ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ విడుదల
అందరూ ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. అయితే పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇక భారత్ ఆడే మ్యాచ్ లన్నీ తటస్థ వేదికైన దుబాయ్ లో జరగనున్నాయి.
గ్రూప్ ఏలో భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ న్యూజిలాండ్ దేశాలున్నాయి. వీటిలో భారత్ మిగిలిన మూడు దేశాలతో మ్యాచ్ లు ఆడుతుంది. ఇక్కడ గెలిస్తే సెమీఫైనల్, అక్కడ గెలిస్తే ఫైనల్ కి ఇండియా వెళుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే అలా జరిగితే ఆ రెండు మ్యాచ్ లు కూడా దుబాయ్ లోనే జరుగుతాయని ఐసీసీ ప్రకటించింది.
ఫిబ్రవరి 20న టీమ్ ఇండియా తొలిమ్యాచ్ ను బంగ్లాదేశ్‌తో ఆడనుంది. అలాగే 23న పాకిస్తాన్ , మార్చి 2న న్యూజిలాండ్ తో మ్యాచ్ లు జరగనున్నాయి. భారత మ్యాచ్ లన్నీ మధ్యాహ్నం 2.00 గంటలకు ప్రారంభమవుతాయి. మార్చి 4న మొదటి సెమీఫైనల్, మార్చి 5న రెండో సెమీఫైనల్ జరుగుతాయి. మార్చి 9న ఫైనల్ జరగనుంది.
నిజానికి ఆటగాళ్ల భద్రత నేపథ్యంలో టీమ్ ఇండియా అస్సలు పాకిస్తాన్ లో అడుగుపెట్టేదే లేదని తేల్చి చెప్పింది. దీంతో పాకిస్తాన్ ఒక మెట్టు దిగింది. కానీ ఒక కండీషన్ పెట్టింది. 2027 వరకు జరిగే ఐసీసీ టోర్నమెంట్లు ఒకవేళ ఇండియాలో జరిగితే తాము కూడా వెళ్లమని తెగేసి చెప్పింది. తటస్థ వేదికలు తమకు ఏర్పాటు చేయమని కోరింది. దీనికి ఐసీసీ అంగీకరించింది. హైబ్రీడ్ పద్ధతిలోనే ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుందని ఐసీసీ తెలిపింది.
అయితే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ్యవహారాన్ని తెగేవరకు లాగకుండా రాజీకి వచ్చింది. లేదంటే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణే ప్రశ్నార్థకమైంది. ఇలా పీసీబీ ఒప్పుకున్నందుకు ఐసీసీ ఒక నజరానా ప్రకటించింది. అదేమిటంటే ఓ మహిళా ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులను పీసీబీకి కేటాయించింది. మొత్తానికి కథ సుఖాంతమైంది..అంతే చాలని నెటిజన్లు పేర్కొంటున్నారు.