- ఆంగ్ల బోధన ఆగిపోతే తెలుగు పరిఢవిల్లుతుందా…?
- జీవో రద్దుతో తెలుగు భాషాభివృద్ధి జరుగుతుందా…?
- గ్లోబలైజేషన్ కాలంలో తెలుగు విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి పొందగలరా…?
తెలుగు భాష అమ్మ భాష.. మన భాష.. తెలుగు నాగరిక సమాజంలో నలుగురి మధ్య చక్కని అవగాహనను కల్పించే ఓ కమ్యూనికేషన్ సాధనం. పరభాషా మోజులో తెలుగు భాష మూలాలు దెబ్బతినేస్తున్నాయని మన భాషా వేత్తలు, తెలుగు భాష ప్రేమికులు ఎప్పటినుంచో ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సినారే, ఎన్టీఆర్ లాంటి వారు తెలుగుభాషకు వెలుగులద్దారు. ఎన్టీఆర్ హయాంలో ప్రభుత్వ శాఖల్లో తెలుగులోనే జీవోలు ఉండాలనే తపన కూడా పడేవారు. ఇది భాషాభిమానులందరూ సంతోషించే అంశమే. ఏపీలో రెండు రోజుల పాటు ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు అంగరంగ వైభవంగా జరిగాయి. భాష నశిస్తే జాతి మనుగడ కోల్పోతుందని, సమాజం చైతన్యవంతం కావడానికి, భాష పై మమకారం, తెలుగు జాతిపై అనురాగం పెంచడానికే ఈ సభల నిర్వహణ జరిగిందని సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. తెలుగు ఔన్నత్యాన్ని ముందు తరాలకు తెలియచెప్పడానికే ఈ సభలు ప్రతీఏటా నిర్వహిస్తున్నామని తెలుగు భాషను, సాహిత్యాన్ని, దరిచేర్చే క్రమంలో ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే అంశమూ ఆలోచిస్తున్నామని సభల నిర్వాహకులు మండలి బుద్ధ ప్రసాద్, యార్లగడ్డ లక్ష్ట్మీ ప్రసాద్ వివరించారు. భాషా పరిరక్షణకు తెలుగు భాషను మరింత విశ్వవ్యాప్తం చేయడానికి రచయితలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పాల్గొన్న వక్తలు కూడా తెలుగు భాష కోసం ఏం చేయాలో చెప్పారు. భాషా పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. భాష బతికించుకోడానికి పోరాటాలు చేయాల్సి వస్తోందని ఇది దురదృష్టకరమని అన్నారు. ఇదే సందర్బంగా తెలుగు భాషకు ఎంతో సేవ చేసిన రామోజీరావును కూడా వక్తలు స్మరించుకున్నారు. సమావేశంలో మార్గదర్శి ఎండీ శైలజా సుమన్ కూడా పాల్గొన్నారు. తెలుగు భాషకు తమ సంస్థలు చేసిన కృషిని ప్రస్తావిస్తూనే రామోజీరావు ప్రసార మాధ్యమాల్లో తీసుకొచ్చిన కొత్త వరవడికి గుర్తుగా అందరం గుడ్ మార్నింగ్ కు బదులు శుభోదయం అని తెలుగులోనే పలకరించుకుందామనే ప్రతిపాదన చేశారు. ఇంకా సమావేశాల్లో పాల్గొన్న వారంతా భాషాభి వ్రుద్ధి కోసం రచయితకు పలు సూచనలు చేశారు.
మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ.రమణ తెలుగు భాషను, సంస్కృతిని రక్షించుకుంటేనే మనం గొప్పవాళ్లం అవుతామని అన్నారు. ఈ సందర్భంగా ఆయనో ప్రధాన సూచన చేశారు. ప్రభుత్వ పాఠశాలలలో ఒకటవ తరగతినుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెడుతూ గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 85ని రద్దు చేయాలని సూచించారు. మళ్లీ పాత విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఇక్కడ సమస్య జీవో రద్దుతో తీరిపోతుందా?. ఇదే సమావేశంలో పాల్గొన్న కూటమి మంత్రి కందుల దుర్గేష్ తన ప్రసంగానికి రాజకీయ చణుకులు అద్దారు. గత ప్రభుత్వం తెలుగు భాషను చంపేసే కుట్రతో ముందుకెళ్లిందన్నట్లు మాట్లాడారు. ఆంగ్ల మాధ్యమాన్ని చొప్పించే కుట్రతో తెలుగు భాషకు తూట్లు పొడిచి దెబ్బ తీశారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మాతృ భాషా వికాసానికి కట్టుబడి ఉందని తేల్చారు. తెలుగు వికాసాన్ని నాశనం చేసేలా తీసుకున్న నిర్ణయాలను ప్రజలు, భాషాభిమానులు ఓటుతో తిరస్కరించారని అక్కడికక్కడ అలవోకగా ఓ నేరేటివ్ క్రియేట్ చేసేశారు. చంద్రబాబు, పవన్ తెలుగు భాష పరిరక్షణ కోసం కంకణం కట్టుకున్నారని, కృత నిశ్చయంతో ఉన్నారనీ తెలిపారు. తెలుగు భాషపై మక్కువతో ఓటేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించారనడంలో అసలు లాజిక్ ఉందా? మొన్నటి ఎన్నికలు జరిగిన తీరు వివాదంలోకి వెళ్ల దలచుకోలేదు కానీ ప్రభుత్వ బడులను మూసేసి, చదువుల్లో కార్పొరేట్ కల్చర్ ను తీసుకొచ్చి దానిని సామాన్యులకు అందని ద్రాక్షలా చేసినది ఎవరు? కాన్వెంట్ కల్చర్ ను, ప్రైవేటు విద్యావ్యవస్థను విశృంఖలంగా పెంచిపోషించి చదువులను సంపన్న వర్గాల సొత్తుగా మారిపోవడానికి బాధ్యులు ఎవరు..?
తెలుగు భాష పరిఢవిల్లాల్సిందే… స్వచ్ఛమైన, సుందరమైన తెలుగు భాషను భవిష్యత్తు తరాలకు అందివ్వాల్సిన బాధ్యత ముమ్మాటికీ వర్తమాన తరానిదే… అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఎవరి నిర్ణయాలనో వ్యతిరేకించడానికో… మరెవరివో వ్యాపారాత్మక ఆలోచనలను సంరక్షించడానికో తెలుగు బాషను భుజాన వేసుకోకుండా నిజంగా చిత్తశుద్దితో ఎంతమంది తెలుగు భాషా పరిరక్షనకు కంకణబద్దులై ఉన్నారు. వ్యక్తిగత స్థాయిలో ఏం కృషి చేసినట్టు? ఆత్మ విమర్శ ఎప్పుడైనా చేసుకున్నారా? భాషా పరిరక్షణకు వారు వారి కుటుంబాలు, బంధుత్వాల స్థాయిలో ఎంత మేరకు కృషి చేశారు. ఆంగ్ల మీడియంను తొలగించాలని చెబుతున్నారు సరే.. మరి వీరందరి పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలోనే చదివి ఇప్పుడున్న స్థాయికి చేరుకున్నారా.
ప్రపంచ స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకుని పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే ఆంగ్ల భాషపై పట్టు సాధించడం అనివార్యంగా మారిన ప్రస్తుత తరుణంలో తెలుగు భాష పరిరక్షణకు ఇంతకన్నా మెరుగైన ప్రతిపాదనలు చేయలేరా? అంతెందుకు సమావేశాల్లో పాల్గొన్న ఆహుతుల పిల్లలు ఎంతమంది తమ తమ ఇళ్లలో, సన్నిహితులతో తెలుగులో సంభాషిస్తున్నారు? ఈరోజు అగ్రస్థాయినేతలు, రాజకీయ వేత్తల పిల్లల్లో ఎంత మంది ప్రభుత్వ బడుల్లో చదివారు… చదువుతున్నారు…? వారు అలాగే ఉంటే ఈ రోజు ఉన్నత పదవులలో ఉండగలిగేవారా? ప్రముఖుల పిల్లలందరూ ఇంటర్నేషనల్ స్కూళ్లలోనూ కాన్వెంట్లలోనూ ప్రాథమిక విద్యలు పూర్తి చేసే ఆపై వేరే రాష్ట్రాల్లో పరభాషలో చదువుకుని అవకాశాలు, పలుకుబడితో పదవులు పొందినవారు కాదా? వ్యాపారావకాశాలు సొంతం చేసుకుని ఆర్థికంగా స్థిరపడిన వారు కాదా? సామాన్యుడికి సైతం నాణ్యమైన విద్య అన్న ఉద్దేశాన్ని భాషా పరిరక్షణ పేరుతో తొక్కేసి ఓవర్గంపై ఆ బాధ్యత నెట్టేయడం అంతరాలకు ఆజ్యం పోయదా?
