- ఉచితాల హామీలతో ఆప్, అభ్యర్ధులతో కాంగ్రెస్… రేస్ లో ముందు
- కేజ్రీ ఓటమే బీజేపి అజెండా..
ఢిల్లీ ఎన్నికల్లో ఉచితాలే గెలుపు మంత్రం కాబోతున్నాయి. ఈరేసులో ఆప్ అందరికంటే ముందుంది. స్కీములతో అధికారంలోకి వచ్చిన ఈ సారి కూడా వాటినే నమ్ముకుంది. జనాకర్షక పథకాలతో గెలుపు కోసం ఆప్ దూకుడు పెంచితే, అందరికన్నా అభ్యర్దుల లిస్టు ముందు ప్రకటించి కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసింది. దాదాపు 21 మందితో తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి కీలక నేతలకు సమఉజ్జిలను బరిలోకి దింపే కసరత్తు ముమ్మరం చేసింది కాంగ్రెస్. ఇక ఈ సారి కేజ్రీవాల్ ను ఢిల్లీ నుంచి తరిమి కొట్టాలన్న కసితో రంగంలోకి దిగతున్న బీజేపి తమ అస్త్రాలకు పదును పెడుతోంది. ప్రధాన పోటీ కేజ్రీవాల్,బీజేపీ మధ్యే ఉండబోతోంది.
ఉచితాలపై కేజ్రీ క్రేజీ…
లిక్కర్ పాలసీ స్కామ్లో చిక్కుకుని జైలుకెళ్లిన ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఈసారి కూడా సంక్షేమానికే పెద్ద పీట వేస్తున్నారు. మరోసారి ఉచితాలకు తెర తీశారు. తాము ఢిల్లీ మహిళలకు గతంలో బాకీ ఉన్న వెయ్యిరూపాయల సాయం స్కీమును రివైవ్ చేసారు. కేబినెట్ ఆమోదంతో అది అమలుకు తాము రెడీగానే ఉన్నా.. ఈసీ కోడ్ రానున్నందున సాధ్యంకాలేదన్నారు. గెలిపిస్తే ఫిబ్రవరి నుంచి దానిని అమలు చేస్తామని అయితే రెట్టింపు సొమ్ము అందిస్తామనీ హామీ ఇచ్చారు. తాజా హామీ ప్రకారం ఢిల్లీ నిరుపేద మహిళలకు నెలకు రూ. 2,100 సాయం వారి అక్కౌంట్లలో జమ చేస్తారు. దీనికి మహిళల బ్యాంకు అక్కౌంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియకూడా ప్రారంభించారు.
ఐయామ్ఏ మెజీషియన్
తానొక ఇంద్రజాలికుడిని అంటున్నారు కేజ్రీవాల్.. గత హామీలే నెరవేర్చలేదు.. కొత్త హామీలేంటి అని అపహాస్యం చేస్తున్న బీజేపికి తాను మెజీషియన్ననీ తలచుకుంటే ఆ సొమ్ము అందించగలననీ రిటార్ట్ ఇచ్చారు. అయితే ముందు పంజాబ్ మహిళలకు చేసిన హామీ నెరవేర్చాలని విమర్శిస్తోంది బీజేపి. పంజాబ్ లో చాలా హామీలు అక్కడి ప్రభుత్వం ఇంకా నెరవేర్చలేదు.తనను కుట్రపూరితంగా జైలుకు పంపి ప్రజలకు సంక్షేమం అందకుండా చేశారని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు.గవర్నర్ సక్సేనా బడ్జెట్ కేటాయింపులకు మోకాలడ్డుతూ తమను అపఖ్యాతి పాల్జేస్తున్నారని ఆరోపిస్తున్నారు.ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తైన చీపురు కట్ట ఆపార్టీకి చాలా ప్లస్ పాయింట్. గత ఎన్నికల్లో ఢిల్లీ ఆటో డ్రైవర్లు కేజ్రీవాల్కు బ్రహ్మరథం పట్టారు. ఆటోలపై చీపురు కట్ట పోస్టర్ తో కూడిన కేజ్రీవాల్ పోస్టర్లు పెట్టి కేజ్రీవాల్ కు ప్రచారంలో సాయపడ్డారు.గత ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన కేజ్రీవాల్ ఈసారి అనేక ఆటు పోట్ల మధ్య ఎలా నెగ్గుకొస్తారో చూడాలి.
