- జపాన్ దాటేసి.. మున్ముందుకు..
- ఆర్ధిక, మిలటరీ, దౌత్య, సంస్కృతిక రంగాల్లో పట్టు
- అధిక జనాభాతో మానవ వనరుల శక్తిలో టాప్ వన్ భారత్
- జపాన్ ను దెబ్బ తీసిన జనాభా పరిమితి
ఆసియాలో మూడో శక్తివంతమైన దేశంగా భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. జపాన్ ను దాటేసి ముందుకొచ్చేసింది. లోయీ ఇనిస్టిట్యూట్ ఇటీవల విడుదల చేసిన ఆసియా పవర్ ఇండెక్స్ జాబితాలో తొలి రెండు స్థానాలు అమెరికా, చైనాలవి కాగా మూడో స్థానంలో భారత్ నిలబడింది. గతంలో ఉన్న జపాన్ ను వెనక్కు నెట్టి భారత్ ముందుకు రాగలిగింది. జపాన్, భారత దేశాల మధ్య వ్యత్యాసం తక్కువే ఉన్నా.. జపాన్ వెనకబాటుకు కారణాలు తెలిస్తే ఇక దీన్ని అధిగమించడం ఆదేశానికి ఎంత కష్టమో కూడా అర్ధమవుతుంది. సూపర్ పవర్ రేస్ లో మూడో స్థానికి ఎగబాకిన భారత్ ఆసియా ఖండంలో శక్తివంతమైన, వాణిజ్య రంగాన్ని ప్రభావితం చేయగలిగిన దేశంగా నిలదొక్కుకుంది.
ఆస్ట్రేలియాలోని మేధావుల బృందం ఆధ్వర్యంలోని లోయీ ఇనిస్టి ట్యూట్ ఆసియా పవర్ ఇండెక్స్ జాబితాను విడుదల చేసింది. ఆసియాలో దేశాల శక్తి, సమర్ధతలను ఎప్పటికప్పుడు ఈ సంస్థ విశ్లేషిస్తూ ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటుంది. వివిధ దేశాల ఆర్దిక వనరులు, మిలటరీ శక్తి సామర్ధ్యాలు, దౌత్యపరంగా ప్రభావితం చేయగలిగిన సత్తా, సంస్కృతిక పరంగా ఉన్న విస్తృతి, భవిష్యత్తులో సమీకరించుకునే వనరుల సత్తా.. తదితర గణాంకాల ఆధారంగా, సమగ్రంగా విశ్లేషించి ఈ జాబితాను రూపొందిస్తారు. రక్షణ, డిప్లమసీ, ఆర్థిక పురోగతి రంగాలతో పాటు అనేక కీలక రంగాల్లో భారత్ ఇటీవల కాలంలో తన సామర్ద్యాన్ని అనూహ్యంగా పెంచుకొని మూడో స్థానానికి ఎగబాకింది.
భారత సత్తాను చాటిన రంగాలేవంటే..
ఆర్థిక రంగం : టెక్నాలజీ, మౌలిక వనరుల కల్పన, ఉత్పత్తి, సేవల రంగంలో నిరంతర పురోగతి ద్వారా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలబడింది. యువత, చురుకైన యంత్రాంగం సవాళ్లను అధిగమించి ముందుకు పోయే తత్వం వల్లనే భారత్ కి ఈ ఆర్థిక పురోగతి సాధ్యపడింది. అందుకనే భారత్ లో పరిశోధనలు, పెట్టుబడులపై బడ్జెట్ పెరిగింది. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లాంటి కార్యక్రమాల వల్ల పారిశ్రామిక, ఆర్ధిక రంగాల పునాదులు బలోపేతం అయ్యాయి.
మిలటరీ ఆధునీకరణ : రక్షణ రంగంలో పెట్టుబడుల పెంపు దీనికి గణనీయంగా తోడ్పడింది. మిలటరీ రంగం పై పెట్టుబడుల పెంపు, నవీకరణతో వ్యూహాత్మకంగా ప్రధానమైన దేశంగా గుర్తింపు తెచ్చుకుంది. దీనికి తోడు హిందూ మహాసముద్రంలో నావికాదళాన్ని విస్తృతం చేయడం, ప్రాంతీయ రక్షణ పరంగా మన దేశం తన ప్రాధాన్యతను నిలబెట్టుకుంది. రక్షణ రంగ బడ్జెట్ ను గణనీయంగా పెంచుకోవడం ద్వారా సైనిక బలం పెరిగింది.
