37.4 C
Hyderabad
Tuesday, June 16, 2026

Live Video

spot_img

సమస్య పరిష్కరించారా? మరింత జఠిలం చేశారా?

– టీటీడీలో సిఫారసులేఖలపై సందేహాలు
– తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసులపై పరిమితి
– వారంలో నాలుగు సిఫారసు లేఖలకే అనుమతి
– చంద్రబాబు నిర్ణయంపై తెలంగాణ నేతల ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తెలంగాణ నేతలకు తలనొప్పులు తెచ్చేలా పరిణమించింది. తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోవాలన్న డిమాండ్లు ఎక్కువవుతున్నాయి. శ్రీనివాసుడిని దర్శించుకునే భక్తుల్లో ఏపీతో సమానంగా తెలంగాణ భక్తులు ఉంటారు. అయితే, రాష్ట్రం విడిపోయిన తర్వాత కేవలం విభజిత ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలనే దర్శనం, వసతికోసం టీటీడీ పరిగణనలోకి తీసుకుంటోంది. దీనిపై మొదటినుంచీ తెలంగాణ ప్రజా ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. తమ సిఫారసు లేఖలకు గతంలో మాదిరిగానే ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను ఇకపై దర్శనం, వసతి సదుపాయాల కోసం పరిశీలించాలని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌నాయుడుకు చంద్రబాబు సూచించారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలను అనుమతించాలన్నారు. ఒక్కో ప్రజాప్రతినిధికి సంబంధించి వారానికి నాలుగు సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయించారు. వాటిలో రెండు బ్రేక్‌ దర్శనాలు, రెండు రూ.300 దర్శనాలకు అనుమతించాలని చంద్రబాబు ఆదేశించారు. ఇందాకా బాగానే ఉంది గానీ.. ఇందులో కొర్రీపెట్టారు. అయితే, ఈ సిఫారసు లేఖల వ్యవహారంలో పరిమితి విధించడం సమస్యను మరింత జఠిలం చేసేలా ఉంది.

సమస్యను పరిష్కరించాలని నాయకులు కొంతకాలంగా ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తుంటే ఆ సమస్యను మరింత ఎక్కువ చేశారని తెలంగాణ నాయకులు అంటున్నారు. శ్రీవారిని దర్శించుకునే భక్తుల్లో ఏపీతో పాటు.. తెలంగాణ భక్తులు సమానంగా ఉంటారు. పైగా.. ఇదో సెంటిమెంట్‌. ప్రజాప్రతినిధుల లేఖలు తీసుకొని తిరుమలకు వెళ్లడం భక్తులు ప్రివిలేజ్‌గా భావిస్తుంటారు. అందుకే తిరుమల సిఫారసు లేఖలకు తీవ్ర పోటీ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వారానికి కేవలం నాలుగు దర్శనాలకు మాత్రమే అనుమతించాలన్న ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి.

ఎలాగూ నిర్ణయం తీసుకున్నారు. తోటి తెలుగు రాష్ట్రంలోని తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసులను లెక్కలోకి తీసుకుంటున్నారు. ఇక.. ఆ సిఫారసులపైనా పరిమితి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. సిఫారసు లేఖల అనుమతికి పరిమితి ఎత్తేయాలని.. ప్రజా ప్రతినిధులతో పాటు.. శ్రీవారి సామాన్య భక్తులు కోరుతున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com