బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కీలకమైన నాలుగో టెస్టు గురువారం నుంచి మెల్ బోర్న్ లో ప్రారంభం కానుంది. దీనిని బాక్సింగ్ టే టెస్టుగా పిలుస్తున్నారు. ఎందుకంటే డిసెంబర్ 25 క్రిస్మస్ డే కావడంతో ఇక్కడందరూ పేదలు, స్నేహితులు, బంధువులకు బాక్సులు పంచిపెడుతుంటారు. అందులో గిఫ్టులు ఉంటాయి. అందుకని క్రిస్మస్ రోజులను బాక్సింగ్ డే గా పిలుచుకుంటారు. ఆ క్రమంలో ఈ టెస్టుకు కూడా బాక్సింగ్ డే గా పిలుస్తున్నారు.
ఇకపోతే ఈ నాలుగో టెస్టు గెలిస్తేనే వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ రేసులో ఇండియా ఉంటుంది. లేదంటే ఇంతే సంగతి. ఏడాది పొడవునా టాప్ వన్ లో ఉన్న ఇండియా ఇప్పుడు రేస్ లోంచే బయటకు వెళ్లిపోయే పరిస్థితి దాపురించింది. మరోవైపు టీమ్ ఇండియా క్రికెటర్ల ఆట తీరు చూస్తే ఆందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆటగాళ్ల గురించి చెప్పుకొచ్చారు.
చాలామంది కొహ్లీ బలహీనతలపై ప్రశ్నలు వేశారు. అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ బాల్ ను వెంటాడి అవుట్ కావడం కొహ్లీకి అలవాటుగా మారిందని, ఆ బలహీనతను అధిగమించలేకపోతున్నాడని, దీనికి మీరేం సమాధానం చెబుతారని అడిగారు. దానికి రోహిత్ బదులిస్తూ విరాట్ కొహ్లీకి మనం చెప్పేటంతటోళ్లమా? అని నవ్వుతూ ప్రశ్నించాడు. తన సమస్యనెలా అధిగమించాలో తనకి బాగా తెలుసునని అన్నాడు.
ఇక బూమ్రాకి సలహాలిచ్చేటంతటి వాళ్లం కాదని అన్నాడు. తన విషయంలో ఇప్పుడే కాదు, ఎప్పుడూ జోక్యం చేసుకోనని అన్నాడు. అలాగే యశస్వి జైశ్వాల్ ఆస్ట్రేలియా రావడం ఇదే తొలిసారి. అయినా ఫస్ట్ టెస్టులో 150 పరుగులు చేశాడు. మనం అతన్ని ఒత్తిడి చేస్తే సహజత్వం దెబ్బతింటుంది. అలాగే నువ్వు గొప్ప ఆటగాడివి అని కూడా చెప్పకూడదని అన్నాడు. అలా పదేపదే పొగిడితే ఉన్న ఆట పోతుందని నవ్వుతూ అన్నాడు.
శుభ్ మన్ గిల్, రిషబ్ పంత్ వీళ్లందరూ సమర్థులైన ఆటగాళ్లని అన్నాడు. వారేం చిన్న పిల్లలు కాదు, ఏం జరుగుతుందో వారికి తెలిసినంతగా మీకు కూడా తెలీదని అన్నాడు. ఇకపోతే యువ ఆటగాళ్లను ఎప్పుడూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నాడు. అది భవిష్యత్ క్రికెట్ కు మేలు చేస్తుందని అన్నాడు.
ఓపెనింగ్ విషయమై అడిగిన ప్రశ్నపై మాట్లాడుతూ… ఇప్పుడు జట్టు సమతూకంలో ఉంది. రాహుల్ అక్కడ బాగా ఆడుతున్నాడు. అన్నింటికి మించి జట్టు కూర్పు అనేది టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం.
అలాగే మేం ఎలా ఆడాలో, గ్రౌండులో ఏం చేయాలో అనేది పదిమందిలో చర్చించుకునేది కాదని అన్నాడు. అవన్నీ మేం డ్రెస్సింగు రూమ్ లో మాట్లాడుకుంటామని అన్నాడు.
ఇక్కడ మీకు చిన్నచిన్న విషయాలపై సందేహాలు క్లియర్ చేయడానికి మాత్రమే వచ్చానని కొంచెం ఘాటుగానే తెలిపాడు. మొత్తానికి ఈ లెక్కన చూస్తుంటే నాలుగో టెస్టులో టీమ్ ఇండియా ఏమార్పుల్లేకుండానే దిగేలా కనిపిస్తోంది.