దౌత్యపరంగానూ : అంతర్జాతీయంగా దౌత్యసంబంధాల విషయంలో మన దేశం వేసిన అడుగులు ప్రపంచ వ్యాప్తంగా తన ప్రాధాన్యతను విస్తృతం చేసుకోడానికి దోహదపడింది. ఐక్యరాజ్యసమితి, జీటువో, బ్రిక్స్, క్వాడ్ లాంటి సదస్సులలో పాల్గొనడం మన ప్రధాన్యతను సుస్థిరం చేసింది. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, యూరోపియన్ దేశాలతో మనదేశం ఏర్పాటు చేసుకున్న వ్యూహాత్మక భాగస్వామ్యంతో అంతర్జాతీయంగా తన ప్రాధాన్యతను పెంచుకుంది.
శాస్త్ర సాంకేతిక పురోగతి : అంతరిక్ష పరిశోధనలు, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల సృష్టి, సమీకరణ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో మనం సాధించిన పురోగతి ఈ రంగాల్లో భారత ప్రతిభ నాయకత్వ స్థాయికి వెళ్లేలా చేసింది. డిజిటల్ ఇండియా, అకుంర సంస్థల ఏర్పాటు, రిన్యువబుల్ ఎనర్జీ రంగాల్లో మనం సాధించిన విజయాలు, చేస్తున్న కృషి మనదేశం టెక్నలాజికల్ పవర్ హౌస్ గా నిలదొక్కుకునేలా చేశాయి.
సంస్కృతిక సంపద : మనకున్న బలమైన చరిత్ర, సంస్కృతి, బాలీవుడ్ రంగం, యోగాతో పాటు అనేక కళా రంగాల సంస్కృతిక సంపద మన బలం పెరిగేందుకు దోహదపడ్డాయనే చెప్పాలి. ఈ సంస్కృతిక విస్తృతి అంతర్జాతీయంగా కూడా జరగడంతో ఆసియాలో మనదేశ ప్రభావం పెరిగింది. ప్రపంచ యవనికపై మనం కూడా కీలక పాత్రధారులమనే చాటి చెప్పింది.
జపాన్ ఎందుకు దెబ్బతిందంటే : జపాన్ ఆర్థిక పరంగా, టెక్నాలజీ పరంగా బలమైన దేశమే అయినా ఈ మధ్య కాలంలో ఆసియాలో దాని ప్రభావం తగ్గిపోయింది. మానవ వనరులు అక్కడ తగినంతగా లేవు. ప్రభుత్వాలు అనుసరించిన విధానాల వల్ల మందకొడిగా సాగుతున్న జనాభా పెరుగుదల, పరిమిత మిలటరీ సంపద, ఆర్ధిక రంగంలో లేని పురోగతి జపాన్ ను చైనా, భారత్ కంటే వెనక పడేలా చేశాయి. మిలటరీ రంగ విస్తృతిని పరిమితం చేసుకోవడం, భౌగోళిక, రాజకీయ విధానాలను పరమితం చేసుకోవడం, విదేశాంగ విధానం, రక్షణ వ్యూహాల విషయంలో భారత్ ను దాటలేక చతికిలబడింది.
భారత్ కి కలిసొచ్చిన అంశాలేంటి?
జనాభా పెరుగుదల : మన దేశంలో పనిచేసే స్థితిలో ఉన్న జనాభా ఎక్కువ. 2030 నాటికి ప్రపంచంలోనే అత్యధిక శ్రామిక శక్తి కలిగిన దేశంగా మన దేశం ఆవిర్భవించనుంది. దీనివల్ల పరిశోధనలు, ఆర్థిక పురోగతి రంగాలు మరింత బలపడతాయి. ప్రపంచాభివృద్ధి ఈ యువతరమే చోదక శక్తిగా నిలవబోతోంది.
ప్రపంచ రాజకీయాల్లో వ్యూహాత్మక స్థానం : మన దేశం భౌగోళికంగానూ, రాజకీయ పరంగాను చూసుకుంటే ప్రపంచానికి మధ్యలో ఉంది. ఇండో, పసిఫిక్ ప్రాంతంలో కీలక ప్రజాస్వామ్యదేశం. ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యాలు, కూటముల ఏర్పాటులో మన దేశానికి ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుంది. క్వాడ్ లాంటి సదస్సుల్లో మన గళానికి ప్రాధాన్యత, ఇండ్ పసిఫిక్ తీర ప్రాంతంలో సుస్థిరతను సాధించే ప్రపంచ దేశాలలో మనదే కీలకమైన పాత్ర అవుతోంది.
