ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం తలపెట్టిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా 45వేల పై చిలుకు ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠాశాలల్లో నిర్వహించారు. బాపట్ల టౌన్ హైస్కూల్లో జరిగిన పేరెంట్, టీచర్స్ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో పాటు విద్యా శాఖ మంత్రి నారాలోకేష్ లు హాజరై విద్యార్థులు, తల్లిదండ్రులతో ముచ్చటించారు. అంతే కాకుండా విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించి వారితో మాట్లాడారు. తల్లిదండ్రులతో పాటు ఓల్డ్ స్టూడెంట్స్ నుంచి సలహాలు తీసుకున్నారు. పాఠశాల ఆవరణలోనే విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సహపంక్తి భోజనాలు చేశారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కడప మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరిగిన విద్యార్థులు, తల్లిదండ్రుల సమావేశానికి హాజరయ్యారు. అక్కడి విద్యార్థులతో ముఖాముఖీగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అయితే తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ స్వయంగా తమ పాఠశాలకు రావడంతో అక్కడి విద్యార్థులు సంతోషంలో మునిగి తేలారు. శనివారం రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ జరిగాయి ఈ కార్యక్రమంలో అధికార కూటమి పార్టీలకు చెందిన స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు.