38.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట – సోషల్‌ మీడియాపై స్పెషల్‌ నజర్

పుష్ప-2 సినిమా బెనిఫిట్‌షో సందర్భంగా సంధ్య థియేటర్‌ తొక్కిసలాట వ్యవహారాన్ని తెలంగాణ పోలీసులు అంత తేలిగ్గా తీసిపారేయడం లేదు. ఈ వ్యవహారంపై స్పెషల్ ఫోకస్‌ పెడుతున్నారు. ప్రధానంగా సోషల్ మీడియాపై నజర్‌ వేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం, ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంఘటన జరిగిన రోజు థియేటర్‌కు అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు కొందరు తప్పుడు వీడియోలు పోస్టు చేశారని, ఆ అంశాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నామని తెలంగాణ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనపై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీసు శాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచిందని, అయినా, కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించేలా, అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు క్రియేట్ చేసిన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా పోస్టులు చేసిన విషయంపై ఎంక్వైరీచేస్తున్నామన్నారు. కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటి ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో పోలీసు శాఖను బద్నాం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తే సీరియస్ గా పరిగణిస్తామని, ఒక అమాయకురాలు మరణం, ఒక పిల్లవాడి ప్రాణానికి ప్రమాదం సంభవించిన ఈ కేసులో పోలీసు శాఖ ఎంతో నిబద్ధతతో విచారణ జరుపుతోందని స్పష్టం చేశారు. దానిని ప్రశ్నించేలా అసత్య ప్రచారాలు, అభూతకల్పనలతో సోషల్ మీడియా ద్వారా ఎవరైనా ప్రచారం చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఏ పౌరుడి దగ్గరైనా ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే పోలీసు శాఖకు అందించవచ్చని, కానీ, సొంత వ్యాఖ్యానాలు చేయవద్దని పోలీసు శాఖ తరపున విజ్ఞప్తి చేశారు. అలాగే, సోషల్‌ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com