పేదరికంలో మగ్గిపోతూ నాణ్యమైన మెరుగైన కమ్యూనికేషన్ సాధనాలు లేక ఎంతమంది మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోతున్నారు. కేవలం ఆంగ్ల పరిజ్ఞానం లేక తమకున్న అపరిమితమైన శక్తులను కూడా వారు పూర్తి స్థాయిలో ప్రదర్శించలేక ఎన్నో అవకాశాలను కోల్పోతున్న వారెంత మందో. తెలుగు భాషలోనే విద్యా బోధన చేస్తే నేటి పోటీ ప్రపంచంలో తట్టుకోగలమా? మారుతున్న అవసరాలు, పెరుగుతున్న ప్రాధాన్యతలు, గ్లోబలీకరణ నేపధ్యంలో ప్రపంచ స్థాయి సమర్ధతను సాధించాలంటే అది తెలుగుతో సాధ్యమా? సోషల్ మీడియా, ఇంటర్నెట్, వాట్సప్ లాంటి ఆధునిక సాంకేతిక సమాచార వ్యవస్థలతో అనుసంధానించి చదువుకుంటేనే పోటీ ప్రపంచంలో రాణించేది. ఆ కమ్యూనికేషన్ వ్యస్థలన్నీ ఆంగ్లంలోనే నడుస్తున్నాయి. మరి దానికి పునాదులు ఆంగ్లంలో పడితేనే కదా మనగలిగేది.
తెలుగు భాష పరిరక్షణకు స్కూళ్లలో ఆంగ్ల మీడియం తీసేయడమే మార్గమా? పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలంటే, సరైన ఉద్యోగం సాధించాలంటే అర్హతకు తగిన ఉద్యోగం సాధించాలంటే ఆంగ్ల భాష లేనిదే సాధ్యమా? ఎదిగే పిల్లలకి ప్రపంచ స్థాయి భాషా మాధ్యమంలో బాల్యం నుంచి పునాదులు పడితేనే కదా వారు అవకాశాలను అందిపుచ్చుకునేది. తెలుగు భాష పరిరక్షణకు అనేక మార్గాలున్నాయి. తెలుగు భాష అమ్మభాష. దీని పరిరక్షణకు ముందు ఇంట్లో నుంచే అడుగులు పడాలి. పిల్లలను కార్పొరేట్ చదువుల పేరుతో 24 x 7 మెషీన్లుగా తయారు చేసేస్తుంటే సమాజ నిర్మాణంపై వారికి అవగాహన ఎలా పెరుగుతుంది?
ఆ స్థాయికి మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ఎదిగితేనే కదా సమాజం బాగా ఉండేది. తెలుగు భాషను కాపాడుకోవడం అనేది సమష్టి సామాజిక బాధ్యత. దీనికి ఇంటి నుంచి అడుగులు పడాలి. తల్లి దండ్రులు కొంత సమయం పిల్లలకోసం కేటాయించాలి. వారికి ఇంట్లో తెలుగు నేర్పాలి. సాహిత్యంపై మమకారం పెంచాలి. ఇది ఇంట్లో వ్యక్తిగత స్థాయిలో జరగాలి. స్కూళ్లలో మాత్రమే కాదు. అప్పుడే భాషలో కమ్మదనాన్ని వారు ఆస్వాదిస్తూనే పరభాషపై కూడా పట్టు సంపాదించి పోటీ ప్రపంచంలో రాణిస్తారు.