ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ తగ్గిపోయిందన్న మాట అవాస్తవమని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస అన్నారు. సోమవారం అసెంబ్లీ లాబీలో విలేకరులతో చిట్ చాట్ చేసిన శ్రీనివాసరెడ్డి అమరావతిలో ఎవరూ పెట్టుబడలు పెట్టడానికి ముందుకు రావడం లేదని, పెట్టుబడిదారులందరూ హైదరాబాద్, బెంగళూరుల్లో పెట్టడానికే ఆసక్తి చూపిస్తున్నారని మంత్రి అన్నారు. ఇటీవల అమరావతిలో వరదలు వచ్చిన తరువాత ఆవైపు కూడా ఎవరూ చూడటం లేదన్నారు. మళ్ళీ అందరూ తెలంగాణ బాట పట్టారన్నారు. గడచిన రెండు మూడు సంవత్సరాలతో పోలిస్తే తెలంగాణలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం బాగా పెరిగిందని అన్నారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కూడా బాగా పెరింగిదన్నారు. మా ప్రభుత్వం సుమారు 15 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా భూమి లేని నిరుపేదలకు 12వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం వెయ్యి కోట్లు విడుదల చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి చెప్పారు. సంక్రాతికి రైతు భరోసా ఇస్తామని అలాగే ఆసరా పెన్షన్ల విడుదలకు కూడ ప్రయత్నిస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన మాట వాస్తవమని ఆయన అన్నారు. చర్చ నుండి తప్పించుకునేందుకే అనవసర లొల్లి చేస్తున్నారన్నారు. కొంత మంది ఆంధ్ర నుంచి బోనస్ కోసం సన్నాలను తెలంగాణలోకి తెచ్చి అమ్మే ప్రయత్నం చేస్తున్నాని వారి ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నామన్నారు. సినీ పరిశ్రమ ను మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మాకు సినిమా వాళ్లు, జర్నలిస్టులు, ప్రజలు అందరు సమానమే అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.