– పార్టీలకతీతంగా మాజీ ప్రధాని సేవలు కొనియాడిన నేతలు
– మన్మోహనే దేశానికి దిశానిర్దేశమన్న మంత్రులు
తెలంగాణ అసెంబ్లీలో మాజీ ప్రధాని దివంగత మన్మోహన్‌సింగ్‌కు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. మన్మోహన్‌సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని, ఆయన విగ్రహాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ్యులందరూ పార్టీలకతీతంగా సమర్థించారు. అసెంబ్లీలో ఈమేరకు తీర్మానం చేశారు.
మన్మోహన్‌కు సంతాప తీర్మానం చేసే కార్యక్రమంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడారు. వాళ్లతో పాటు.. మిగతా మంత్రులు, వివిధ పార్టీల నాయకులు కూడా సంతాప సందేశాన్ని అందించారు.
రుణమాఫీకి శ్రీకారం చుట్టిన మన్మోహన్ – మంత్రి ఉత్తమ్
మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే విప్లవాత్మక భూసేకరణ చట్టం వచ్చిందని తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. దేశ క్షేమం దృష్ట్యా మన్మోహన్ సింగ్ న్యూక్లియర్ ఒప్పందం కుదుర్చుకున్నారని, రైతులకు రుణమాఫీ చేసిన తొలి ప్రధాని మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. సోనియా గాంధీ సూచనల మేరకు ఆయన గొప్ప చట్టాలు తెచ్చారని గుర్తు చేశారు.
భవిష్యత్ తరాలకు స్ఫూర్తి మన్మోహన్‌సింగ్ – దామోదర రాజనర్సింహ
మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శప్రాయమని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అసెంబ్లీలో మన్మోహన్ మృతికి సంతాప తీర్మానం సందర్భంగా ఆయన మట్లాడారు. మన్మోహన్ మానవతావాది, దార్శనికులు అని కొనియాడారు. దేశం ఆర్థిక స్థిరత్వం సాధించడంలో మన్మోహన్ కృషి ఉందన్నారు. కూటమిలో విభేదాలున్నా.. యూఎస్‌తో అణుఒప్పందం చేసుకున్నారని తెలిపారు. మన్మోహన్ సౌమ్యుడు, మితభాషి, ఓ విజనరీ, కమిట్ మెంట్ ఉన్న వ్యక్తి, అందరికీ ఆదర్శవంతుడని కొనియాడారు రాజనర్సింహ.
హైదరాబాద్ మెట్రోకు కారణం మన్మోహన్ – మంత్రి పొన్నం
అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ కారణంగానే హైదరాబాద్‌కు మెట్రో వచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. దేశ ఆర్థిక ప్రగతికోసం ఆర్‌బీఐలో అనేక మార్పులు తీసుకొచ్చారన్నారు. కరీంనగర్ ముద్దుబిడ్డ పీవీ ఆధ్వర్యంలో మన్మోహన్ ఆర్థిక మంత్రి అయ్యారని, ఆ తర్వాత ప్రధానిగా పదేళ్లపాటు దేశానికి సేవలందించారన్నారు. మన్మోహన్ తో కలిసి పనిచేసే అవకాశం తనకు దక్కడం అదృష్టమని గుర్తు చేసుకున్నారు. మోడల్ స్కూల్ వ్యవస్థను మన్మోహన్ తీసుకొచ్చారని పొన్నంచెప్పారు. గ్లోబలైజేషన్ తోనే దేశాభివృద్ధి సాధ్యమని, ఆనాడే దీన్ని మన్మోహన్ గ్రహించారని అభిప్రాయపడ్డారు. ఆర్టీఐ చట్టంతో పారదర్శకతకు పెద్దపీట దక్కిందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మన్మోహన్ సింగ్ 90 ఏళ్ల వయసులో వీల్ ఛైర్ లో వచ్చి రాజ్యసభలో ఓటు వేశారని గుర్తు చేశారు. దేశంలో 72 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేశారని తెలిపారు. మన్మోహన్ సింగ్ హైదరాబాద్ కు ఓఆర్ఆర్, మెట్రో రైల్ ప్రాజెక్టులు ఇచ్చారని గుర్తు చేశారు పొన్నం. మన్మోహన్ మృతిపై ప్రపంచ దేశాలు స్పందించాయని.. మన్మోహన్ సహకారంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యిందన్నారు.
రాజకీయ నాయకులంటే మన్మోహన్‌లా ఉండాలి – కోమటిరెడ్డి
ప్రపంచం మెచ్చిన ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ అని మరుఓ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రాజకీయ నాయకులుఎంత హుందాగా ఉండాలో తన వ్యవహారశైలితోనే నిరూపించిన అరుదైన నాయకుడన్నారు. ప్రధాని పదవిలో ఉన్నా ఇంటినుంచే చద్దన్నం తెప్పించుకొని తినేవారని, అంత సింప్లిసిటీ ఉన్న నాయకులు ఇప్పుడు కనిపించడం లేదన్నారు. ఈ దేశానికి ఏం కావాలో ఆయనకు తెలిసినంతగా మరే నాయకుడికి తెలియదన్నారు. అప్పుచేయకపోతే దేశం మనుగడ సాధించలేని పరిస్థితి నుంచి.. ఇప్పుడు ప్రపంచంలోనే బలమైన ఆర్థికశక్తిగా దేశాన్ని నిలపడం వెనుక మన్మోహన్‌సింగ్ ఆలోచన ఉందన్నారు. నిగర్వి, నిరాడంబరుడు, దేశాన్నే మలుపుతిప్పిన మహానాయకుడు మన్మోహన్ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తేనే తెలంగాణకు సార్థకత చేకూరుతుందన్నారు.