ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచి తద్వారా రైతులకు స్థిరమైన ఆదాయం వచ్చే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శనివారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ కమీషనర్ ఢిల్లీరావు, ఉద్యాన శాఖ డైరక్టర్ శ్రీనివాసులు, సూక్ష్మ సేధ్యం విభాగ ప్రత్యేక అధికారి వెంకటేశ్వరులుతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంపొందించేందుకు, పరిశ్రమలకు మండలాల కేటాయింపులకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఆయిల్ ఫెడ్ పరిధిలో ఏలూరు జిల్లాలో నూతన ఆయిల్ పామ్ పరిశ్రమ నిర్మణానికి డీ.పి.ఆర్ తక్షణమే రూపొందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో నూతన పరిశ్రమ నిర్మాణానికి వేగంగా చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.
గడిచిన తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్ల వ్యవధిలో వ్యవసాయ యంత్రీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రూ.1226 కోట్లు ఖర్చు చేస్తే ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి అసమర్ధ ప్రభుత్వంలో రూ.367 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మంత్రి అచ్చాన్నాయుడు తెలిపారు. వ్యవసాయ యంత్రపరికరాలు గడిచిన ఐదేళ్ల కాలంలో వినియోగం లేకపోవడంతో ఇప్పుడు కేటాయింపులు రూ.157కోట్లకు వచ్చాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలియచేశారు. అసమర్ధ వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్లిందనడానికి ఇదే సాక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వ్యవసాయ యంత్రికరణకు చర్యలు వేగవంతం చేసి రైతులకు యంత్రపరికరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. యంత్ర పరికరాలకు కేటాయింపులు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.
రాష్ట్రంలో పండ్ల తోటల సాగు ఆధారంగా క్లస్టర్లు ఏర్పాటు చేసి నాణ్యమైన ఉత్పత్తులను పండించే విధంగా, ఎగుమతులను వృద్ధి చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతుందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అందుకు తగిన కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు.