జేపీసీతో ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నాలు
ఒక దేశం.. ఒకే ఎన్నిక అన్న అజెండాతో అడుగులేస్తున్న బీజేపి జమిలి బిల్లును రేపు అంటే మంగళవారం పార్లమెంటు ముందుకు తీసుకురానుంది. సోమవారం అజెండాలో ఆ బిల్లు లేకపోవడంతో ఎన్డీ ఏ ప్రభుత్వం వెనక్కు తగ్గిందన్న ఊహాగానాలు రేగాయి. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ తాజాగా ఇవాళ రేపటి అజెండాలో దాన్ని చేర్చి నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. లోక్ సభలో ముందు ఈ బిల్లును ప్రవేశ పెట్టి ఆ తర్వాత దానిని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపుతారని సమాచారం. జమిలి ఎన్నికల నిర్వహణకు వీలుకల్పించేలా రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉండటంతో వాటికి సంబంధించిన బిల్లులను, జమిలి బిల్లును రెంటినీ రేపు లోక్ సభల పెడతారు.జమిలి బిల్లుపై విపక్షాలు వ్యతిరేకంగా ఉన్నందున జేపీసీ ద్వారా మార్గం సుగమం చేసుకోవాలని ఎన్డీఏ కూటమి భావిస్తోంది.కేంద్ర న్యాయ శాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ బిల్లులను ప్రవేశ పెడతారు. భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి కాబట్టి ఏకాభిప్రాయ సాధనకు జేపీసీయే మార్గమని ఎన్డీఏ భావిస్తోంది. అయితే జేపీసీలో పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఏ పార్టీకి ఎక్కువ స్థానాలుంటే ఆ పార్టీ ఎంపీయే జేపీసీ కమిటీకి ఛైర్మన్ అవుతారు. దాదాపు 90 రోజుల్లో దీనిపై చర్చలు ఏకాభిప్రాయ సాధన జరుగుతాయి.
అయితే లోక్ సభ , అసెంబ్లీ ఎన్నికలతో పాటే స్థానిక సంస్థలకూ ఎన్నికలు నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కమిటీ సూచించినా, ప్రస్తుతం సమయం తక్కువగా ఉంది కాబట్టి దానికి రాష్ట్రాల మద్దతు అవసరం కాబట్టి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రతిపాదనలను ఇందులో చేర్చకుండా తర్వాత కాలంలో చేపట్టాలని భావిస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మరో నాలుగు రోజుల్లో ముగియ నున్నాయి కాబట్టి జమిలి బిల్లును ఓ కొలిక్కి తేవాలని ఎన్డీఏ పెద్దలు నిర్ణయించినట్టు కనిపిస్తోంది.