ఆర్థిక సంస్కరణలు, మౌలిక వనరుల కల్పనలే ఊతం : ఆర్ధిక సుస్థిరతను సాధించడానికి మౌలిక వనరుల కల్పన, ఉత్పత్తులు, టెక్నాలజీ రంగాలలో ఈ మధ్య చేసిన సంస్కరణలు ఆయారంగాల్లో విదేశీ పెట్టుబడులు పెరిగేందుకు దోహదపడ్డాయి. తద్వారా మరింత ఆర్ధిక పరిపుష్టి కలిగిన దేశాలలో మన ప్రాధాన్యత పెరిగింది.
క్లైమేట్ ఛేంజ్, సుస్థిరత రంగాలలో నాయకత్వం : కర్బన ఉద్గారాలను తగ్గించి, పర్యావరణ పరిరక్షణ విషయంలోనూ, సంప్రదాయ ఇంధన వనరుల సృష్టిలోనూ మెరుగుదల సాధించడానికి మనం పెట్టుకున్న గోల్స్ అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారత నాయకత్వ శక్తిని చాటాయి. ప్రపంచ పర్యావరణ లక్ష్యాలను సాధిస్తూనే పర్యావరణ ప్రమాణాలను నిర్దేశించడంలో మనం ప్రపంచానికి దిశానిర్దేశం చేసే స్థితికి చేరుకున్నాం.
ఎదురవుతున్న సవాళ్లెన్నో : దక్షిణాసియాలో మూడో సూపర్ పవర్ గా ఎదిగాం సరే.. దీనిని నిలబెట్టుకుని మరింత ముందుకెళ్లాలంటే మనముందు ఎన్నో సవాళ్లున్నాయి.
ఆదాయ అసమానతలు : ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదిగినా ఆర్థిక అసమానతలు మనకు పెద్ద దెబ్బగా మారుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ అసమానతలు, అంతరాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీర్ఘకాలిక పురోగతి, సుస్థిర సాధనకి ఇవి భవిష్యత్తులో పెద్ద అడ్డంకిగా మారతాయి.
మౌలిక వనరుల అవసరాలు : మన దేశం తన శక్తిని మరింత సుసంపన్నం చేసుకోవాలంటే పూర్తిస్థాయిలో సమర్ధతను వాడుకోవాలంటే భౌతిక మౌలిక వనరుల కల్పన పై దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాల్సిందే. విద్య, రవాణా, ఆరోగ్యం రంగాల్లో ఈ పెట్టుబడులు ఉండాలి. దేశ జనాభా సంపదని పూర్తిగా వినియోగించాలంటే ఈ రంగాల్లో పెట్టుబడులు తప్పనిసరి.
భౌగోళిక, రాజకీయ ఒత్తిడులు : ఆర్ధికంగా ఎంతో శక్తిమంతంగా ఎదుగుతున్నా పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్ నుంచి వచ్చే ప్రమాదాలు, సరిహద్దుల ఉద్రిక్తతలు ప్రాంతీయ సుస్థిరతకు సవాల్ గా మారుతున్నాయి. కయ్యానికి కాలుదువ్వే ఈ రెండు దేశాలతోనూ సంబంధాలను బాలెన్స్ చేసుకుంటూ అడుగులేస్తేనే ప్రాంతీయంగానూ, ప్రంపంచంలోనూ మన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగలం.
సూపర్ పవర్ గా ఎదగడానికి దోహదపడిన ఆర్థిక, మిలటరీ, దౌత్య రంగాలలో తన సమర్ధతను, ఆధిక్యతను నిలబెట్టుకుంటూనే ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశంగా ఎదగాలి. సవాళ్లను అధిగమిస్తూనే ఆసియా ప్రాంతం భవిష్యత్తును బలంగా తీర్చి దిద్దాలి. ప్రాంతీయంగా, ప్రపంచ స్థాయిలోనూ తన ప్రభావాన్ని ఇండియా ఏ మాత్రం కొనసాగించగలదన్న అంశాన్ని ప్రపంచం కూడా ఆసక్తిగా గమనిస్తోంది.