అల్లు అర్జున్ అరెస్ట్ కావడం బాధాకరమని ఆ సంఘటనపై తాను విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్ అన్నారు. సంధ్యా ధియేటర్ తొక్కిసలాట కేసులో శుక్రవారం అల్లు అర్జున్ అరెస్ట్ కావడంపై నాగేందర్ స్పందించారు. అల్లు అర్జున్ తనకు బంధువు అవుతాడని ఆయన జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మంచి పేరు తీసుకు వచ్చారని కొనియాడారు. అల్లు అర్జున్ అరెస్ట్ కావడం దురదృష్టకరమైన సంఘటనగా నేను భావిస్తున్నానని, అయితే వెంటనే బెయిల్ దొరకడం సంతోషకరమని దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా హీరోనే కాదు ప్యాన్ వరల్డ్ హీరో అన్నారు దానం. అయితే ప్రభుత్వం అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయించిందని ప్రతిపక్షాలు అనడం భావ్యం కాదన్నారు దానం నాగేందర్.