ప.గో జిల్లా ఉండిలో సంచలనం
కొరియర్ లో డెడ్ బాడీ పార్సిల్ గా వస్తే… ఊహకే భయం గొలిపే ఈ సంఘటన ఏపీలో ని గోదావరి జిల్లాలో సంచలనంగా మారింది. పశ్చిమగోదావరి జిల్లా యండగండి గ్రామంలోని ఉండి మండలంలో ఈఅనూహ్య ఘటన జరిగింది.
నాగ తులసి అనే 45 ఏళ్ల మహిళ సొంత ఇల్లు కట్టుకోవాలని తలచి అందుకు క్షత్రియ సేవా సమితి వారి ఆర్థిక సాయాన్ని కోరింది. అందుకు అంగీకరించిన ఆ సంస్థ తొలి విడతగా ఆమెకు ఇంటికి సంబంధించిన టైల్స్ పంపించింది. అయితే ఇంటి నిర్మాణానికి మరింత సాయం కావాల్సి రావడంతో ఆ మహిళ మళ్లీ ఆ సంస్థ సహాయాన్ని కోరింది.అనుకూలంగా స్పందించిన సంస్థ ఈసారి ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ ఇస్తామని చెప్పింది. గురువారం రాత్రి ఓ అపరిచత వ్యక్తి వచ్చి గుమ్మంలో పెద్దపార్సిల్ ను దింపి అందులో ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ ఉన్నాయని చెప్పి వెళ్లి పోయాడు.
పార్సిల్ లో డెడ్ బాడీ
ఆతర్వాత ఆ పార్సిల్ విప్పిన ఆమె కంగు తింది.. భయపడిపోయింది. 45 ఏళ్లవయసున్న ఓ వ్యక్తి డెడ్ బాడీ అది.. ఆ డెడ్ బాడీతో పాటు ఒక లేఖ కూడా ఉంది. తక్షణం కోటీ 30 లక్షల రూపాయలు పంపాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని వార్నింగ్ ఆ లేఖలో ఉంది. హడలిపోయిన కుటుంబం వెంటనే పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీని ప్రభుత్వాసుపత్రికి శవ పంచనామా నిమిత్తం తరలించారు. అయితే ఎవరు ఈ ఘటనకు పాల్పడి ఉంటారన్న అంశంపై దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ మధ్య కాలంలో ఆ ప్రాంతంలో ఏవైనా గొడవలు జరగడం, లేదా అనుమానాస్పద హత్యలు జరగడం,లేదా డెడ్ బాడీలు మిస్ అవడం జరిగిందా అన్న కోణంలో ఆరాతీస్తున్నారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల ప్రజలను ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేసింది.