తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఫైర్ బ్రాండ్ గా ఉన్న మాజీ మంత్రి హరీష్‌రావు పార్టీ అధికారంలో ఉన్నా… విపక్షంలో ఉన్నా ప్రజలతో సన్నిహితంగా ఉంటారని పేరుంది. సమస్యలపై తొందరగా స్పందిస్తారని… నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారని అనేకసార్లు రుజువైంది.
విపక్ష ఎమ్మెల్యేగా చురుకుగా వ్యవహరించే హరీష్ రావు ఏ మాత్రం అవకాశం చిక్కినా రాష్ట్రం మొత్తం కలియతిరిగి ప్రజా గళం వినిపిస్తారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తారు. ఈ తరుణంలో హరీష్ పై పోలీసు కేసు నమోదైంది.
ఫోన్ ట్యాప్ చేసి అక్రమ కేసులు పెట్టి వేధించారని చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి మాజీ మంత్రి హరీష్‌రావుపై ఫిర్యాదు చేశారు. హరీష్ రావు, మాజీ డిసిపి రాధా కిషన్‌రావు కలిసి తన ఫోన్ ట్యాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. 120(B), 386, 409 ఐటీ యాక్ట్ 2008 కింద కేసులు రిజిస్టర్ చేశారు.
తప్పుడు కేసులకు భయపడను: మాజీ మంత్రి హరీష్ రావు
తనపై నమోదు అయిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై హరీష్ ఘాటుగా స్పందించారు. “మిస్టర్ రేవంత్ రెడ్డి.. అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ్వస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీ మీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు. నీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం.
రుణమాఫీ విషయంలో దేవుళ్లను సైతం దగా చేసినవు అని అన్నందుకు యాదగిరి గుట్ట పోలీసు స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టించినవు. ఇచ్చిన హామీలను ఎగవేస్తున్న నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నందుకు బేగం బజార్ పోలీసు స్టేషన్‌లో తప్పుడు కేసు పెట్టించినవు.
సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు సైబర్ క్రైం పోలీసు స్టేషన్‌లో నా మీద సంబంధం లేని కేసు పెట్టించినవు. పార్టీ కార్యక్రమంలో మాట్లాడితే కోడిగుడ్డుమీద ఈకలు పీకి, తలాతోక లేని కేసు ఒకటి మానకొండూరులో పెట్టించినవు.
సిఎం రేవంత్ రెండు నాల్కల వైఖరి బట్టబయలు చేసినందుకు, ప్రజాక్షేత్రంలో నిలదీసినందుకు తట్టుకోలేక పంజాగుట్ట స్టేషన్‌లో మరో తప్పుడు కేసు పెట్టించినవు. నువ్వు లక్ష తప్పుడు కేసులు పెట్టించినా, నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. ప్రజా కోర్టులో, ప్రజా తీర్పుతో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగను. ” అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
హైకోర్టుల తాత్కాలిక ఉపశమనం
ఫోన్ ట్యాప్ కేసు అక్రమంగా బనాయించారని మాజీ మంత్రి హరీష్‌రావు హైకోర్టుకు వెళ్లగా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. తనపై నమోదు అయిన కేసును క్వాష్ చేయాలన్న మాజీ మంత్రి అభ్యర్థనను తోసిపుచ్చింది. అరెస్టు చేయొద్దని స్పష్టం చేసిన న్యాయస్థానం విచారణ చేయాలని ఆదేశించింది.
అధికారంలో ఉన్నప్పుడు హరీష్‌రావు ఓ అధికారితో కలిసి తన ఫోన్ ట్యాప్ చేశారని చక్రధర్ అనే వ్యక్తి పిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై హరీష్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదులో ఎలాంటి మెరిట్ లేకుండానే తనపై కేసు నమోదు చేశారని వాదించారు. రాజకీయ కుట్రలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారని వాదించారు.
నిజానిజాలు తేల్చందుకే కేసు నమోదు చేశామని ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ లక్ష్మణ్ తీర్పు వెల్లడించారు. కేసులు క్వాష్ చేయడానికి అంగీకరించలేదు. ఈ కేసులో విచారణ చేసుకోవచ్చని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. కానీ హరీష్‌ను అరెస్టు చేయకుండా విచారించుకోవచ్చని పేర్కొన్నారు.
ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలు
సిద్దిపేటలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు చక్రధర్ గౌడ్ లక్ష రూపాయల వరకు ఆర్థిక సాయం చేసేవారని స్థానికులు చెపుతున్నారు. సేవా ట్రస్టు ద్వారా ఆయన ఈ కార్యక్రమం చేపట్టడం అధికార పార్టీ నేత హరీశ్ రావుకు ఇష్టం లేదని, దీంతో వివిధ రకాల కేసుల్లో ఇరికించారని ఆరోపణలు ఉన్నాయి.
చక్రధర్ ను దారిలోకి తీసుకొచ్చేందుకు అనేక రకాలుగా హరీష్ రావు ఇబ్బందులకు గురిచేశారని…ఇప్పుడు ప్రభుత్వం మారటంతో చక్రధర్ ధైర్యంగా ముందుకు వచ్చారని సిద్దిపేట జిల్లాలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
ఈ కేసులో మరో ఆసక్తికరమైన ఆంశం ఏమిటంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీని పరిధిలో ఫిర్యాదుదారు చక్రధర్ గౌడ్ ఉండరు. ఆయన కూకట్ పల్లిలో నివసిస్తారు. చక్రధర్ దుబ్బాక చెందిన వ్యక్తి కాగా హరీష్ రావు సిద్దిపేట వాస్తవ్యుడు… గచ్చిబౌలిలో నివాసం ఉంటారు. ఇద్దరికి సంబంధం లేని పంజాగుట్టలో కేసు నమోదు ఎందుకు జరిగిందనే ఆంశంపై పలు రకాలుగా చర్చలు జరుగుతున్నాయి.
మరోవైపు ఈ కేసులో పోలీసుల విధానం ఏమిటి అనేదానిపై విభిన్న కోణాల్లో చర్చ జరుగుతోంది. హరీష్ పిటిషన్ పై విచారణ సందర్భంగా అరెస్టు చేయొద్దని స్పష్టం చేసిన న్యాయస్థానం విచారణ చేయాలని ఆదేశించింది. హరీశ్ కు అంటే తాత్కాలిక ఉపశమనమే లభించింది. సమయానుకూలంగా హరీశ్ ను విచారణకు పిలుస్తారని పోలీసు వర్గాల సమాచారం.
హరీష్‌రావును విచారణకు పిలుస్తారా? పంజాగుట్టకు, కేసుకు లింకేంటి..? ఈ కేసులో పోలీసులు ఏం చేయబోతున్నారనేది తొందరలోనే తేలనుంది.