ప్రజాప్రభుత్వ విజయోత్సవాల పేరుతో కాంగ్రెస్ ఏడాది పాలన వేడుకలు ఘనంగా జరిగాయి. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై విమర్శలు,లగచర్ల భూసేకరణ నిర్వాసితుల నిరసనలు అధికార పక్షానికి తల బొప్పి కట్టించింది. భూసేకరణ ఆంశం ఢిల్లీ వరకు చేరి ప్రభుత్వానికి కొంత డ్యామేజీ చేసింది. హైడ్రాతో హైరానా పడ్డ హస్తం శ్రేణులు…. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో ఉపశమనం పొందాయి.
ప్రభుత్వంపై విమర్శలు…సానుకూలంగా మారిన వైనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకే ఆ ఘనత దక్కుతుందని చెప్పవచ్చు. ఏడాది పాలనలో జరిగిన కొన్ని ముఖ్యమైన పరిణామాలు మననం చేసుకుంటే…
మూసీ సుందరీకరణ
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల నుంచి గ్రేటర్ పరిధి దాటేంత వరకు మూసీ వెంబడి దాదాపు 45 కిలోమీటర్ల పొడవున సుందరీకరణ చేపట్టాలని ప్రభుత్వం సిద్దమైంది. ఈ ప్రాంతంలోని 1600 కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు… మూసీ బాధితులకు ఆర్థికంగా రూ.2 లక్షల సాయం చేస్తామని, పరీవాహక ప్రజల పునరావాసానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మూసీలో 90శాతం హైదరాబాద్ మురుగు చేరుతుందని… దానిని శుద్ధి చేసేందుకు మంచి వాతావరణం అందించేందుకు రూ.3800 కోట్లతో 31 ఎస్టీపీలు గత ప్రభుత్వం విడుదల చేసిందని విపక్ష నేతలు గుర్తుచేశారు. పలు ఎస్టీపీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. పాతవి కొత్తవి కలిపితే 1900 ఎమ్ఎల్డీల మురుగు శుద్ధి అవుతుందని… దాంతో నల్గొండ వాసులకు కూడా మేలు చేకూరుతుందన్నారు.
అధికార పక్షనేతల వాదన మరోలా ఉంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో కాలుష్యానికి గురైన హాన్ నదిని ఆ దేశ ప్రభుత్వం శుభ్రపరచి, పునరుద్ధరించిందని ఆ కోవలోనే మూసి సుందరీకరణ చేసి హైదరాబాద్ కు అహ్లాదవాతావరణం అందిస్తామని ప్రకటించింది.
హైడ్రా లక్ష్యం… విమర్శలు
కబ్జాదారులు చెరువులను చెరపడుతూ హైదరాబాద్ మహానగరాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని… ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణ కోసం ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా చెరువుల పరిరక్షణ కోసం నడుం బిగించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చి వేశారు. ఈ మేరకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ 1979 నుంచి 2023 వరకు అందించిన నగర పరిధిలోని దాదాపు 56 చెరువుల శాటిలైట్ చిత్రాలను పరిశీలించారు. అందులో కొన్ని 60 శాతం, మరికొన్ని 80 శాతం మేర కుంచించుకుపోయినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.
హైదరాబాద్ నగరానికి తలమానికంగా నిలిచే హుస్సేన్ సాగర్ కూడా 21 శాతం కబ్జాకు గురైనట్లు హైడ్రా విచారణలో తేలింది. బతుకమ్మ కుంట, తుమ్మలకుంట వందకు వంద శాతం కనుమరుగైంది. ఈ క్రమంలోనే చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా మూడు దశల్లో పనులు చేపట్టింది. మొదటి దశలో ఎఫ్టీ ఎల్, బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలను గుర్తించి కట్టడి చేయడం, రెండో దశలో ఇప్పటికే నిర్మించిన వాటిని కూల్చివేయడం, మూడో దశలో గొలుసు కట్టు చెరువులకు ప్రాణం పోసేలా నాలాలను పరిరక్షించడం, చెరువుల్లో పూడిక తీయడం ప్రాధాన్యతలుగా హైడ్రా నిర్ణయించింది.