ఆప్, కాంగ్రెస్ ఎవరికి వారే..
ఇండియా కూటమిలో భాగస్వాములైనా కాంగ్రెస్,ఆప్ ఈ ఎన్నికల్లో కలసి పోటీ చేయడం లేదు. కాంగ్రెస్ తో కలిసేది లేదని కేజ్రీవాల్ తెగేసి చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ కూడా జోరు పెంచింది. అభ్యర్ధుల ఎంపికలో ముందుంది. కేజ్రీవాల్ కు, మనీష్ సిసోడియాలాంటి వారిని ఎదుర్కొనడానికి దీటైన అభ్యర్ధులను వెదుకుతోంది.ఎన్నికల వేళకి కాంగ్రెస్ మేనిఫెస్టో ఎలా ఉండబోతోందన్నది చూడాలి.
అవినీతి అస్త్రమే బీజేపీ ఆయుధం
కేజ్రీవాల్ పై అవినీతి ముద్రనే తమ అస్త్రంగా మార్చుకుంటోంది బీజేపి. లిక్కర్ పాలసీ స్కామ్ లో చిక్కుకుని జైలు కెళ్లిన కేజ్రీవాల్ ని, ఆప్ పార్టీని విచ్చిన్నం చేసి బలహీన పరిచేలా బీజేపి వ్యూహం ఉండబోతోంది. కేజ్రీవాల్ సన్నిహితులు, సహచరులు ఇప్పటికే అవినీతి కేసులలో చిక్కుకున్నారు. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలు మరికొన్ని ఇంకా నెరవేర్చలేదు. కాబట్టి వాటిపై కూడా బీజేపి విమర్శల దూకుడు పెంచబోతోంది.
ఆప్ చావో..రేవో..
అధికార ఆప్ పార్టీకి ఈ ఎన్నికలు చావో, రేవో లాంటివి. పార్టీ రాజధానిలో పాగా వేసి విస్తరించుకుంటూ వెళుతున్న నేపధ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ అప్పటి సీఎం కేజ్రీవాల్ మెడకు చుట్టుకోవడంతో ఆ పార్టీ భవితవ్యం సందిగ్ధంలో ఉంది. మనీష్ సిసోడియా లాంటి కీలక నేతలు జైలు పాలవడం, చివరకు కేజ్రీవాల్ కూడా జైలుకు వెళ్లాల్సి రావడం , ఆయన స్థానంలో మరోకరిని కుర్చీలో కూర్చో పెట్టాల్సి రావడంతో ఆప్ పార్టీ రాజకీయ వత్తిడులకు గురయ్యింది. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి , 2025లో ఎన్నికలు జరుగుతాయి. అధికార ఆప్ పార్టీని ఢిల్లీ బయటకు తరిమేయాలన్న పట్టుదలతో బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.
జమిలి అడ్డు కానుందా?
ఢిల్లీ లో గెలవాలన్న బీజేపి ఈసారి అందుకు పకడ్బందీ కసరత్తు చేస్తోంది. ఈనెల 20న రాజ్యసభ ఎన్నికల తర్వాత సీన్ మారనుంది. సొంతంగా మెజారిటీ సాధించి పార్లమెంటు ఉభయ సభల్లోనూ జమిలి బిల్లును గట్టెక్కించుకుని 2027లో జమిలి ఎన్నికల నిర్వహణ పై బీజేపీ పట్టుదలతో ఉంది. అయితే ఢిల్లీ ఎన్నికలు వచ్చే ఫిబ్రవరిలో జరగాలి.ఒకవేళ ఎన్నికలు జరిగితే 2027లో మళ్లీ అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాలతో కలసి అక్కడ కూడా ఎన్నిక జరపాల్సి ఉంటుంది. ఇది ఖర్చుతో కూడుకున్నది.. కాబట్టి ఢిల్లీ ఎన్నికలు ఇప్పుడే జరుపుతారా లేక వాయిదావేస్తారా అన్నది తేలాల్సి ఉంది. పైగా ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం . కాబట్టి పార్లమెంటులో సవరణ చట్టం ద్వారా దాన్ని మార్చాలి. దీనికోసం బీజేపికి పార్లమెంటులో కాలం కలసి రావాలి. కాబట్టి ఢిల్లీ ఎన్నికలు ఇప్పుడు యధాప్రకారం జరిపేసే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.