29.2 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఈటల?

భారతీయ జనతాపార్టీ తెలంగాణ పగ్గాలు ఎంపీ ఈటల రాజేందర్‌కు అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు పార్టీలో అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది. పార్టీ అధ్యక్ష బరిలో పలువురు నాయకులు ఉండగా.. ఈటలవైపే అధిష్టానం మొగ్గుచూపే అవకాశం ఉంటుందంటున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చేసింది. బండి సంజయ్‌ నుంచి కిషన్‌రెడ్డికి బాధ్యతలు బదలాయించింది. దీంతో, కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా వ్యవహరిస్తూనే పార్టీ రాష్ట్ర బాధ్యతలు చూస్తున్నారు. ఒక నాయకుడిని ఒకే పదవి ఉండాలన్న బీజేపీ విధానం ప్రకారం కిషన్‌రెడ్డిని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పిస్తారన్న ప్రచారం లోక్‌సభ ఎన్నికలు పూర్తయినప్పటినుంచీ ఉంది. అయితే, ప్రతిసారీ ఈ అంశంపై చర్చలు జరగడం, పార్టీలో గుసగుసలు వినిపించడమే తప్ప అధిష్టానం నుంచి ఏవిధమైన సంకేతాలు రావడం లేదు. కానీ, ఆశావహులు మాత్రం తమ ప్రయత్నాలు తాము చేస్తూనే ఉన్నారు. అయితే, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరిగే అవకాశం ఉండటం, కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా కీలక బాధ్యతల్లో మునిగి తేలడం వంటి కారణాలతో రాష్ట్ర పార్టీ పగ్గాలు మరొకరికి అప్పగించే యోచనలో బీజేపీ జాతీయ నాయకత్వం ఉన్నట్లు చెబుతున్నారు.

భారతీయ జనతాపార్టీ తెలంగాణ అధ్యక్ష పదవికి మొదటినుంచీ పలువురు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌, మహబూబ్‌నగర్‌ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇందులో మరో కీలక విషయం ఏంటంటే.. వీళ్లంతా ప్రస్తుతం ప్రజా ప్రతినిధులే. ముగ్గురు ఎంపీలు కాగా, ఒకరు ఎమ్మెల్యే. వాస్తవానికి ఒకే నాయకుడికి రెండు పదవులు ఉండొద్దన్న ఆలోచన నేపథ్యంలోనే అధిష్టానం అధ్యక్షుడిని మార్చుతుందన్న చర్చ జరుగుతుండగా.. ఈ పదవికి పోటీ పడుతున్న వాళ్లు కూడా ప్రజాప్రతినిధులే కావడంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

అయితే, బీజేపీ చీఫ్‌ పదవికి ప్రయత్నిస్తున్న నలుగురిలోనూ ఈటల రాజేందర్‌వైపే అధిష్టానం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. రాజకీయంగా అనుభవం, ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం, గతంలో ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనుభవం, అన్నింటికీ మించి ఆర్థికంగా కూడా పార్టీని ముందుకు నడిపించే సామర్థ్యం ఈటల రాజేందర్‌కు ఉన్నట్లు పార్టీకి స్పష్టమైన సమాచారం ఉండటం వల్లే ఈటలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనున్నట్లుగా సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలాన్ని పెంచడంతో పాటు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకు రావాలన్న వ్యూహంతో అధిష్టానం పావులు కదుపుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఆ టార్గెట్‌ ఛేదించాలంటే ప్రస్తుతం పోటీ పడుతున్న వాళ్లలో ఈటల రాజేందరే సమర్థుడన్న క్లారిటీ అధిష్టానం ముందు ఉందంటున్నారు. అంతేకాదు. ఈటల సామాజిక వర్గం కూడా ఇక్కడ ప్రధానపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్‌పార్టీ టీపీసీసీ ప్రెసిడెంట్‌గా బలమైన బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన మహేష్‌కుమార్‌గౌడ్‌ను నియమించింది. బీజేపీ కూడా ఇదే సూత్రం ఫాలో అయి బీసీలకే రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పగించాలని అనుకుంటోందని, ఆ అంశం కూడా ఈటలకు కలిసి వస్తుందని చెబుతున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com