నటుడు మంచు మోహన్‌బాబుకు ఢిల్లీ హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఆయన పేరును సోషల్ మీడియాలో దుర్వినియోగం చేయకుండా, ఆయన వ్యక్తిగత హక్కులకు భంగం కలగకుండా కీలక తీర్పు వెలువరించింది.
పదిరోజుల క్రితం హైదరాబాద్ శివారులోని జల్ పల్లిలో తన నివాసంలో జరిగిన వ్యవహారాల్లో ఒక జర్నలిస్టుపై దాడి చేశారంటూ మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదయ్యింది. అయితే, తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ మోహన్‌బాబుకు ఊరట దొరకలేదు. అయితే, మరోవైపు.. ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మంచు మోహన్‌బాబుకు న్యాయస్థానం రిలీఫ్ ఇచ్చేలా తీర్పు ఇచ్చింది.
తన పేరు, స్వరం, ఫోటోలను తన అనుమతి లేకుండా వినియోగిస్తున్నారని.. తన వ్యక్తిగత హక్కులకు, ప్రచార హక్కులకు భంగం కలిగిస్తూ విస్తృతంగా వాడుకుంటున్నారని మోహన్ బాబు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారించిన ఢిల్లీ హైకోర్టు.. సోషల్ మీడియా అకౌంట్స్, ఈ-కామర్స్ వెబ్ సైట్స్, ఏఐ చాట్ బాట్స్ లు ఆయన పేరు, ఫోటో, స్వరంలను ఉపయోగించే విషయంలో సంయమనం పాటించాలని కోర్టు సూచించింది. ఈ మేరకు.. దీనిపై విచారణ అనంతరం జస్టిస్ మినీ పుష్కర్ణ కీలక ఆదేశాలు జారీ చేశారు. మోహన్ బాబు వ్యక్తిగత హక్కులు దుర్వినియోగం కాకుండా ఉత్తర్వ్యులు ఇవ్వకపోతే ఆయనకు తీరని నష్టం జరిగే అవకాశం ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఆయన వ్యక్తిత్వాన్ని ఉపయోగించుకుంటూ ఎటువంటి వస్తువులు విక్రయించరాదని కూడా ఆదేశించారు.
మరోవైపు.. గూగుల్ సంస్థకు కూడా న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది. మోహన్‌బాబు చేసిన ఫిర్యాదుపై గూగుల్ వెంటనే స్పందించాలని, ఆమోదయోగ్యం కాని కంటెంట్‌ను, మోహన్‌బాబు అభ్యంతరం వ్యక్తంచేసిన కంటెంట్‌ను తొలగించాలని ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను వచ్చే యేడాది మే నెలకు వాయిదా వేసింది.