెస్ డయానా చిన్న వయసులోనే దారుణ ప్రమాదంలో మరణిస్తుందని, ఛెర్నోబిల్ లో అణురియాక్టర్ లో భారీ ప్రమాదం తలెత్తుతుందని గతంలో వంగా బాబా చెప్పింది. దాంతో తాజా జోస్యానికి ప్రాధాన్యత ఏర్పడింది.
బ్రిటన్ కు అత్యంత గడ్డుకాలం..
ప్రపంచ రాజకీయ పరిస్థితులు గమనిస్తే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం బ్రిటన్ ను దారుణంగా దెబ్బతీస్తుందట. ప్లేగ్ వ్యాధి ప్రబలి యూరప్ ఖండ జనాభా కూడా చనిపోతారని వంగా బాబా అంచనాలు. రెండేళ్లుగా ఎడతెరిపి లేకుండా సాగుతున్న ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో ఎట్టకేలకు రష్యాదే పై చేయి అవుతుందని, అమెరికా ప్రాభవం తగ్గి ప్రపంచంలో రష్యా ఆధిపత్యం మళ్లీ పెరుగుతుందని కూడా వంగబాబా ఊహించింది. అమెరికా పశ్చిమ తీరాన్ని భారీ భూకంపాలు కబళిస్తాయని, అపార నష్టం జరుగుతుందని తెలిపింది. అదే స్థాయిలో అగ్ని పర్వతాలు బద్దలై సుదీర్ఘ కాలం లావాను వెదజల్లుతాయని, ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయని ఆమె జోస్యం చెప్పింది.
ఇక నోస్ట్రడామస్ ఏమన్నారంటే.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా యూరోపియన్ యూనియన్ అత్యంత దారుణంగా పతనమవుతుందని, బ్యుబోనిక్ ప్లేగ్ వ్యాధి ప్రబలి ఊహించని స్థాయిలో మృతులు పెరిగి ఆ ఖండం జనాభా తగ్గిపోతుందని అన్నాడు. ప్రపంచ యవనికపై పాశ్చాత్యశక్తుల ప్రభావం తగ్గిపోతుందని, కొత్త గ్లోబల్ శక్తులు తెరపైకి వస్తాయని నోస్ట్రడామస్ జోస్యం చెబుతోంది. దీర్ఘకాలిక యుద్ధం కారణంగా సైనిక శక్తులు సన్నగిల్లి రష్యా, ఉక్రెయిన్ వార్ తగ్గుముఖం పడుతుందని అన్నాడు.
ఇద్దరి జోస్యాలు ఇంచుమించు ఒకేలా ఉండటం తో వీటికి ప్రాధాన్యత ఏర్పడింది.