దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన కీలకమైన బిల్లుల్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్దమైంది. లోక్‌సభతో పాటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా తయారు చేసిన రెండు బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. వీటిని ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదించింది.కేంద్రం జమిలి బిల్లుకోసం వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో ఈ ఎన్నికలు అప్పుడే రావని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నారు. 2029 లోనే జమిలి ఎన్నికలు వస్తాయని ఆయనంటున్నారు.
ఇదీ బాబు లాజిక్..
2024లో ఎన్నికైన లోక్‌సభ మొదటి సమావేశం ముగిసినందున, 2029 ఎన్నికలలో ఎన్నికైన సభ యొక్క తొలి సమావేశమై అప్పుడు అపాయింట్ మెంట్ తేదీగా గుర్తిస్తారని తెలుస్తోంది. అంటే 2034 నాటికి ఆ సభ పూర్తి కాలం ముగిసిన తర్వాత జమిలి ఎన్నికలు నిర్వహించవచ్చని సమాచారం. తాజా బిల్లుల ప్రకారం లోక్‌సభ లేదా ఏదైనా రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ పూర్తి కాల వ్యవధి ముగిసేలోపు రద్దు అయితే, మిగిలిన ఐదేళ్ల కాలానికి ఆ అసెంబ్లీకి మాత్రమే మధ్యంతర ఎన్నికలు ఉంటాయి.
మరి ఈవాదన నిజమే అయితే 2034లో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమైతే బీజేపి ఇప్పుడెందుకు పరుగులు పెడుతున్నట్లు? ఎన్డీఏలో తమ మద్దతు లేకపోయినా కొన్ని కీలక బిల్లులు పెట్టేందుకు సై అని అడుగులేస్తున్న కేంద్రం 2034 దాకా ఆగుతుందా? అంటే ఈ మధ్యలో 2029లో ఓ సార్వత్రిక ఎన్నిక జరగాలి. అప్పుడు బీజేపీ అధికారం లోకి వస్తేనే మళ్లీ ఈ బిల్లుపై ఆత్రుత పడుతుంది. ఒక వేళ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఈ బిల్లు ఆమోదం పొందే ఆస్కారం లేదు. జమిలి బిల్లును ఇప్పుడు చట్టంగా చేసి ఉంచి వచ్చే ఎన్నికల్లో బీజేపి గెలిచి అప్పటి లోక్ సభ తొలి అపాయింట్ మెంట్ డేట్ రోజు ప్రకటిస్తారా? ఇదంతా మాటల్లో చెప్పినంత సులభమా? అంత సుదీర్ఘ కాలం వేచి ఉండాల్సి రావడం బీజేపి లాంటి పార్టీకి మంచిదా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.