ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గతేడాది వరకు పౌరసంబంధాల శాఖ కమిషనర్‌గా ఎక్స్ అఫీషియా కార్యదర్శిగా పనిచేసిన.. కేంద్ర ప్రభుత్వ అధికారి తుమ్మ విజయ్‌కుమార్‌రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వ హయాంలో విజయ్‌కుమార్ రెడ్డి పక్షపాతంగా వ్యవహరించారని మీడియాకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలకే లబ్ది చేకూర్చారని, మరికొన్ని ప్రధాన మీడియా సంస్థలను కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదని ఏసీబీ అభియోగాలు మోపింది. అంతేకాకుండా.. ఓ మీడియా సంస్థకు చెందిన ఉద్యోగులకు ఏపీ డిజిటల్ కార్పొరేషన్, ఐఅండ్‌పీఆర్‌లో ఉద్యోగాలు ఇచ్చారని కూడా ఆరోపించింది. ఏపీ మీడియా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఢిల్లీబాబురెడ్డి ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ తర్వాత ఏసీబీ గత సెప్టెంబర్‌లోనే ఈ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా విజయ్‌కుమార్‌రెడ్డిని చేర్చిన ఏసీబీ, మరికొందరిని కూడా నిందితులుగా పేర్కొంది.
మరోవైపు.. ఏపీ సీనియర్ ఐపీఎస్ సంజయ్‌పైనా ఏసీబీ కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వ హయాంలో అగ్నిమాపకశాఖ డీజీగా, సీఐడీ చీఫ్‌గా పనిచేసిన సంజయ్.. తన హోదాలను అడ్డుపెట్టుకుని నిధుల్ని దుర్వినియోగం చేశారన్న అభియోగాలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. సంజయ్ దాదాపు రూ.1.75 కోట్ల మేర నిధుల దుర్వినియోగం చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. రెండు సంస్థలకు మోసపూరితంగా బిల్లులు చెల్లించి, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని ఆ కేసులో పేర్కొంది. సంజయ్‌పై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(ఏ) రెడ్‌విత్ 13(2), సెక్షన్ 7, ఐపీసీలోని 409, 420, 477ఏ, 120బీ, సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఏసీబీ సీనియర్ ఐపీఎస్ సంజయ్‌ను (ఏ1)గా, సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌ను (ఏ2)గా, క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను (ఏ3)గా చేర్చింది. మరికొందర్ని కూడా నిందితులుగా చేర్చనున్నట్లు సమాచారం.