- సంధ్యా ధియేటర్ ఘటనపై సభలో సీయం రేవంత్ రెడ్డి ప్రకటన
- ఏసీపీ వారించినా హీరో వినలేదు
- డీసీపీ అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తే హీరో ధియేటర్ నుంచి వెళ్లాడు
సంధ్యా ధియేటర్ లోపలికి వెళ్ళేందుకు, బయటకు వచ్చేందకు ఒకే దారి ఉండటంతో సెటబ్రిటీలు వస్తే ఇబ్బందులు వస్తాయని పోలీసులు అనుమతి ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా అనుమతి లేకపోయినా ఆ సినిమా హీరో ధియేటర్ కు వెళ్లారని, సినిమా చూసి వెళ్ళిపోతే ఎటువంటి అభ్యంతరం ఉండేది కాదని ధియేటర్ కి వెళ్ళేటప్పుడు రోడ్డుపై కారు సన్ రూఫ్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటూ వెళ్లరని అసెంబ్లీలో వివరించారు. హీరో చర్యతో పక్కన ఉన్న అన్ని ధియేటర్ల నుంచి పబ్లిక్ ఒక్కసారిగా సంధ్యా ధియేటర్ వైపు రావడంతో తొక్కిసలాట జరిగినట్లు సీయం చెప్పారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు కోమాలోకి వెళ్లిపోయాడని చెప్పారు. ధియేటర్ లోపలా, వెలుపలా తొక్కిసలాట జరిగుతున్నట్లు హీరోకు ఏసీపీ చెప్పి, శాంతి భద్రతలు చేయి దాటే ప్రమాదం ఉందని చెప్పినా హీరో బయటకు వెళ్లడానికి ఒప్పుకోలేదని సభకు వివరించారు. దీంతో డీసీపీ వెళ్లి అక్కడ నుంచి కదలకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించి హీరోను కారు ఎక్కించారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే హీరోపై , యాజమాన్యం పై పోలీసులు కేసు పెట్టారని చెప్పారు.
ఈ ఘటనపై కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికత్వం ప్రదర్శించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కొడుకు ఆ హీరో అభిమాని అని కొడుకు కోసం ఒక్కో టికెట్ రూ.3వేల చొప్పున రూ.12వేలు పెట్టి ఆ కుటుంబం సినిమా టికెట్లు కొన్నారని సీయం రేవంత్ రెడ్డి తెలిపారు. థియేటర్ లో ఒక తల్లి చనిపోతే ఆ కుటుంబాన్ని, ఆ పిల్లవాన్ని హీరో పరామర్శించలేదన్నారు. అలాంటి మానవత్వం లేని వాళ్ళను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తే పదేళ్లు మంత్రులుగా పని చేసిన వాళ్లు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్నారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని భావించి మా ప్రభుత్వం ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చిందని అలా అని ప్రాణాలు బలి తీసుకుంటే వాళ్లను ఏమీ అనొద్దు అంటే ఇదేం న్యాయమని సీయం ప్రశ్నించారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగానికి లోబడే మా ప్రభుత్వం నడుచుకుంటోందన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన హీరో ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖుల్లో.. బాధిత కుటుంబాన్ని ఒక్కరైనా కలిసారా అని నిలదీశారు. సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం కోరుకుంటున్నరో తెలియడం లేదని వ్యాపారాలు చేసుకోండి కానీ ప్రాణాలతో చెలాగాటమాడటానికి మేం ఒప్పుకోమని.. మేం అధికారంలో ఉన్నంత కాలం అలాంటి ఆటలు సాగనివ్వమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో స్పష్టం చేశారు.