సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉండే మహబూబాబాద్‌లో ఎలక్ట్రిక్ లోకో మోటివ్ పీరియాడిక్ ఓవరాలింగ్ వర్క్‌షాపు ఏర్పాటు చేయాలని రైల్వే మజ్దూర్ యూనియన్ వరంగల్ బ్రాంచ్ సెక్రెటరీ ఆవుల యుగంధర్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ సెంటర్ కోసం కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఒప్పించాలని ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్.. జిల్లా కేంద్రం కావడంతో పాటు.. గిరిజన పార్లమెంటు కేంద్రం అని, ఇక్కడ, లోకోమోటివ్ వర్క్‌షాప్ ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని రకాల వనరులు ఉన్నాయని యుగంధర్ గుర్తు చేశారు. మహబూబాబాద్‌లో వర్క్‌షాప్ ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు.. ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని అన్నారు. లోకోమోటివ్ పీరియాడిక్ ఓవరాలింగ్ వర్క్‌షాప్ ఏర్పాటు చేస్తే.. ఈ ప్రాంతంలోని 5వేల మందికి ప్రత్యక్షంగా, మరో ఐదు వేల మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుందని వివరించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, రైల్వేలో వివిధ స్థాయిల్లో పని చేస్తున్న అధికారులు చొరవ చూపిస్తే ఎలక్ట్రికల్ లోకో మోటివ్ పీరియాడిక్ ఓవరాలింగ్ వర్క్‌షాపు ఏర్పాటు పెద్ద కష్టమేమీ కాదన్నారు. సికింద్రాబాద్ జోన్‌లో ఎలక్ట్రికల్ లోకో మోటివ్ పీరియాడిక్ ఓవరాలింగ్ వర్క్‌షాపు లేకపోవడం వల్ల తమిళనాడులోని పెరంబూర్, ఒడిశాలోని బుస్వాల్ వర్క్‌షాపులకు వెళ్లాల్సి వస్తోందని, ఫలితంగా అధిక వ్యయ భారం, సమయం వృథా అవుతున్నాయని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ జోన్ పరిధిలో ఉన్న మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ఎలక్ట్రికల్ లోకో మోటివ్ పీరియాడిక్ ఓవరాలింగ్ వర్క్‌షాపు ఏర్పాటు చేస్తే సంస్థకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని, స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని రైల్వే మజ్దూర్ యూనియన్ వరంగల్ బ్రాంచ్ సెక్రెటరీ యుగంధర్ విజ్ఞప్తి చేశారు.