తెలంగాణలో సర్కారు ఇళ్లకోసం దాదాపు దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న లబ్దిదారుల కల నెరబోతోంది. ఇందిరమ్మ ఇళ్లకోసం సర్వే మొదలయ్యింది. క్షేత్రస్థాయిలో మున్సిపల్, పంచాయతీ సిబ్బంది దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఇంతకుముందు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా లబ్దిదారులను వడపోస్తున్నారు. దీంతో, రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులకు కార్యాచరణ మొదలైందన్న చర్చ అంతటా సాగుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి.
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఊరట కలిగిస్తున్నాయి. ప్రభుత్వం ముందుగానే ప్రకటించిన మేరకు.. స్థలం ఉన్న లబ్దిదారులకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని నాలుగు విడతల్లో అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు.. ఆర్థికంగా ఉపశమనం కలిగించేలా ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఇసుక, ఉక్కు, సిమెంటును తక్కువ ధరకే అందజేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. బహిరంగ మార్కెట్లో ఇంటి నిర్మాణానికి ఉపయోగించే సామాగ్రి ధరలు చుక్కలనంటుతున్న సమయంలో.. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయంపై ఆధారపడుతున్న పేదలపై పెద్దగా భారం పడకుండా చూడాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ అంశాలతో తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ రూపొందించిన నివేదికను రాష్ట్రప్రభుత్వం పరిశీలిస్తోంది.
సొంతింటి స్థలం ఉన్నవాళ్లు 400 చదరపు అడుగుల స్థలంలో ఇల్లు నిర్మించుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇలా నిర్మిస్తున్న ఇంటికి 25 క్యూబిక్ మీటర్ల ఇసుక, 180 నుంచి 190 బస్తాల సిమెంటు, 1.5 మెట్రిక్ టన్నుల ఉక్కు అవసరం అవుతుందని, అధికారులు ఆ నివేదికలో స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ మొత్తం ఇళ్ల నిర్మాణానికి 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక, 40.5 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్, 68 లక్షల మెట్రిక్ టన్నుల ఉక్కు అవసరం అవుతుందని నివేదికలో పేర్కొన్నారు. ఇసుక ప్రభుత్వ పరిధిలోనే ఉండడంతో.. ఇందిరమ్మ ఇళ్లకు మార్కెట్ ధర కంటే తక్కువకే అందజేసేలా మినరల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అలాగే, ప్రస్తుతం సిమెంట్ బస్తా ధర రూ.260కి పైగా ఉంది. ఉక్కు ధర ఒక మెట్రిక్ టన్నుకు రూ.49 వేల నుంచి రూ.54 వేల వరకు ఉంది. ఈ రెండు మెటీరియల్స్‌కు సంబంధించి ధరల నిర్ణయానికి సంబంధిత కంపెనీలతో చర్చలు జరపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఉక్కు కొనుగోలు చేసే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.
ప్రజల్లో అపోహలు తలెత్తకుండా, లబ్దిదారులకు అవగాహన కలిగేలా.. మొదట గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో ఇందిరమ్మ నమూనా ఇళ్లను నిర్మిస్తున్నారు. రాస్ట్రవ్యాప్తంగా 500 మండల కేంద్రాల్లో ఇందిరమ్మ ఇళ్లను గృహనిర్మాణశాఖ నిర్మిస్తోంది. ఈ పకాన్ని పర్యవేక్షించే అధికారులు ఈ నమూనా ఇళ్లనే తమ కార్యాలయాలుగా వినియోగించుకుంటూ లబ్దిదారులకు సేవలందించనున్నారు. ఈ క్రమంలో 500 మండలాలకు గానూ, 474 ప్రాంతాల్లో స్థలాలను కూడా ఎంపిక చేసేశారు. ఆదిలాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్, కొమురంభీం-ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్, ఖమ్మం, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లోని 23 చోట్ల ఆల్‌రెడీ ఇందిరమ్మ నమూనా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల్లో భాగంగా లబ్దిదారులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టారు. ఆ ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్లకోసం రాష్ట్రవ్యాప్తంగా 80.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 69,83,895 దరఖాస్తులు గ్రామీణ ప్రాంతాల నుంచి రాగా, 10,70,659 దరఖాస్తులు జీహెచ్‌ఎంసీ పరిధిలో వచ్చాయి. వీటిలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 30.83లక్షల దరఖాస్తుల వడపోత ప్రక్రియ పూర్తయ్యింది. అలాగే, జీహెచ్‌ఎంసీ పరిధిలో కూడా 74,380 దరఖాస్తులను పరిశీలించి లబ్దిదారులను ఎంపిక చేశారు. పూర్తయిన దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి 9,19,676 మంది వివరాలను ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో నమోదు చేశారు. నల్లగొండ నుంచి అత్యధికంగా 4,31,831 దరఖాస్తులు రాగా.. ఆ తర్వాతి స్థానాల్లో రంగారెడ్డి జిల్లా(3,75,013), ఖమ్మం(3,57,869), సూర్యాపేట(3,09,062), నిజామాబాద్(3,20,831), సంగారెడ్డి(3,18,775) జిల్లాలు ఉన్నాయి.