అమెరికాలో బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో.. తమ ప్రభుత్వం పగ్గాలు ట్రంప్ సర్కారుకు అప్పగించేముందు తీసుకున్న ఈ నిర్ణయం విదేశీయుల్లో ముఖ్యంగా ప్రవాస భారతీయుల్లో సంతోషం నింపుతోంది. ఎందుకంటే ఈ నిబంధనల సడలింపు ఎక్కువగా భారతీయులకే ప్రయోజనం చేకూర్చనుంది. ట్రంప్ రెండోసారి గెలిచాక ఆమెరికాలో ఉండే భారతీయులు, అక్కడ చదువుకునే భారతీయ విద్యార్థుల భవిష్యత్తుపై అనేక సందేహాలు నెలకొన్న సమయంలో యూఎస్ ప్రభుత్వం ప్రకటన లక్షలాది మంది ప్రవాస భారతీయుల్లో ఉత్సాహాన్ని నింపింది.
హెచ్-1బీ వీసాల నిబంధనల్లో సడలింపునకు సంబంధించి డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) తన నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే, ఈ నిర్ణయం జనవరి 17, 2025 నుండి అమలులోకి వస్తుంది. H1-B వీసా ఆమోద ప్రక్రియను క్రమబద్ధీకరించడం, వేగవంతం చేయడం, అలాగే.. రిక్రూటర్లు, ఎంప్లాయిస్‌కు ఎక్కువ సౌలభ్యాన్ని అందించడమే తాజా సవరణ లక్ష్యమని చెబుతున్నారు. ఈ కీలక నిర్ణయంతో భారతీయులు ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంది.
సవరించిన హెచ్-1బీ వీసా నిబంధనలతో అమెరికన్ కంపెనీలు క్లిష్టమైన ఉద్యోగ ఖాళీలను మరింత సమర్థవంతంగా భర్తీ చేయడానికి వీలు కల్పిస్తుందంటున్నారు. 2025 జనవరి 17 నుంచి అమలులోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం యూఎస్‌లో F-1 వీసాలపై ఉన్న భారతీయ విద్యార్థులకు కూడా ఎక్కువ ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్త నియమాలు కొత్త ఉద్యోగాల్లోకి మారడానికి వారికి సహాయపడతాయి. అలాగే అత్యంత నిపుణులైన టెకీలను నిలుపుకోవడానికి యజమానులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తుందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
తాజా సవరణలతో F-1 విద్యార్థి వీసాలు ఉన్నవాళ్లు, ఉద్యోగులు.. హెచ్-1బీ వీసాకు మారడం, తద్వారా అమెరికాలోనే కొనసాగడం వంటి పరిణామాలు కొత్త నిబంధనలతో చోటు చేసుకోబోతున్నాయి. దరఖాస్తుదారులు తమ హెచ్-1బీ దరఖాస్తులను సమర్పించడానికి కొత్తగా ప్రవేశపెట్టిన ఐ-129 అప్లికేషన్ ఫారం నింపాలి. ఈ వెసులుబాటు కింద అప్లై చేసుకునేవాళ్లు.. తమ వీసా దరఖాస్తు తమ డిగ్రీతో నేరుగా ముడిపడి ఉన్న ఉద్యోగానికి సంబంధించిందని నిరూపించేలా ఆధారాలుసమర్పించాల్సి ఉంటుంది. వీసాల జారీలో దుర్వినియోగాన్ని తగ్గించాలనేది కూడా ఈ నిబంధన వెనకున్న లక్ష్యంగా చెబుతున్నారు. అంతేకాదు.. హెచ్1-బీ వీసా నిబంధనలను పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకునే, జరిమానాలు విధించే, లేదా వీసాలను రద్దు చేసే అధికారం ఉంటుంది.
ఈ నిబంధనల సడలింపుల్లో మరో కీలకమైన అంశం కూడా ఉంది. వ్యక్తిగతంగా ఇంటర్వ్యూకి రావాల్సిన అవసరం లేని డ్రాప్ బాక్స్ విధానాన్ని మరింత సరళతరం చేయనున్నారు. అభ్యర్థులు ఇంతకుముందు చేసుకున్న దరఖాస్తుల రికార్డులతో సరిపోల్చుకొని అనుమతులు వేగంగా పొందేలా ఈ మార్పు దోహదపడనుంది. అలాగే, గతంలో హెచ్-1బీ వీసాకు అనుమతి లభించినవారి ప్రాసెసింగ్ మరింత వేగంగా పూర్తవుతుంది.
ప్రధానంగా భారత్, చైనా వంటి దేశాల నుంచి ప్రతీ ఏడాది వేలాదిమంది ఉద్యోగులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలు హెచ్-1బీ వీసాలపై ఆధారపడతాయి. వాస్తవానికి హెచ్-1బీ వీసా హోల్డర్లలో అత్యధిక మంది భారతదేశానికి చెందినవారే. 2023లో 3,86వేల మందికి జారీ చేసిన హెచ్-1బీ వీసాల్లో భారతీయులే 72.3శాతం ఉన్నారు. హెచ్-1బీ వీసా దరఖాస్తులు తరచుగా వార్షిక పరిమితిని మించిపోవడంతో వీసాలు కొన్నేళ్లుగా లాటరీ విధానం ద్వారా కేటాయిస్తున్నారు. దీంతో కొంతమంది నష్టపోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు సడలించిన నిబంధనలతో ఎక్కువమందికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఈ నిర్ణయం అమెరికాలో స్థిరపడ్డ ఎన్నారైలతో పాటు.. చదువుల కోసం, ఉద్యోగాల కోసం వెళ్లిన భారతీయుల్లోనూ ఉత్సాహం నెలకొంది.