హైదరాబాద్‌లోని టెక్ సిటీ పరిధిలో సైబర్ నేరాలు ఈ యేడాది అడ్డూ అదుపూ లేకుండా సాగాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతేడాదితో పోలిస్తే ఏకంగా రెట్టింపుకు మించి సైబర్ నేరాలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే సైబరాబాద్ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. గతేడాది 2023లో 5,361 సైబర్ కేసులు నమోదు కాగా, 2024లో 11,914 కేసులు నమోదయ్యాయి. ఇవి గతేడాదితో పోలిస్తే.. 122% అధికం. స్టేషన్‌లలో నమోదైన కేసుల్లో రూ.793.18 కోట్లను సైబర్ నేరగాళ్లు లూటీ చేశారు. అలాగే, ఈ యేడాది సైబర్ నేరాల్లో డిజిటల్ అరెస్టు సంఘటనలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఈ ఏడాది 1,002 డిజిటల్ అరెస్టు కేసులు నమోదయ్యాయి. వాటిల్లో రూ.80.57 కోట్లను సైబర్ నేరగాళ్లు దోపిడీ చేశారు.
ఈయేడాది నేరాల వార్షిక నివేదికను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి విడుదల చేశారు. ప్రధానంగా సైబర్ నేరాలపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు. రూ.1.5 లక్షలు దాటిన సైబర్ నేరాలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నామని, ఇందులో భాగంగానే పోయినేడాదితో పోలిస్తే సైబర్ క్రైమ్ కేసులు 122 శాతం అధికంగా నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈయేడాది మొత్తం 11,914 కేసులు నమోదు చేయగా.. ఇందులో గోల్డెన్ అవర్స్‌లో రూ.71.28 కోట్లు సీజ్ చేసి, రూ.70.46 కోట్లు బాధితులకు రీఫండ్ చేశామని సీపీ మహంతి వివరించారు.
ఇక ఈ యేడాది డిజిటల్ అరెస్టు నేరాలు కూడా పెరిగాయని సీపీ మహంతి చెప్పారు. గత యేడాది డిజిటల్ అరెస్టులకు సంబంధించి 102 కేసులు నమోదు కాగా, ఈసారి 1,002 కేసులు నమోదయ్యాయన్నారు. ఈ కేసుల్లో బాధితులు రూ.80.57 కోట్లు నష్టపోయారని చెప్పారు. తాము రూ.11.02 కోట్లను సీజ్ చేసి, అందులో రూ.5.70 కోట్లను బాధితులకు రీఫండ్ చేశామన్నారు. ఈ కేసుల్లో ఐటీ, ప్రైవేట్ ఎంప్లాయ్స్ ఎక్కువ మంది బాధితులు ఉంటున్నారని చెప్పారు. డిజిటల్ అరెస్టు మోసాలపై వాళ్లకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. సైబర్ క్రైమ్స్ తో పాటు ఆర్థిక నేరాలపైనా ప్రధానంగా దృష్టి పెట్టామని కమిషనర్ పేర్కొన్నారు.
రూ.1.5 లక్షలకు పైగా జరిగే సైబర్ నేరాలకు సంబంధించి ఇకపై స్థానిక పోలీస్ స్టేషన్లలోనూ ఫిర్యాదులు స్వీకరిస్తామని సీపీ అవినాశ్ మహంతి తెలిపారు. ఇది జనవరి 1 నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. సైబర్ క్రైమ్స్, ఆర్థిక నేరాల నియంత్రణకు సరికొత్త స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించనున్నట్టు చెప్పారు.